CM KCR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం ముగిసింది. 119 నియోజకవర్గాలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఈనెల 15న బరిలో నిలిచేది ఎవరో తేలిపోతుంది. అయితే నామినేషన్ల దాఖలు సమయంలోనే కొన్ని స్థానాల్లో ఆసక్తికర పోటీ కనిపించింది. ఇందులో రెండు కీలకమైన అంశాలు.. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు సంబంధించినవే..
గజ్వేల్, కామారెడ్డిలో అధిక నామినేషన్లు..
119 నియోజకవర్గాల్లో దాఖలైన నామినేషన్లలో అత్యధికంగా గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల్లోనే దాఖలయ్యాయి. ఈ రెండింటినే ఎందుకింత హైలైట్ చేస్తున్నారంటే ఈ రెండుచోట్ల కేసీఆర్ పోటీ చేస్తున్నారు. కేసీయార్ కు వ్యతిరేకంగా నామినేషన్లు వేయాలని, కేసీఆర్‌ను ఓడించాలని కొన్ని వర్గాలు డిసైడ్ అయ్యాయనడానికి నామినేషన్లే నిదర్శనం. గజ్వేల్‌లో 154 నామినేషన్లు దాఖలవ్వగా, కామారెడ్డిలో 102 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిల్లో అత్యధికం కేసీఆర్‌పై వ్యతిరేకతతో వేసినవే కావడం గమనార్హం. వీటిల్లో కూడా కుల సంఘాలు, రైతు సంఘాలు, బాధిత సంఘాల్లోని వాళ్లు దాఖలు చేసిన నామినేషన్లే ఎక్కువగా ఉన్నాయి. తాజా నామినేషన్ల దాఖలులో నిరుద్యోగ సంఘాలు, అమరవీరుల కుటుంబాల సభ్యులు కూడా ఉన్నారు.
2018లో 13 మందే..
2018 ఎన్నికల్లో గజ్వేల్‌లో కేసీఆర్‌పై 23 మంది నామినేషన్లు దాఖలయ్యాయి. చివరకు 13 మంది పోటీలో నిలబడ్డారు. అప్పట్లో కేసీఆర్ విజయం నల్లేరు మీద నడకలాగ సాగిపోయింది. ఎందుకంటే కేసీఆర్‌పై వ్యతిరేకతతో పెద్దగా ఎవరు నామినేషన్లు దాఖలుచేయలేదు. కానీ ఇపుడు పరిస్ధితి పూర్తిగా మారిపోయింది. ఐదేళ్లలో గజ్వేలులో కేసీఆర్‌పై చాలా వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిపోయిందని అంటున్నారు. అలాగే కామారెడ్డిలో పోయిన ఎన్నికల్లో 9 మంది నామినేషన్లు వేస్తే ఇపుడు 102 మంది దాఖలు చేశారు.
అడ్డుకునే ప్రయత్నాలు..
రెండు నియోజకవర్గాల్లో కూడా ఇంతమంది నామినేషన్లు వేయనీయకుండా బీఆర్‌ఎస్ నేతలు చాలా ప్రయత్నాలు చేశారు. అయితే కేసీఆర్‌పై మండిపోతున్న వివిధ వర్గాలు లోకల్ నేతల మాటలను పట్టించుకోలేదు. కామారెడ్డి మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ పేరుతో తమ భూములను ప్రభుత్వం ఏకపక్షంగా లాగేసుకోవడంపై ఆగ్రహంతో ఉన్నారు. అలాగే గల్ఫ్ దేశాల్లో కార్మికులు, ఉద్యోగులు చనిపోతున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవటంలేదు. గల్ఫ్ బాధితుల కుటుంబాల ఓట్లే కనీసం 30 వేలుంటాయని అంచనా. వీళ్లంతా కేసీయార్ మీద వ్యతిరేకతతోనే నామినేషన్లు వేశారు. గజ్వేలులో కూడా సేమ్ టు సేమ్.
గెలుపు అంత ఈజీకాదు..
పరిస్థితి చూస్తుంటే.. కేసీఆర్‌పైనే ఇంత వ్యతిరేకత ఉంటే.. ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులపై ఎంత వ్యతిరేకత ఉందో అన్న ఆందోళన గులాబీ పార్టీలో కనిపిస్తోంది. అభ్యర్థులపై పోటీ తక్కువగా ఉన్నా.. ఎవరికి ఓటు వేయాలో ఇప్పటికే ప్రజలు డిసైడ్ అయి ఉంటారని అనుకుంటున్నారు. డబ్బులు పంచినా.. తీసుకుని ఓటు మాత్రం తాము అనుకున్నవారికే వేస్తారని భావిస్తున్నారు. దీంతో ఈసారి బీఆర్‌ఎస్‌తోపాటు, కేసీఆర్ గెలుపు అంత ఈజీ కాదన్న అభిప్రాయం తెలంగాణ వ్యాప్తంగా వ్యక్తమవుతోంది.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Gajwel and kamareddy are in a tough fight for cm kcr
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com