BRS: తెలంగాణలో మొన్నటి వరకు అధికార బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదిగింది బీజేపీ. దీంతో రెండు పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా మాటల యుద్ధం.. దర్యాప్తు సంస్థలతో విచారణలు సాగాయి. కర్ణాటక ఫలితాలతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. బీజేపీ గ్రాఫ్ వేగంగా పడిపోతూ వస్తోంది. అదే సమయంలో బీజేపీ స్థానాన్ని కాంగ్రెస్ ఆక్రమిస్తోంది. అధికార బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతోంది. దీంతో కేసీఆర్, బీఆర్‌ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పుడు కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తున్నారు.
కాంగ్రెస్‌ను చీల్చే యత్నం..
ఇదిలా ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకోవడాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్ ఆ పార్టీని కూడా దెబ్బతీయాలని భావించారు. ఈమేరకు కాంగ్రెస్‌కు చెందిన కీలక నేతలను బీఆర్‌ఎస్‌లోకి లాగేందుకు యత్నించారు. అయితే కాంగ్రెస్ పుంజుకుంటుండడం.. ప్రస్తుత పరిస్థితిలో బీఆర్‌ఎస్‌లో చేరితే సర్దుబాటుకు సమయం పట్టవచ్చన్న భావనలో కాంగ్రెస్ నేతలు పడ్డారు. దీంతో కేసీఆర్ ఆశించింది జరుగలేదు.
115 నియోజకవర్గాలకు అభ్యర్థుల ప్రకటన..
కాంగ్రెస్ నేతలు బీఆర్‌ఎస్‌లో చేరికలపై తర్జనభర్జన పడుతున్న సమయంలోనే గులాబీ బాస్.. బీఆర్‌ఎస్ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ ప్రకటించారు. ఏకంగా 115 స్థానాలకు ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారు చేశారు. కేవలం 7 స్థానాలు మినహా మిగతా అందరినీ పాతవారికే టికెట్ ఇచ్చారు. దీంతో బీఆర్‌ఎస్‌లోకి రావాలని ఆలోచన చేసిన నేతలు కూడా దానిని విరమించుకున్నారు. అభ్యర్థుల జాబితా ప్రకటనతో బీఆర్‌ఎస్ చేరికలకు ఫుల్‌స్టాప్ పెట్టినట్లయింది.
ఇక బీఆర్‌ఎస్ నుంచే వలసలు..
ఇదిలా ఉంటే.. బీఆర్‌ఎస్ టికెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకుని ఆ పార్టీలో చేరిన బీజేపీ, కాంగ్రెస్ నేతలు టికెట్ రాకపోవడంతో మళ్లీ పక్క చూపులు చూస్తున్నారు. సొంత గూటికి వెళ్దామా.. మరో పార్టీలో చేరదామా.. వేచి చూద్దామా అని తర్జన భర్జన పడుతున్నారు. ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక పనిలో నిమగ్నమయ్యాయి. ఈ తరుణంలో బీఆర్‌ఎస్ నుంచే ఆ రెండు పార్టీల్లోకి వలసలు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. బీఆర్‌ఎస్‌లో ఇక టికెట్ రాదనే విషయం స్పష్టమైనందున.. ఆశావహులు ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీతో మంతనాలు జరుపుతున్నారు. టికెట్ హామీ లభిస్తే వెంటనే పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు.
తొదరపాటేనా..
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ముందస్తు టిక్కెట్ల ప్రకటన తొందరపాటు నిర్ణయమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సొంత పార్టీ నేతలతోపాటు ఎమ్మెల్యే టికెట్ లభించిన వారు కూడా ఇంత ముందు ప్రకటించడం సరికాదంటున్నారు. మూడు నెలలు క్యాడర్‌ను మెయింటేన్ చేయాల్సి రావడంతో తమ ఖర్చు తడిసి మోపెడవుతుందని భావిస్తున్నారు. మరోవైపు ఆశావహులను పొమ్మనలేక పొగబెట్టినట్లే అని మరికొందరు పేర్కొంటున్నారు.