https://oktelugu.com/

Summer : మార్చి 15 నుంచి దబిడ దిబిడే.. ఈసారి మామూలుగా ఉండవట

శీతాకాలం పోయి వేసవి సీజన్‌ ప్రారంభం అయింది. అది మొదలయ్యే క్రమంలో ఒక్కసారిగా ఎండ తీవ్రత పెరిగింది. ప్రజలు వేడికి ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఫిబ్రవరి ప్రారంభం నుంచే భారీగా ఎండలు కాస్తున్నాయి. ఇక ఏప్రిల్‌, మే నెలల్లో ఎలా ఉంటుందోనని ప్రజలు భయపడుతున్నారు.

Written By: , Updated On : February 15, 2025 / 08:09 AM IST
Summer

Summer

Follow us on

Summer : శీతాకాలం పోయి వేసవి సీజన్‌ ప్రారంభం అయింది. అది మొదలయ్యే క్రమంలో ఒక్కసారిగా ఎండ తీవ్రత పెరిగింది. ప్రజలు వేడికి ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఫిబ్రవరి ప్రారంభం నుంచే భారీగా ఎండలు కాస్తున్నాయి. ఇక ఏప్రిల్‌, మే నెలల్లో ఎలా ఉంటుందోనని ప్రజలు భయపడుతున్నారు. అయితే ఒక సీజన్‌ నుంచి మరో సీజన్‌లోకి వెళ్లే క్రమంలో గాలులు పరివర్తనం చెంది ఒక్కసారిగా పొడి వాతావరణం నెలకొనడం కామనేనని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ నెలలో వాతావరణం పొడిగా ఉండడంతో ఆకాశం నిర్మలంగా మారి సూర్యకిరణాలు నేరుగా భూమిని తాకడం వల్ల ఎండ పెరుగుతుందన్నారు. ఈశాన్య రుతుపవనాల సీజన్‌ సమయంలో సముద్రం నుంచి గాలులు భూ ఉపరితలంపైకి వీస్తుంటాయి. ఈశాన్య సీజన్‌ ముగిసిన తరువాత గాలులు ఒకే దిశలో కాకుండా అన్ని వైపుల నుంచి వీస్తుండడంతో పాటు వేగం తగ్గిపోతుంది. వర్షాలు కురిసే పరిస్థితులు లేకపోవడంతో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి మించి నమోదవుతున్నాయి. ఈ నెలాఖరు వరకూ ఇటువంటి వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని వాతావారణ శాఖ అధికారులు చెబుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి.

ఫిబ్రవరి రెండో వారానికి ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోయాయి. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లోనూ పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. కోస్తాంధ్రతో పాటు రాయలసీమ, తెలంగాణలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. సాధారణం కంటే నాలుగు డిగ్రీలు అధికంగా నమోదు అవుతున్నాయి. అదే సమయంలో ఉత్తరాంధ్రలో విపరీతమైన పొగ మంచు కురుస్తోంది. ఉదయం 8 గంటల వరకు కురుస్తూనే ఉంది. ఇంకోవైపు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు విపరీతమైన ఎండలు కాస్తూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత ఏపీలోని కర్నూలులో నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఏకంగా అక్కడ పగటి ఉష్ణోగ్రత 37.8 గా నమోదు అయింది. బుధవారం ఒక్కసారిగా ఎండలు మండిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా సాధారణ కంటే నాలుగు డిగ్రీలు పెరిగాయి. దీంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఫిబ్రవరి రెండో వారంలోనే ఇలా ఉంటే.. వేసవిలో ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని నిపుణులు హెచ్చరించడంతో ప్రజల్లో ఒక రకమైన భయం వాతావరణం కనిపిస్తోంది.

మధ్యాహ్నం 12 గంటలకే భానుడు భగభగతో ఉష్ణోగ్రతలు అమాంతం పెరుగుతున్నాయి. మరోవైపు శుభకార్యాల సీజన్ ప్రారంభం కావడంతో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. శివరాత్రి నుంచి మరింత ఎండలు మండిపోతాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. దేశంలో ఈ సంవత్సరం ఉష్ణోగ్రతల్లో కొత్త రికార్డులు నమోదవుతాయని వాతావరణ నిపుణులు అంచనాలు వేస్తున్నారు. మార్చి 15 తర్వాత ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని, రాత్రి వాతావరణం వేడిగా ఉంటుందని వారు తెలిపారు. నార్త్ ఇండియాలో 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో వస్తున్న మార్పులే ఇందుకు కారణమని కార్బన్ డయాక్సైడ్, గ్రీన్ హౌస్ వాయువులతో భూమి మండుతోందని వివరించారు. మున్ముందు వేసవిలో ఏ పరిస్థితి ఉంటుందోనన్న ఆందోళన అందరిలో కనిపిస్తోంది.