
Margadarshi chit fund fraud case : నిన్న అన్నదాత మూతపడింది. నేడు మార్గదర్శి అనేక ఆర్థిక అవాంతరాలు ఎదుర్కొంటోంది. పాపం రామోజీరావు తన ఇన్నేళ్ల వ్యాపార జీవితంలో ఎన్నడూ ఎదుర్కొలేనన్నీ కష్టాలు ఎదుర్కొంటున్నాడు. మొత్తానికి రామోజీరావు ఆయువుపట్టుపై జగన్ మరింత గట్టిగా కొడుతున్నాడు. గత కొన్ని రోజులుగా ఏపీ సీఐడీ అధికారులతో తనిఖీలు చేయిస్తున్న జగన్.. పలు కీలక ఆధారాలను వెలికి తీస్తున్నాడు. ఇప్పటికే ఈ వ్యవహారంలో నలుగురు మార్గదర్శి బ్రాంచ్ మేనేజర్లను శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపించాడు. మరోవైపు స్వతంత్ర గ్రూపులకు చెందిన ‘ఫారం 21’ని మార్గదర్శి ఇప్పటి వరకూ ఏపీ ప్రభుత్వానికి సమర్పించలేదు. బ్యాలెన్స్‌షీట్లను తెలియజేసే పత్రాలను కూడా ఇవ్వలేదు. దీంతో అధికారుల చర్యలతో మార్గదర్శిలో చిట్స్ నిలిచిపోయాయి. మరోవైపు సీఐడీ అధికారులు మార్గదర్శి పలు బ్రాంచ్‌ల మేనేజర్లను అరెస్ట్ చేశారు. విశాఖటపట్నం ఫోర్‌మెన్ కామినేని రామకృష్ణ, రాజమండ్రి ఫోర్‌మెన్ సత్తి రవి, విజయవాడ లబ్బీపేట ఫోర్‌మెన్ శ్రీనివాసరావు, గుంటూరు ఫోర్‌మెన్ శివరామకృష్ణను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు.
తనిఖీల్లో అక్రమాలను సీఐడీ గుర్తించింది. యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నట్టు, రికార్డుల నిర్వహణ సక్రమంగా లేదని సీఐడీ అధికారులు చెబుతున్నారు. పలు శాఖల్లో లొసుగులు భారీగా ఉన్నాయని అంటున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో వాటిని తవ్వే పనిలో ఉన్నారు. అరెస్ట్ చేసిన నలుగురు ఫోర్‌మెన్లను న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. అక్రమాలకు పాల్పడుతున్న మార్గదర్శి యాజమా న్యంపై కేసు నమోదు చేసిన సీఐడీ అధికారులు. ఏ1గా చెరుకూర రామోజీరావు, ఏ2గా శైలజ, ఏ3గా మార్గదర్శి బ్రాంచ్ మేనేజర్లను ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు. ఇక వారిపై సెక్షన్ 120(బి), 409, 420, 477(ఏ) రెడ్ విత్ 34 సీఆర్‌ఎసీ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
చిట్ సభ్యుల స్థానంలో వేల చిట్లలో తమ పేరే రాసేసుకున్న మార్గదర్శి సంస్థ.. నిబంధనల మేరకు దానికి పూర్తి మొత్తాన్ని చెల్లించాల్సి ఉండగా, ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. చిట్లలో తనకు వచ్చే కొద్ది పాటి డిస్కౌంట్ల మొత్తాన్ని దాదాపు అన్ని చిట్లలోనూ డూప్లికేట్ చేసి చూపించి.. దాన్నే తమ సొమ్ముగా పేర్కొనడంతో ఇదంతా పచ్చి గొలుసు వ్యవహారంగా మారిపోయింది.
గొలుసులో ఏ చిన్న లింకు తెగినా.. ఇది సంస్థ దివాళాకు దారి తీసే ప్రమాదముంది. అదే జరిగితే చిట్ సభ్యుల సొమ్ము వాళ్లకు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో పాటు చిట్లకు వేర్వేరు బ్యాంకు ఖాతాలకు నిర్వహించాల్సి ఉండగా, అన్నింటికీ ఒకే ఖాతాను నిర్వహిస్తూ వాటిలో డబ్బును ఇష్టం వచ్చినట్టు మళ్లించడం కూడా విస్మయం కలిగిస్తోంది. ఇన్వెస్ట్‌మెంట్ రూపంలో గ్రూపు సంస్థల్లోకి కోట్లాది రూపాయలు మళ్లిస్తుండటంతో పాటు.. హై రిస్క్ ఉండే మ్యూచ్ వల్ ఫండ్స్‌లోకి కూడా ఈ ఖాతా నుంచి చిట్ సభ్యుల సొమ్మును మళ్లించడం గమనార్హం.