Dharmana Family: ఆయన ఒక మాటల మాంత్రికుడు. ఏ అంశంపైనైనా అనర్గళంగా మాట్లాడగలరు. సాధారణ వ్యవసాయ కుటుంబంలో పుట్టి అసాధారణంగా రాజకీయాల్లో అడుగుపెట్టారు. నాలుగు సార్లు రెవెన్యూ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు సిక్కోలు ముద్దు బిడ్డ ధర్మాన ప్రసాదరావు. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం మబగాం గ్రమానికి చెందిన ధర్మాన ప్రసాదరావు 1983లో మబగాం సర్పంచ్ గా ఎన్నికయ్యారు. 25 ఏళ్ల వయసులోనే స్థానిక సంస్థలకు ప్రాతినిధ్యం వహించారు. అప్పటికే టీడీపీ ఆవిర్భవించి అధికారంలోకి వచ్చినా కాంగ్రస్ వైపే మొగ్గుచూపారు. 1987లో పోలాకి మండల పరిషత్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అనతికాలంలోనే యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. 1989లో నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారిగా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభంజనం వీచినా.. శ్రీకాకుళం జిల్లాలో మాత్రం ఒక్క నరసన్నపేటలోనే కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రసాదరావు గెలుపొంది అరుదైన రికార్డు సాధించారు. దానిని గుర్తించిన కాంగ్రెస్ అధిష్టానం మంత్రిగా ఎంపిక చేసింది. నేదురమల్లి జనార్థనరెడ్డి కేబినెట్లో 1991 నుంచి 94 వరకూ చేనేత, మధ్యతరహా సాగునీటి శాఖ మంత్రిగా పనిచేశారు. అతి పిన్న వయసులోనే కేబినెట్లో చోటు దక్కించుకొని ఆకర్షించగలిగారు. 1999 ఎన్నికల్లో మాత్రం ఓటమి చవిచూశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు ధర్మాన అంతా తానై వ్యవహరించారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి క్రుషి చేశారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో సొంత నియోజకవర్గం నరసన్నపేటను సోదరుడు ధర్మాన క్రిష్టదాస్ కు విడిచిపెట్టి తాను జిల్లా కేంద్రం శ్రీకాకుళం అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి దిగారు. ఒక విధంగా చెప్పాలంటే రిస్క్ చేసి బరిలో దిగారు. విజయం సాధించారు. ధర్మాన రిస్కును, క్రుషిని గుర్తించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన కేబినెట్ లోకి తీసుకున్నారు. కీలకమైన రెవెన్యూ శాఖను అప్పగించారు. అటు ప్రభుత్వ విధాన నిర్ణయాల్లోనూ భాగస్వామ్యం చేశారు. అటు తరువాత 2009 ఎన్నికల్లో మరోసారి శ్రీకాకుళం నుంచే బరిలో దిగి గెలుపొందారు. రాజశేఖర్ రెడ్డి రెండో సారి కేబినెట్ లోకి తీసుకొని కీలకమైన పోర్టు పోలియో అప్పగించారు.రాజశేఖర్ రెడ్డి అకాల మరణం తరువాత రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లో సైతం ధర్మాన మంత్రిగా కొనసాగారు. తన రాజకీయ గురువు రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్ కాంగ్రెస్ నుంచి వేరుపడినా ఆయన వెంట నడవకుండా ఉండిపోయారు. అయితే తాన త్యాగంతో తెరపైకి వచ్చిన సోదరుడు క్రిష్ణదాస్ మాత్రం జగన్ వెంట నడిచారు.

అర్థం కాని రాజకీయాలు
ధర్మాన కుటుంబంలో రాజకీయాలు ఇప్పటికీ జిల్లా ప్రజలకు అర్థం కావు. జగన్ కాంగ్రెస్ ను విభేదించి బయటకు వెళ్లి వైసీపీ స్థాపించినప్పుడు ధర్మాన ప్రసాదరావు మంత్రి కాగా.. సోదరుడు క్రిష్ణదాస్ నరసన్నపేట ఎమ్మెల్యే. ప్రసాదరావు కాంగ్రెస్ లో కొనసాగగా.. క్రిష్ణదాస్ మాత్రం తన ఎమ్మెల్యే పదవిని త్రుణప్రాయంగా విడిచిపెట్టారు. జగన్ కు మద్దతుగా రాజీనామా చేశారు. దీంతో నరసన్నపేట నియోజకవర్గంలో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. వైసీపీ అభ్యర్థిగా క్రిష్ణదాస్ రంగంలోకి దిగగా… కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరో సోదరుడు రామదాసును పోటీలోకి దింపారు. ఆ ఎన్నికల్లో క్రిష్ణదాస్ అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. ఆ ఎన్నికల్లో విశేషమేమిటంటే ప్రత్యర్థులుగా ఉన్న ధర్మాన సోదరులు మబుగాంలోని ఒకే ఇంటి నుంచి ప్రచారానికి దిగారు. వ్యూహ ప్రతివ్యూహాలకు సైతం ఆ ఇంట నుంచే పదును పెట్టారు. అక్కడకు కొద్దిరోజులకే ధర్మాన సోదరులంతా వైసీపీ గూటిలోకి చేరిపోయారు. దీంతో ప్రజలు ఓకింత షాక్ కు గురయ్యారు. అటు పార్టీ శ్రేణులు ధర్మాన సోదరుల రాజకీయ చతురతను, తమను వాడుకున్న తీరును జీర్ణించుకోలేకపోయారు. దాని ఫలితమే 2014 ఎన్నికల్లో ప్రతిబింబించాయి. అటు నరసన్నపేటలో క్రిష్ణదాస్, ఇటు శ్రీకాకుళంలో ప్రసాదరావు ఓటమి పాలయ్యారు. రాజకీయంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నారు. 2019లో జగన్ మేనియాతో క్రిష్ణదాస్ సునాయాసంగా గెలవగా.. ప్రసాదరావు అత్తెసరు మెజార్టీతో గట్టెక్కారు. జిల్లాలో అతి తక్కువ మెజార్టీ ప్రసాదరావుకి వచ్చింది. దీంతో అధినేత గత అనుభవాలను ద్రుష్టిలో పెట్టుకొని.. నాడు ధర్మాన ప్రసాదరావు వ్యవహార శైలిపై అక్కసుతో సోదరుడు ధర్మాన క్రిష్ణదాస్ ను కేబినెట్ లో తీసుకోవడంతో పాటు డిప్యూటీ సీఎం పదవిని కట్టబెట్టారు. అప్పటి నుంచి ధర్మాన కుటుంబంలో చిచ్చు మరింత పెరిగింది. సోదరులు ఎడముఖం పెడముఖం పెట్టారు. డిప్యూటీ సీఎం హోదాలో క్రిష్ణదాస్ జిల్లా కేంద్రంలో జరిగే కార్యక్రమాలకు సైతం ప్రసాదరావు హాజరయ్యేవారు కాదు. అంతలా పెరిగిపోయింది వారి మధ్య గ్యాప్. ఇంతలోనే రాజకీయ పరిణామాలు మారడం, జగన్ వ్యూహాత్మకంగా ప్రసాదరావును కేబినెట్ లోకి తీసుకోవడంతో క్రిష్ణదాస్ నైరాశ్యంలోకి వెళ్లిపోయారు. ఇన్నాళ్లూ తాను నిర్లక్ష్యం చేసిన తమ్ముడు తానపై ఏ రేంజ్లో పగ తీర్చుకుంటాడన్న భయం క్రిష్ణదాస్ కు పట్టుకుందట. మూడేళ్ల పదవీ కాలంలో తనవెంట నడచిన కేడర్ సైతం ప్రసాదరావు వైపు జారిపోవడం కూడా క్రిష్ణదాస్ ను కలవరపాటుకు గురిచేస్తుందట. ధర్మాన కుటుంబంలో మంటలు సిక్కోలు రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి.
[…] Gudivada Amarnath: విశాఖ రాజకీయ యవనికపై గుడివాడ కుటుంబానిది ప్రత్యేక స్థానం. సుదీర్ఘ కాలం ఆ కుటుంబం విశాఖ రాజకీయాలను శాసించింది. బలమైన కాపు సామాజికవర్గానికి చెందిన గుడివాడ వంశీయులకు పదవులు పూలపాన్పుగా రాలేదు. సామాజికవర్గ నేపథ్యంలో మిగతా వర్గాల ఆధిపత్యానికి తెరదించుతూ ముందుకు కదిలారు. కీలక పదవులు అందుకున్నారు. ప్రస్తుతం జగన్ కేబినెట్ లో కీలక మంత్రిత్వ శాఖను దక్కించుకున్నారు గుడివాడ అమర్ నాథ్, తండ్రీ, తాతల వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన అమర్ నాథ్ గట్టి పోరాటమే చేశారు. సుదీర్ఘ కాలం రాజకీయంగా పోరాడారు. కిందపడుతూ, పైకిలేస్తూ రాజకీయాల్లో ఒడిదుడుకులు అలవాటు చేసుకున్నారు. […]