
AP Politics : వారి మాటకు ఎదురులేదు. వారి చెప్పిందే కరెక్ట్.. వారు ఏది చెబితే దానికి జీ హుజూర్ అనాలి. వ్యతిరేకిస్తే ముప్పేట దాడి. చివరకు వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేస్తారు. లేనిపోని ప్రచారం చేస్తారు. అవసరమైతే భౌతిక దాడులకు సైతం దిగుతారు. మొన్నటివరకూ ఏపీలో వైసీపీ శ్రేణులు అనుసరించిన విధానం ఇది.. మరీ ఇప్పుడో పూర్తి స్వరం మార్చుకుంటున్నారు. తప్పు అంటే ఒప్పుకుంటున్నారు. సవరించుకుంటామని చెబుతున్నారు. ఇలా అంతులేని ధీమా నుంచి భయం ఆవహించడం చర్చనీయాంశంగా మారింది. మారిన రాజకీయ పరిస్థితులకు ఇది సంకేతమా? భవిష్యత్ లో ముప్పు తప్పదని ముందస్తు జాగ్రత్త అన్నది ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా మారింది.
నాడు చంద్రబాబు సర్కారుపై విష ప్రచారం..
గత ఎన్నికల్లో వైసీపీ అంతులేని గెలుపునకు సోషల్ మీడియా ప్రధాన కారణం. అప్పటి చంద్రబాబు సర్కారుపై విష ప్రచారం నింపడంలో సోషల్ మీడియా చాలా యాక్టివ్ గా పనిచేసింది. జగన్ నవరత్నాలకు అంతులేని ప్రచారం కూడా కల్పించింది. నాటి టీడీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత, జగన్ పై అనుకూలత చూపించడంలో తనదైన పాత్ర పోషించింది. ఎన్నికల అనంతరం వైసీపీ ప్రభుత్వాన్ని హైప్ చేసేందుకు సైతం సోషల్ మీడియా బాగానే పనిచేసింది. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చడానికి సైతం దోహదపడింది. ఇలా సోషల్ మీడియా ఖాతాలను తెరిచిన వెంటనే ఇవి ప్రత్యక్షమయ్యేవి. అనుకూల రిప్లయ్ లే తప్ప.. వ్యతిరేకంగా వచ్చే సందేశాలు అంతంతమాత్రమే. ఎవరైనా వ్యతిరేకంగా పోస్టులు పెడితే ఎక్కడ బాధితులవుతామన్న బెంగ ఎక్కువ మందిలో వెంటాడేది.

గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ తో..
రాజకీయాల్లో రాణించాలంటే ధైర్యం ఉండాలి. దూకుడు కనబరచాలి. కానీ అది చూపగలిగిన చోటే చూపాలి. లేకుంటే వికటిస్తుంది. అంతులేని నమ్మకం ఉన్నప్పుడు ఒకలా.. నమ్మకం సన్నగిల్లితే మరోలా స్వరం మారిపోతుంది. ఇప్పుడు ఏపీలో కూడా అటువంటే పరిస్థితే కనిపిస్తోంది. ఏ ఎన్నికలైనా జన్తా నై.. అంత మాదే అన్నట్టుండేది వైసీపీ శ్రేణుల యావ్వరం. మీడియా అయినా.. సోషల్ మీడియా అయినా.. లైన్ అయినా.. ఆన్ లైన్ అయినా…వారి నుంచి వినిపించేది ఒకటే. మనల్నెవరు ఆపేది. మనల్ని ఎవరు పడగొట్టేది అన్నట్టు కామెంట్స్ సాగాయి. గత నాలుగేళ్లుగా వారి స్వరం హై రిచ్ లో ఉండేది. కానీ ఇప్పుడు క్రమేపీ స్వరం మారుతోంది. ఇన్నాళ్లూ నేలవిడిచి సాము చేసిన వారు ఇప్పుడు వాస్తవాలను గ్రహించడం మొదలుపెట్టినట్టున్నారు.
వికటిస్తున్న ప్రచారం..
అయితే ఎప్పుడైతే వైసీపీ మూడేళ్ల పాలన పూర్తి చేసుకుందో.. అప్పటి నుంచే సోషల్ మీడియా ప్రచారం వికటిస్తూ వస్తోంది. అభివృద్ధి లేకపోవడం, మౌలిక వసతులు పెరగకపోవడం, అధ్వాన రహదారులు ఇలా ఇవన్నీ ప్రభుత్వానికి ప్రతిబంధకంగా మారాయి. ప్రభుత్వ వ్యతిరేక పోస్టులతో సోషల్ మీడియా నిండిపోతోంది. నెటిజన్లు ఎక్కువగా వ్యతిరేక పోస్టులకే రెస్పాండ్ అవుతున్నారు. అనుకూల పోస్టులకు కనీస పరిగణలోకి తీసుకోవడం లేదు. దీంతో వైసీపీ శ్రేణులు కూడా అతిని తగ్గిస్తున్నాయి. వాస్తవికత దగ్గరగా ఉన్న పోస్టులు చేస్తున్నా ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. వైసీపీ శ్రేణుల అంతులేని ధీమా నుంచి భయపడడానికి ఇదే కారణమని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.