Rains : యమున ఉప్పొంగింది. బ్రహ్మపుత్ర ఉరకలు వేసింది. వెరసి ఉత్తర భారతదేశం అతలాకుతమైంది. ఢిల్లీ కనీవినీ ఎరుగని వరదలతో కకావికలమైంది. ఉత్తరాఖండ్ నీట మునిగింది. కానీ ఇదే సమయంలో దక్షిణభారతం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఎండలు మండిపోయాయి. సరైన వర్షాలు కురువకపోవడంతో ఆశించిన స్థాయిలో రైతులు పంటలు సాగు చేయలేదు. ఎల్ నీనో వల్ల వర్షాలు ఈసారి ఆశించినంత స్థాయిలో కురవవని వాతావరణ శాఖ అధికారులు చెప్పేశారు. దీంతో రైతుల్లో నైరాశ్యం అలముకుంది. ఇక ఈ ఏడాది కరువు తప్పదనే భయం వారిలో ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు భరోసా కల్పించాల్సిన ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయి. కనీసం రైతులకు విత్తనాలు కూడా అందుబాటులో ఉంచలేదంటే వాటి చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చు.
-బతికించింది
ఇక కరువు తప్పదని రైతులు ఒక నిర్ణయానికి వచ్చారు.. ప్రత్యామ్నాయంగా ఎలాంటి పనులు చేపట్టాలో ఒక అంచనాకొచ్చారు. ఈ దశలో బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ద్రోణి రైతుల పాలిట వరంగా మారింది. దీని ప్రభావం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ముసురు పట్టింది. నిండు వానా కాలంలో 40 డిగ్రీలకు మించి నమోదు అయిన ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా 23 డిగ్రీలకు పడిపోయాయి. దీనికి తోడు గోదావరి ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు విపరీతంగా వరద వస్తున్నది. ఆ వరద కాలేశ్వరం ఎత్తిపోతల పథకానికి వచ్చి చేరడంతో నీటిని కిందికి వదులుతున్నారు. ఆ వరద నీరు భారీగా రావడం వల్ల దేవాదుల ప్రాజెక్టు, తర్వాత భద్రాచలం వద్ద గోదావరి ఉరకలు ఎత్తుతోంది. భద్రాచలం వద్ద ప్రస్తుతం గోదావరి 33 అడుగులకు చేరుకుంది.. ఈ ఏడాది ఇంతవరకు భద్రాచలం వద్ద గోదావరి సరైన స్థాయిలో ప్రవహించలేదు. మొన్నటిదాకా భక్తులకు స్నానం చేసేందుకు సరిగా నీళ్లు కూడా లేవు. ఈ సందర్భంలో ఈ ఎక్కువ ప్రాంతంలో వర్షాలు కురవడంతో ఒక్కసారిగా నది జలకళ సంతరించుకుంది.
-పంటలకు ప్రాణం పోసింది
బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి వల్ల పంటలకు ప్రాణం పోసినట్టు అయింది. ముఖ్యంగా పత్తి, మిరప, ఇతర ఆరుతడి పంటలు ఈ వర్షం వల్ల జీవం పోసుకున్నాయి. వర్షాలు కూడా విస్తారంగా కురుస్తుండడంతో రైతులు రెట్టించిన ఉత్సాహంతో పంటలు సాగు చేస్తున్నారు. ఇలా పంటలు సాగడం వల్ల కూరగాయల ధరలు దిగివచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎందుకంటే ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచి సరైన వర్షాలు కురవకపోవడంతో చాలామంది రైతులు కూరగాయల పంటలు సాగు చేయలేదు. ఫలితంగా డిమాండ్ పెరగడంతో ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవలసి వచ్చింది. అది అంతిమంగా కూరగాయల ధరలు పెరిగేందుకు కారణమైంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో టమాట కిలో ధర 100కు మించి పలుకుతోంది అంటే దానికి అదే కారణం.
-వట్టిపోయిన కృష్ణానది
గోదావరి వద్ద పరిస్థితి ఇలా ఉంటే.. ఎగువలో ఉన్న కర్ణాటకలో సరైన వర్షాలు లేకపోవడం వల్ల కృష్ణ నది వట్టిపోయి కనిపిస్తోంది. సరైన వరద రాకపోవడంతో రెండు తెలుగు రాష్ట్రాలకు జీవనాడి అయిన నాగార్జునసాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్ కి చేరుకుంది. ప్రాజెక్టులో నీరు లేకపోవడంతో పరివాహక ప్రాంతాల రైతులు పంటలను కాపాడుకునేందుకు బోర్లు వేసుకుంటున్నారు. గతంలో అంటే 10 సంవత్సరాల క్రితం ఈ పరిస్థితి ఉండేది. అయితే ఈ ఏడాది ప్రారంభం నుంచి వర్షాభావ పరిస్థితి ఉండడంతో రైతులు బోర్లు వేసుకుంటున్నారు. నది పరివాహ ప్రాంతంలో గత నెలలో సుమారు 150 వరకు బోర్లు వేసినట్టు తెలుస్తోంది.
-రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ
ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులపై అధికారులు స్పందించారు. ఎల్ నినో వల్ల వర్షాలు ఉండవు అనుకున్నామని, కానీ బంగాళాఖాతం బతికించిందని వారు చెబుతున్నారు. అయితే ద్రోణి చురుగ్గా కదులుతుండడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీనికి నైరుతి రుతుపవనాలు కూడా తోడు కావడంతో కొన్నిచోట్ల విస్తారంగా వర్షపాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తోందని వారు ప్రకటించారు. ఇక ప్రస్తుత వాతావరణం నేపథ్యంలో తెలంగాణలో పది జిల్లాలు, ఆంధ్రలో 13 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.