టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్రపై వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. మొదట కాంగ్రెస్ కార్యకర్తల్లో నూతనోత్తేజం నింపే పనిలో పడినట్లు సమాచారం. అందుకే బహిరంగ సభల ఏర్పాటుకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెబుతున్నారు. రేవంత్ రెడ్డి మొదట పాదయాత్ర చేస్తారని అందరు భావించారు. కానీ కార్యకర్తలను ఏకం చేసే పనిలో భాగంగా రేవంత్ ఇప్పుడు బిజీగా మారిపోయారు. పీసీసీ అధ్యక్ష పదవి రాకముందే పాదయాత్ర చేస్తారని అందరు అనుకున్నా ప్రస్తుతం పరిస్థితి వేరేలా ఉండడంతో ఆయన మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది.
ఇంద్రవెల్లిలో నిర్వహించిన దళిత, గిరిజన దండోరా సభను విజయవంతం చేసి కార్యకర్తల్లో ఉత్సాహం పెరిగింది. ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో జన సమీకరణ కూడా భారీగానే జరిగింది. దీంతో కాంగ్రెస్ నేతల్లో కొత్త ఉత్సాహం వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇలాంటి సభల ద్వారా కాంగ్రెస్ నేతల్లో మరింత యాక్టివ్ పెంచడానికి ఇలాంటి సభలు దోహదం చేస్తాయని భావిస్తున్నారు. మిగిలిన 16 పార్లమెంట్ స్థానాల్లో కూడా ఈ రకమైన సభలను నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం.
ఇప్పటికే బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్, వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర చేసేందుకు నిర్ణయం తీసుకోవడంతో రేవంత్ వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వారిద్దరు చేసే పాదయాత్రతో వచ్చే ఫలితాలపై ఆలోచించి రేవంత్ ఏ మేరకు నిర్ణయించుకుంటారో తెలుసుకునేందుకు చూస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పాదయాత్రపై రేవంత్ మనసు మార్చుకున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
తెలంగాణలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. పార్టీల్లో మార్పులు వస్తున్నాయి. ఒక్కో పార్టీ ఒక్కో విధంగా తన ప్రణాళికలు మార్చుకుంటోంది. అధికారమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాయి. హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. బీజేపీ అభ్యర్థి ఈటల ప్రచారంలో దూసుకుపోతున్నారు. అధికార పార్టీ టీఆర్ఎస్ కు అభ్యర్థి ఎంపిక పై ఇంకా క్లారిటీ లేదు. కాంగ్రెస్ కు అభ్యర్థి కరువైనట్లు తెలుస్తోంది.