Munugode By Election Survey Results: తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతాపార్టీ, కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మునుగోడు ఉప ఎన్నికల్లో మరో వారం రోజుల్లో మునిగేదెవరో, తేలేది ఎవరో తేలిపోనుంది. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ తీవ్రంగా శ్రమిస్తోంది. ఇక టీఆర్‌ఎస్, బీజేపీలు ఆర్థికంగా పటిష్టంగా ఉండడంతో డబ్బులను నీళ్లలా ఖర్చు చేస్తున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ఈ ఉప ఎన్నిలు ప్రీఫైనల్ అని మూడు పార్టీలు భావిస్తున్నాయి. ఇక్కడ గెలవడం ద్వారా తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం తామే అని సంకేతాలు పంపాలని బీజేపీ, కాంగ్రెస్ ఉవ్విల్లూరుతున్నాయి. ఇక టీఆర్‌ఎస్ ఇక్కడ గెలిచి తమకు తిరుగు లేదని, బీఆర్‌ఎస్‌గా మారిన టీఆర్‌ఎస్‌కు దేశ వ్యాప్తంగా ఇవే ఫలితాలు వస్తాయని చాటాలనుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రచారానికి మిగిలిన ఐదు రోజులను పూర్తిగా సద్వినియోగం చేసుకునే పనిలో పడ్డాయి.

30న కేసీఆర్ సభ..
టీఆర్‌ఎస ఈ నెల 30న ముఖ్యమంత్రి కేసీఆర్ చుండూరులో భారీ బహిరంగ సభ ద్వారా ఒటర్లను తన వైపు తిప్పుకొనే ప్రయత్నం చేయనున్నారు. 30న జరిగే బహిరంగ సభ కోసం దాదాపు లక్ష మందిని సమీకరించాలని నిర్ణయించారు. ఇప్పటికే నియోజకవర్గంలో మంత్రులు – ఎమ్మెల్యేలు గ్రామ గ్రామాన ప్రచారం చేస్తున్నారు. బీజేపీ అభ్యర్ధి..కోమటిరెడ్డి బ్రదర్స్ లక్ష్యంగా విమర్శల జోరు పెంచారు. కేసీఆర్ బహిరంగ సభల..ప్రసంగం పైన ఉత్కంఠ పెరుగుతోంది.
31న బీజేపీ సభ..
ఇక బీజేపీ కూడా ప్రచార హోరును పెంచింది. ఈ నెల 31న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ.నడ్డా మునుగోడుకు వస్తున్నారు. అక్కడ జరిగే భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ రెండు సభల సమయంలోనే కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా హైదరాబాద్‌లో ఉండనున్నారు.
ఆసక్తి రేపుతున్న రాజగోపాల్‌రెడ్డి తనయుడి ట్వీట్,,
మునుగోడులో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతున్న సమయంలో
రాజగోపాల్ రెడ్డి జ్వరం కారణంగా ఒక రోజు ప్రచారానికి దూరమయ్యారు. ఇదే సమయంలో రాజగోపాల్‌రెడ్డి తనయుడు సంకీర్త్‌రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేసారు. అందులో..
‘‘నాన్నా.. నిన్ను చూసి గర్వపడుతున్నా, మొత్తం అసెంబ్లీనే మునుగోడు ప్రజల కాళ్ల దగ్గరికి మీరు తీసుకొచ్చారు, ఇది మునుగోడు ప్రజల విజయం.. ఇప్పటికే మీరు విజయం సాధించారు’’ అంటూ ట్వీట్టర్‌లో రాసుకొచ్చారు.
‘‘అధికార టీఆర్‌ఎస్ నుంచి 84 మంది ఎమ్మెల్యేలు, 16 మంది మంత్రులు, 15 మంది ఎమ్మెల్సీలు, 8 నుంచి 10 మంది ఎంపీలు, అంతులేని సంపద, పోలీసు పవర్‌తో ఒక వ్యక్తి(రాజగోపాల్‌రెడ్డి)ని ఓడించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే మునుగోడు ప్రజలు మిమ్మల్ని గెలిపించారు’’ అని పేర్కొన్నారు.

మునుగోడు ఉప ఎన్నిక సర్వే ఫలితాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. ఎవరికి వారు తామే గెలిచేది అని చెబుతున్నా.. లోలోపల మాత్రం నివేదికల్లోని అంశాలు గుబులు పుట్టిస్తున్నాయి.
ఉత్కంఠగా సర్వే ఫలితాలు..
కొన్ని సర్వే సంస్థలు మునుగోడు బైపోల్ కు సంబంధించి ఒపీనియన్ పోల్‌లో మూడు పార్టీల మధ్య హోరా హోరీ తప్పదనే సంకేతాలు ఇస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ కేంద్రంగా పని చేసే ఒక సర్వే సంస్థ రెండు ప్రధాన పార్టీల మధ్యనే ప్రధాన పోటీ కొనసాగుతుందని వెల్లడించింది. కానీ, కాంగ్రెస్ కోసం పని చేస్తున్న ఒక ప్రముఖ సర్వే సంస్థ.. పార్టీకి అనుకూల వాతావరణం ఉందని, చివరి నిమిషంలో కొత్త సమీకరణాలకు అవకాశం ఉందంటూ అంతర్గతంగా నివేదిక ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. కాంగ్రెస్ ప్రధానంగా ఇక్కడ సెంటిమెంట్ అస్త్రం ప్రయోగిస్తోంది. దీంతో.. మునుగోడు ఓటర్లను ఆకట్టుకొనేందుకు పార్టీలు చివరి ప్రయత్నాలు చేస్తున్నాయి.