Ethiopia Volcano: మేఘాలు దట్టంగా ఉన్నప్పుడు, భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో విమానాల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. దీంతో ఆలస్యంగా నడుపుతారు. వాతావరణ మార్పుల ప్రభావం విమానంపై ఎక్కువగా ఉంటుంది. తాజాగా ఓ కృత్రిమ మేఘం భారత విమానాలకు అంతరాయం కలిగిస్తోంది. కాలుష్యాన్ని వెదజల్లుతోంది.
అగ్నిపర్వతం బద్ధలై..
ఇథియోపియాలోని హేలీ గుబ్బి అగ్నిపర్వతం 10 వేల సంవత్సరాల తర్వాత బద్ధలైంది. ఈ పేలుడు కారణంగా భారీగా బూడిద, సల్ఫర్ డై ఆక్సైడ్, రాతితో కూడిన బూడిద మేఘం గాలిలో కలిసింది. ఈ మేఘం త్వరగా 15,000-25,000 అడుగుల ఎత్తులో గంటకు 100-120 కిలోమీటర్ల వేగంతో భారత దేశం వైపు కదులుతోంది.
భారత్‌కు ముప్పు..
గుజరాత్, పంజాబ్, రాజస్థాన్, హిమాచల్, ఢిల్లీ ప్రాంతాలపై ఈ బూడిద మేఘం ప్రతికూల ప్రభావం చూపుతుంది. విమాన సర్వీసులు మందగించటం, ఆలస్యాలు, మార్గప్రవాహంలో రద్దులు సంభవించే అవకాశం ఉంది. ఇంజిన్ దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది. అప్రమత్తమైన డీజీసీఏ విమానయాన సంస్థలకు అలర్ట్ జారీ చేసింది. అయితే, ఈ బూడిద మేఘం చైనా దిశగా వెళ్లనుందని, మంగళవారం రాత్రి 7.30 గంటల వరకు భారత గగనతలం నుంచి దూరంగా వెళ్లే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు వెల్లడించారు.
ప్రజలకు ఆరోగ్య సూచనలు..
ఈ బూడిద గాలి శ్వాసకోశ సమస్యలు, కళ్లలో నొప్పి, చర్మ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆస్తమా, ఇతర శ్వాసకోశ సంబంధిత సమస్యలున్నవారు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. తలుపులు, కిటికీలు మూసి ఉంచి, మాస్కులు ధరించి బయటికు రావాలని పేర్కొంటున్నారు.
ఎయిరిండియా వంటి విమాన సంస్థలు ప్రభావిత మార్గాలలో విమాన సర్వీసులను ఇప్పటికే రద్దు చేయడం, సాధ్యమైనంత వరకు ప్రయాణాలను తగ్గించడం మొదలు పెట్టినట్లు తెలిపారు.