CM KCR : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటిస్తున్న హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. అప్రమత్తమైన పైలట్ లోపాన్ని గుర్తించి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో సేఫ్‌గా ల్యాండ్ చేశారు. దీంతో సోమవారం కేసీఆర్‌కు పెద్ద ప్రమాదం తప్పింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ రెండో విడత ప్రచారంలో నిత్యం మూడు, నాలుగు నియోజకవర్గాల్లో ప్రజాఆశీర్వద సభలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నాలుగు సభలకు షెడ్యూల్ రూపొందించారు.
బయల్దేరిన కాసేపటికే..
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనకు కేసీఆర్ మధ్యహ్నం 1 గంటకు ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్ నుంచి బయల్దేరారు. హెలీప్యాడ్‌లో బయల్దేరిన కాసేపటికే చాపర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీనిని గుర్తించిన పైలట్ వెంటనే హెలికాప్టర్‌ను రిటర్న్ చేశారు. తిరిగి ఫామ్‌హౌస్‌లో సేఫ్‌గా ల్యాండ్ చేశారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తిన కారణంగా కేసీఆర్ పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకుంది.
నాలుగు సభల్లో…
కేసీఆర్ సోమవారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని దేవరకద్ర, మక్తల్, నారాయణపేట్, గద్వాల్ నియోజకవర్గాల్లో పర్యటించాల్సి ఉంది. దేవరకద్రకు 12:30 గంటలకు చేరుకోవాల్సి ఉండగా కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆయన ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో ఉండిపోయారు. మరో హెలికాప్టర్ కోసం ఏవియేషన్ అధికారులు ప్రయత్నిస్తున్నారు.