
ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. వరుస ఎన్నికలతో పార్టీలన్నీ బిజీగా ఉన్నాయి. పంచాయతీ , మున్సిపల్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుతో అధికార వైసీపీ జోష్ మీదుంది. ప్రతిపక్ష టీడీపీ బలంగా పోరాడేందుకు సిద్దమైంది. ఏపీ బీజేపీ కూడా కేంద్రంలోని పెద్దలను రంగంలోకి దింపి సై అంటోంది.
తిరుపతి ఉప ఎన్నిక పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది.బీజేపీ తరుఫున కీలక నేతలు నెలరోజులుగా పనిచేస్తున్నారు. వైసీపీ, టీడీపీలు ప్రత్యేక కమిటీలను వేసి రంగంలోకి దిగాయి. నియోజకవర్గాలకు ఇన్ చార్జీలను నియమించాయి. వైసీపీ మంత్రులంతా రంగంలోకి దిగారు.గెలుపుకోసం సర్వశక్తులు ఒడ్డేందుకు రెడీ అయ్యారు.
తాజాగా ఎన్నికల కమిషన్ తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలచేసింది. ఈనెల 30వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈనెల 31న పరిశీలిస్తారు. ఏప్రిల్ 3 వరకు ఉపసంహరణ గడువు ఉంటుంది. ఏప్రిల్ 17న పోలింగ్ జరుగనుంది. మే 2న ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలను ప్రకటిస్తారు.
అందరికంటే ముందే టీడీపీ తమ అభ్యర్థిని ప్రకటించింది. టీడీపీ నుంచి కేంద్రమాజీ మంత్రి పనబాక లక్ష్మీ బరిలోకి దిగుతున్నారు. బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది.తెరపై నలుగురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అందులో ఒకరిని ఎంపిక చేయాలన్నది బీజేపీ వ్యూహం. అయితే ఆ పార్టీకి ఇక్కడ గెలుపు అంత ఈజీ కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇక అధికార వైసీపీ నుంచి డాక్టర్ గురుమూర్తిని అభ్యర్థిగా ప్రకటించారు. ఆయన నామినేషన్ ఎప్పుడు వేస్తారన్నది వేచిచూడాలి. వైసీపీ మొత్తం మంత్రులను తిరుపతిలో మోహరించింది. ప్రతి నియోజకవర్గానికి ఇన్ చార్జిగా నియమించింది. జగన్ సైతం ప్రచారానికి రానున్నారు. నోటిఫికేషన్ రావడంతో ఇక ప్రచార పర్వం హోరెత్తనుంది.