ED notice to Pinarayi Vijayan: ప్రజా జీవితంలో ఉన్నవారు ఎటువంటి అవకతవకలకు పాల్పడకుండా పరిపాలన సాగించాలి ప్రభుత్వ సొమ్ముకు కాపలాదారుగా ఉండాలి. ఒకప్పుడు ప్రజాప్రతినిధులు పై మాదిరిగానే ఉండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. దోచుకోవడం, తరాలకు మించి దాచుకోవడం పరిపాటిగా మారిపోయింది. అందువల్లే రాజకీయాలు అనేవి ఆర్జనకు ఆలవాలంగా మారిపోయాయి.
ఇక మన దేశంలో సాధారణ ఎమ్మెల్యేల నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రుల వరకు అవినీతి ఆరోపణలు రావడం ఇటీవల కాలంలో సర్వసాధారణంగా మారిపోయాయి. ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు నేతలు.. సహజంగానే తమపై కుట్ర జరుగుతోందని.. తమను అన్యాయంగా ఇబ్బంది పెడుతున్నారని వ్యాఖ్యానిస్తుంటారు.. ఇదంతా తమ రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేక చేస్తున్న దుర్మార్గం అని మండిపడుతుంటారు. అంతేతప్ప తాము ఎటువంటి తప్పు చేయలేదు అనే విషయాన్ని మాత్రం బయటకు చెప్పరు.
మనదేశంలో కేరళ ముఖ్యమంత్రి విజయన్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. ముఖ్యమంత్రికి ఏకంగా నోటీసులు కూడా జారీ చేసింది. ఇందులో చీఫ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ, ఆర్థిక శాఖ మాజీ మంత్రి కూడా ఉన్నారు. వారిద్దరికీ ఏకంగా ఈడి నోటీసులు ఇవ్వడం సంచలనం రేపుతోంది.. 468 కోట్ల లావాదేవీలకు సంబంధించి ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ను ఉల్లంఘించారని కేంద్ర దర్యాప్తు సంస్థ అభియోగాలు మోపింది.
ఈ అభియోగాలకు వివరణ ఇవ్వాలని ఈడి దాఖలు చేసిన నోటీసులలో పేర్కొంది. కేరళ రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిధులు సమీకరించాలని అప్పట్లో నిర్ణయించారు. ఇందులో భాగంగా మసాలా బాండ్లను జారీ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే నాడు ప్రభుత్వం తమకు అనుకూలమైన వ్యక్తులకు లబ్ధి చేకూర్చాలని భావించినట్టు ఆరోపణలు వినిపించాయి. ముఖ్యంగా 468 కోట్ల లావాదేవీల విషయంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని కేరళ మీడియా కోడై కూసింది. వీటికి బదులు చెప్పాల్సిన కేరళ ప్రభుత్వం మీడియాపై ఎదురు దాడికి దిగింది. ఈ క్రమంలోనే కేరళ ప్రభుత్వం వ్యవహరించిన తీరు అనుమానాస్పదంగా కనిపించింది. దీంతో కేంద్ర దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగింది. ముఖ్యంగా 468 కోట్ల లావాదేవీల వ్యవహారంలో ఇష్టానుసారంగా వ్యవహరించడం అనేక అనుమానాలకు కారణమైంది. దీంతో ప్రాథమికంగా ఆధారాలు సేకరించిన కేంద్ర దర్యాప్తు సంస్థ.. ఏకంగా ముఖ్యమంత్రి కి నోటీసులు జారీ చేసింది. మరి దీనిపై కేరళ ముఖ్యమంత్రి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.