Homeఆంధ్రప్రదేశ్‌NRI Hospital : ఆ ఆసుపత్రి పై ఈడీ దాడి: తెర వెనుక మేఘా కృష్ణారెడ్డి...

NRI Hospital : ఆ ఆసుపత్రి పై ఈడీ దాడి: తెర వెనుక మేఘా కృష్ణారెడ్డి చక్రం!?

మేఘా.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచంలోని పలు దేశాల్లో కాంట్రాక్ట్ పనులు చేస్తోంది. అన్ని రంగాల్లో అడుగుపెడుతోంది. ఇప్పుడు దానికి కావాల్సింది వైద్యరంగం.. అందులో బలమైన ఆసుపత్రి కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తోంది. బలమైన అంటే ప్రజల్లో ఒక నమ్మకం ఉన్నది అని అర్థం. అలాంటి దాన్ని టేక్ ఓవర్ చేసేందుకు ఎప్పటినుంచో ప్రయత్నం చేస్తున్నది.. మొదట యశోదలో పెట్టుబడి పెట్టాలనుకుంది. దీనికోసం ముఖ్యమంత్రి కేసీఆర్ తో రాయబారం పంపింది. ఎందుకంటే యశోద వ్యవస్థాపకుల్లో ఒకరైన గోరుకంటి సురేందర్రావు కెసిఆర్ కు చాలా దగ్గర. ఈయన ఆస్పత్రిలో పనిచేసే ఎంఎస్ రావు కేసీఆర్ కు ఫ్యామిలీ డాక్టర్. కానీ కెసిఆర్ చెప్పినా యశోద యాజమాన్యం సున్నితంగా తిరస్కరించింది. తర్వాత అపోలో అనుకున్నారు. ఎందుకో బెడిసి కొట్టింది. బంజారాహిల్స్ విరించి హాస్పిటల్లో పెట్టుబడులు పెడదామని అనుకున్నారు. కానీ కోవిడ్ సమయంలో ఆ ఆసుపత్రి మీద భారీగా ఆరోపణలు రావడంతో వెనక్కు తగ్గారు.. ఏషియన్ గ్యాస్ట్రో ను కొందామనుకున్నారు. అది ప్రైవేట్ ఈక్విటీలో ఉండడంతో ఒక అడుగు వెనక్కు వేశారు.. ఇదే దారిలో కాంటినెంటల్, కేర్, మెడి క్యూర్,మెడి కవర్, మెడ్విన్ ఉండటంతో ఇక లాభం లేదనుకొని సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ మీద పడ్డారు.

గుంటూరు ఎన్ఆర్ఐ ఆసుపత్రి మీద ఫోకస్

గుంటూరులో ఎన్ఆర్ఐ ఆస్పత్రి చాలా ఫేమస్.. విదేశాల్లో స్థిరపడిన కొంతమంది వైద్యులు సేవాభావంతో మంగళగిరి వద్ద దీన్ని ఏర్పాటు చేశారు. దీనికి అనుబంధంగా వైద్య కళాశాల కూడా ఉంది. ప్రారంభించిన అనతి కాలంలోనే మంచి పేరు సంపాదించుకుంది. ముఖ్యంగా కోవిడ్ సమయంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించి చాలామంది ప్రాణాలు కాపాడింది. అయితే ఇటీవల ఆసుపత్రిని మరింత విస్తరించేందుకు బోర్డు సమావేశం నిర్వహించింది. అయితే అసలు లక్ష్యం ఒకటైతే.. చర్చ మరో దారిలో నడిచింది. ఇక్కడే కొంతమంది బోర్డు డైరెక్టర్ల మధ్యలో భేదాభిప్రాయాలు వచ్చాయి.. ఈ విషయం మేఘా కృష్ణారెడ్డికి తెలియడంతో ఆయన రంగంలోకి దిగారు. తనకు తెలిసిన, అందులో పని చేస్తున్న డాక్టర్లను ఉసిగొలిపారు. దీంతో ఆసుపత్రి బోర్డు రెండు వర్గాలుగా చీలి పోయింది.. ఇదే నేపథ్యంలో ఆస్పత్రిని అమ్మాలని కొంతమంది.. అమ్మకూడదని కొంతమంది… దీంతో ఆ పంచాయితీ ఎటూ తెగలేదు.

ఈడీ అందుకే వచ్చిందా?

ఇక ఎన్ఆర్ఐ ఆస్పత్రి మీద రెండు రోజుల క్రితం ఈడి అధికారులు దాడులు చేశారు.. కీలకమైన డాక్యుమెంట్స్ తీసుకున్నారు.. పలు ఆధారాలు సేకరించారు.. ఈ ఆస్పత్రిని అక్కినేని మణి అనే వైద్యురాలు నిర్వహిస్తున్నారు. ఈ ఆస్పత్రి వ్యవస్థాపకుల్లో ఆమె కూడా ఒకరు. అయితే మేఘా కృష్ణారెడ్డికి ఆస్పత్రిని విక్రయించకూడదని గట్టిగా వాదించిన వారిలో ఈమె ఒకరు.. ఈ క్రమంలో తనకున్న పలుకుబడితో కృష్ణారెడ్డి ఈడి అధికారులను ఎన్ఆర్ఐ ఆసుపత్రికి పంపించారని ప్రచారం సాగుతోంది.. ఇదే సమయంలో మణి ఆస్పత్రికి చెందిన ఆరు కోట్ల డబ్బును దారి మళ్లించారని వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ ఆస్పత్రిలో ఎందుకు దాడులు చేశారు, వేటిని స్వాధీనం చేసుకున్నారు…అనే విషయాలను ఈడీ అధికారులు వెల్లడించడం లేదు. అయితే త్వరలో ఈ ఆసుపత్రి చేతులు మారుతుందనే ఊహాగానాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి.. మొన్నటి దాకా ఆసుపత్రిని అమ్మబోము అని చెప్పిన వారే ఇప్పుడు స్వరం మార్చడం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.. కొంత సమయం గడిస్తే తప్ప అసలు విషయం బయటకు తెలుస్తుంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular