Earthquake in Jammu Kashmir : క్రోదినామ సంవత్సరంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయని పంచాగకర్తలు చెప్పారు. వారు చెప్పినట్లుగానే క్రోది నామ సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రకృతి ప్రకోపిస్తోంది. భారత్‌లోనూ సంభవిస్తున్న వైపరీత్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వేసవిలో గతంలో ఎన్నడూ లేనివిధంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తర్వాత వర్షాలు, వరదలు ఉత్తర భారతాన్ని ముంచెత్తాయి. ఇక తాజాగా భూ ప్రకంపనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా కాశ్మీర్ లోయను స్వల్ప వ్యవధిలో వరుస భూకంపాలు వణికించాయి. మంగళవారం ఉదయం రెండు దఫాలుగా భూమి కంపించింది. జమ్మూకశ్మీర్ లోని పూంచ్ ప్రాంతంలో ఉదయం 6.45 గంటల సమయంలో భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత 4.9గా నమోదైంది. మరికొద్దిసేపటికే మరోసారి భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై 4.6గా భూకంప తీవ్రత నమోదైంది. అయితే, వరుస భూ ప్రకంపనల కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. భూకంపం దాటికి పలు ప్రాంతాల్లో ఇళ్లలోని వస్తువులు కదలడంతో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు.
బారాముల్లా జిల్లాలో భూకంప కేంద్రం..
శ్రీనగర్‌లోని మెట్రోలాజికల్ ప్రకారం.. తొలుత ఉదయం 6.45 గంటల సమయంలో 4.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని కేంద్రం బారాముల్లా జిల్లాలో భూమికి 5 కిలోమీటర్ల లోతున ఉన్నట్టు గుర్తించారు. మరో 7 నిమిషాల వ్యవధిలోనే అంటే సరిగ్గా 6.52 గంటలకు 4.8 తీవ్రతతో మరో భూంకంపం సంభవించింది. దీని కేంద్రం కూడా బారాముల్లా జిల్లాలోనే భూమికి 10 కిలోమీటర్ల లోతున గుర్తించారు. జమ్మూకశ్మీర్‌లో నెల వ్యవధిలో భూకంపం రావడం ఇది రెండోసారి అంతకుముందు జూలై 12న బురాముల్లాలో 4.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. రెండు వరుస భూకంపాలతో మంగళవారం కశ్మీర్ లోయ ఉలిక్కిపడింది. ప్రజలు భయభ్రాంతులకు గురై ఇళ్ల నుంచి బయటకు వచ్చి రోడ్లపైకి చేరారు. 2005, అక్టోబర్ 8న 7.6 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా కశ్మీర్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి 80 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. భూ ప్రకంపనల దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
ప్రపంచ వ్యాప్తంగా భూకంపాలు..
ప్రపంచవ్యాప్తంగా కూడా వరుస భూకంపాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గతేడాది టర్కీలో భారీ భూకంపం సంభవించింది. ఇటీవల జపాన్, టైవాన్, ఇండోనేషియా వంటి దేశాల్లో భూకంపం సంభవించగా.. తాజాగా భారత్‌లో భూమి కంపించింది. జమ్మూకశ్మీర్‌లో భూకంపం సంభవించింది. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా భారత్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, ఇండోనేషియా లాంటి దేశాల్లో ఎక్కువగా భూపంపాలు సంభవిస్తున్నాయి. గతేడాది టర్కీ, సిరియాలో సంభవించిన భూకంపం భారీ ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చాయి. ఈ విషాదం నుంచి కోలుకోకముందే మరికొన్ని దేశాల్లో వరుస భూకంపాలు వెన్నుల్లో వణుకు పుట్టిస్తున్నాయి. 2023 సెప్టెంబర్‌లో ఆఫ్ఘనిస్థాన్ లో భూకంప విషాదం నుంచి కోలుకోక ముందే.. నేపాల్ లో భూకంపం ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చింది. ఇక భారత్ లో సైతం ఇటీవల వరుస భూకంపాలు భయాందోళన కలిగిస్తున్నాయి. ఆస్తి, ప్రాణ నష్టం పెద్దాల లేకపోయినా.. ఢిల్లీ, బీహార్, హర్యానా, యూపీ, పంజాబ్ రాష్ట్రాల్లో వరుసగా భూకంపాలు సంభవిస్తున్న విషయం తెలిసిందే.