Dubai Law: అసలే అది దుబాయ్. అక్కడి ఆకాశ హర్మ్యాలు ఎంత పెద్దగా ఉంటాయో.. ఆ దేశ చట్టాలు గిట్టాలు అంతే కఠినంగా ఉంటాయి. అంతెందుకు తమ సతీమణి ముఖం చూపించేందుకు కూడా దుబాయ్ షేక్ లు ఒప్పుకోరు. అలాంటి ఎడారి దేశంలో బతుకుదెరువు కోసం పోయిన సిరిసిల్ల వాసులు ఓ హత్యా నేరంలో చిక్కుకున్నారు. పై కోర్టు కి వెళితే శిక్ష తగ్గుతుందేమోనని అప్పిలు చేస్తే ఆ శిక్షను కాస్త అక్కడి కోర్టు యావజ్జీవం చేసింది దీంతో వారు 15 ఏళ్లకు పైగా జైల్లోనే మగ్గుతున్నారు. వారిని విడిపించేందుకు స్వయంగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పదేళ్లుగా ప్రయత్నిస్తున్నా కఠినమైన దుబాయ్ చట్టాలు అందుకు అవకాశం లేకుండా చేస్తున్నాయి. కాగా ఇటీవల బక్రీద్ సందర్భంగా 505 మంది ఖైదీలకు దుబాయ్ రాజు క్షమాభిక్ష ప్రసాదించినా సిరిసిల్ల వాసులకు మాత్రం ఆ అవకాశం దక్కలేదు.
ఇంతకీ ఏం జరిగింది?
సిరిసిల్ల రూరల్ మండలానికి చెందిన శివరాత్రి మల్లేశం, శివరాత్రి రవి, చందుర్తికి చెందిన నాంపల్లి వెంకటి, కోనరావుపేటకు చెందిన దుండగుల లక్ష్మణ్, మల్యాల కు చెందిన శివరాత్రి హనుమంతు, కోడిమ్యాలకు చెందిన సయ్యద్ కరీం ఉపాధి కోసం దుబాయ్ వెళ్లారు. 2006లో దుబాయ్ లోని జబల్ అలీ పారిశ్రామిక ప్రాంతంలో ఓ సంస్థ ఆవరణలో నేపాల్ దేశస్తుడైన దిల్ ప్రసాద్ రాయి అనే సెక్యూరిటీ గార్డ్ దారుణ హత్యకు గురయ్యాడు. ఆ సంస్థలో ఉన్న టన్నులకొద్దీ ఉన్న ఇత్తడి విద్యుత్ తీగలను 10 మందితో కలిసి దొంగిలించేందుకు ప్రయత్నించారని, అడ్డుకున్న దిల్ ప్రసాద్ రాయిని వారంతా కలిసి హత్య చేశారని ఆరోపణ. ఈ ఆరోపణ ఎదుర్కొంటున్న నిందితుల్లో నలుగురు పాకిస్థానీయులు ఉన్నారు. మిగిలిన ఆరుగురు తెలంగాణకు చెందిన మల్లేశం, రవి, వెంకటి, లక్ష్మణ్, హనుమంతు సయ్యద్ కరీం ఉన్నారు. ఈ పది మందిని కూడా అక్కడి కోర్టు దోషులుగా నిర్ధారించింది. వీరిలో నలుగురు పాకిస్థానీయులకు 9 ఏళ్ల చొప్పున, తెలంగాణకు చెందిన ఆరుగురికి పదేళ్ల చొప్పున జైలు శిక్ష విధించింది.
Also Read: Professional Cuddler: ఖరీదైన కౌగిలి.. గంటకు రూ.7 వేలు
శిక్ష తగ్గించాలని పైకోర్టుకు వెళితే
తెలంగాణకు చెందిన ఆరుగురిలో సయ్యద్ కరీం తన పదేళ్ల జైలు శిక్షణ పూర్తి చేసుకొని తిరిగి వెళ్ళిపోయాడు మిగిలిన ఐదుగురు తమ శిక్ష తగ్గుతుందని భావించి పైకోర్టుకు అప్పీల్ కు వెళ్లారు కానీ ఇక్కడే వారికి చుక్క ఎదురయింది కేసును విచారించిన ముగ్గురు న్యాయమూర్తుల బృందం( అరబ్బీ భాషలో నజ్ల ఖజాయా).. ఆ కేసును క్రూరమైన నేరం (జినయా) గా అభివర్ణించింది. మల్లేశం, రవి, వెంకటి, లక్ష్మణ్, హనుమంతులకు కిందికోర్టు విధించిన పదేళ్ల శిక్షను 2015లో ఇస్లామిక్ షరియా చట్టంలోని “తజారియా” కింద యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది. ఆ సమయంలో నిందితులు సెక్యూరిటీ గార్డ్ ను అనేకసార్లు కత్తితో అతి దారుణంగా హతమార్చారని పేర్కొంది. మృతుడి శరీరంపై నిందితుల వేలిముద్రలు లభించాయని, పైగా అతని నోట్లో ఇసుక పోసి చిత్రవధ చేశారని ఆరోపించింది. మరోవైపు ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు వారు కత్తిని పాతిపెట్టారని, దుబాయ్ నుంచి పారిపోయేందుకు ఓమన్ వైపు వెళ్లారని కోర్టు ధర్మాసనం పేర్కొన్నది ఈ మేరకు వారికి ముబ్బాద్ కింద యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అయితే దుబాయ్ చట్టాల ప్రకారం యావజ్జీవ శిక్ష పడ్డవారు 25 ఏళ్ల వరకు బయటకు రావడం చాలా కష్టం.
కేటీఆర్ కల్పించుకున్నా
దుబాయ్ చట్టంలో ఉన్న వెసలుబాటు ప్రకారం హతుడి కుటుంబ సభ్యులకు నిందితుల తరఫున వారు దియా రూపంలో కొంత నగదు సహాయం చేసి, వారి సంతకంతో కూడిన మఫీనామాను సంపాదిస్తే కేసు నుంచి నిందితులకు విముక్తి లభించే అవకాశాలుంటాయి. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని 2013లో స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న నేటి మంత్రి కేటీఆర్ ను నిందితుల బంధువులు వేడుకున్నారు. ఈ మేరకు ఆయన అప్పట్నుంచే ప్రయత్నం చేశారు. చివరికి సెక్యూరిటీ గార్డ్ దేశమైన నేపాల్ కు వెళ్లి వారి కుటుంబ సభ్యులకు ₹15 లక్షల రూపాయలను చెక్కు రూపంలో స్వయంగా కేటీఆర్ అందజేశారు. వారి నుంచి మఫీనామా పత్రాన్ని కూడా తీసుకొచ్చారు. కానీ ఈలోగా నిందితులకు యావజ్జీవ శిక్ష విధిస్తూ ధర్మాసనం తీర్పు ఇవ్వడంతో దియాకు, మాఫీనామాకు అవకాశం లేకుండా పోయింది ధర్మాసనం నిందితులు చేసిన నేరాన్ని జినాయాగా అభివర్ణించడమే ఇందుకు అసలు కారణం. ఒకవేళ ఇరుదేశాల మధ్య(భారత్, దుబాయ్) ఖైదీల మార్పిడి జరిగినా దుబాయ్ చట్టాల ప్రకారం జినయా ఖైదీలను బదిలీ చేయడానికి వీలులేదని అక్కడి న్యాయమూర్తులు చెబుతున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఒక మహిళ ఇచ్చిన వాంగ్మూలం వల్లే వారు జినయా కింద శిక్ష అనుభవిస్తున్నారని తెలుస్తోంది. సదరు మహిళకు షరియా చట్టాల మీద అవగాహన లేకపోవడం ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. తెలియక చేసిన తప్పు వల్ల సిరిసిల్లకు చెందిన ఐదుగురు అక్కడి జైల్లో నరకం చూస్తున్నారు. మరోవైపు బక్రీద్, రంజాన్ పండుగల సందర్భంగా దుబాయ్ రాజు ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిస్తుంటారు. ఈసారి బక్రీద్ సందర్భంగా 505 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు. సిరిసిల్లవాసులు ఇందుకు దరఖాస్తు చేసుకున్నా ఆయన కనికరం లభించలేదు. దీంతో వాళ్లు జైల్లోనే మగ్గాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటు ఉన్న ఊరికి దూరంగా, అటు అయిన వారికి దూరంగా, దేశం కానీ దేశంలో వారు జైల్లో మగ్గుతున్నారు. విషయాన్ని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ దృష్టికి తీసుకెళ్లేందుకు కేటీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ కేటీఆర్ ప్రయత్నాలు గనుక ఫలిస్తే ఆ ఐదుగురికి దుబాయ్ జైలు నుంచి విముక్తి లభించినట్టే.
Also Read:Pawan Kalyan New Look: అభిమానులను భయపెడుతున్న పవన్ కళ్యాణ్ సరికొత్త లుక్
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Dubai government did not accept ktrs help five telangana people in gulf jail since 10 years in murder case
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com