MLA Controversial Comments: మంత్రి మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, బాల్క సుమన్, మైనంపల్లి హనుమంతరావు, ఆశన్న గారి జీవన్ రెడ్డి.. ఇంకా ఎవరి పేర్లయినా మర్చిపోతే వారు కూడా.. వారంతా కూడా ఈ ఎమ్మెల్యే ముందు దిగదుడుపు. కనీసం ఈయనతో పోల్చుకునేందుకు కూడా సరి రారు. ఎందుకంటే ఈ ఎమ్మెల్యే నోటి తీట అలా ఉంటుంది మరి. పేరుకు ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నప్పటికీ.. దాన్నంతా మర్చిపోయి ఒక గల్లి స్థాయి కార్యకర్తలాగా ఈయన మాట్లాడుతున్న తీరు అందర్నీ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది.
మీకు మాత్రమే ఓటేయాలా
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక నియోజకవర్గానికి ఈయన ఎమ్మెల్యే. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో గిరిజన శాఖ మంత్రిగా కూడా పనిచేశారు.. కానీ తర్వాత జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ అభ్యర్థి చేతిలో ఈయన ఓడిపోయారు. తర్వాత కాంగ్రెస్ టికెట్ మీద గెలిచినప్పటికీ ఏమాత్రం ఆలస్యం చేయకుండా భారత రాష్ట్ర సమితిలో చేరారు. తనకు మంత్రి పదవి ఇస్తారని అప్పట్లో ఈ ఎమ్మెల్యే చాలా ఆశలు పెంచుకున్నారు. కానీ ఎందుకనో కేసీఆర్ ఈయనకు ఆశించిన స్థాయిలో గౌరవం ఇవ్వలేదు. పైగా ఈయన కూతురు పార్లమెంటు సభ్యురాలుగా వ్యవహరిస్తున్నారు. ఈమె కూడా తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నది. అధిష్టానం దృష్టిలో పడేందుకు ప్రతిపక్ష పార్టీల నేతలపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది.. పైగా ఈమె ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే ఈమను కనీసం లెక్క కూడా చేయడు.. ఆ మధ్య ఏదో ఒక సమావేశంలో ఈమె మాట్లాడుతుండగానే ఆమె చేతులో నుంచి మైకు లాక్కొని ఆయన మాట్లాడాడు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా ఇక్కడితో ముగియదు. సీనియర్ ఎమ్మెల్యే చెప్పేది ఏంటంటే.. తెలంగాణ ప్రాంతాన్ని కేవలం భారత రాష్ట్ర సమితి మాత్రమే అభివృద్ధి చేసింది కాబట్టి, వచ్చే ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితికి మాత్రమే తెలంగాణ ప్రజలు ఓటెయ్యాలట? ప్రతిపక్షాలకు కనీసం ఎన్నికల్లో పోటీ చేసే హక్కు కూడా లేదట! మరి ఇంతోటి దానికి ఎన్నికలు నిర్వహించడం దేనికి? మొత్తానికి మొత్తం భారత రాష్ట్ర సమితి జీవితాంతం పాలించాలని రాసిస్తే సరిపోతుంది కదా!
నోటికి అడ్డూ అదుపూ లేదు
ఇక ఈ సీనియర్ ఎమ్మెల్యే 80వ వడిలోకి అడుగుపెడుతున్నప్పటికీ.. స్థాయిలో పరిపక్వత రాలేదు అనిపిస్తోంది. మొన్నటికి మొన్న ఏదో ఒక సమావేశంలో తనను చంపేందుకు సొంత పార్టీ నాయకులే కుట్ర చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఇది పార్టీలో భారీ దుమారాన్ని రేపింది. దీన్ని మర్చిపోకముందే ఇటీవల తాను నియోజకవర్గంలోని చిలక్కోయలపాడు గ్రామంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం లో ఆయన మాట్లాడారు.. మాట్లాడారు అనేకంటే బూతుల వర్షం కురిపించారు అనడం సబబు.. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీకి చెందిన అధ్యక్షుడిని ల***** అని సంబోధించారు. వాడికి గు****** తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. అంతే కాదు ఆయన ఒక బో**** అని దూషించారు.. దీంతో ఆ సభకు వచ్చిన వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇదేంటి ఇలా మాట్లాడుతున్నారు అంటూ చర్చించుకున్నారు.. అయినప్పటికీ ఆ ఎమ్మెల్యే తన బూతు పురాణాన్ని కొనసాగించారు.
ఓటమి తప్పదా?
సదరు ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం లో గతంలో అప్పటి తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ మహిళ ఎమ్మెల్యే గా కొనసాగారు. తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆమె కూడా భారత రాష్ట్ర సమితిలో చేరారు. దీంతో ఆ నియోజకవర్గంలో రెండు వర్గాలు ఏర్పడ్డాయి. దీనికి తోడు ఆమె ఈ నియోజకవర్గ కావాలని ముఖ్యమంత్రిని కోరుతున్నారు. మరి దీనిపై ముఖ్యమంత్రి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆ ఎమ్మెల్యేకు ఈసారి టికెట్ దక్కేది అనుమానంగానే కనిపిస్తున్నదని భారత రాష్ట్ర సమితి వర్గాలు అంటున్నాయి. ఆ అసహనంతోనే ఇలా ప్రతిపక్ష పార్టీల నాయకుల మీద తీవ్రమైన విమర్శలు గుప్పిస్తున్నారని వారు అంటున్నారు. నిన్న జరిగిన భారత రాష్ట్ర సమితి కార్యవర్గ సమావేశంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేలకు కూడా టికెట్లు ఇవ్వబోనని కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో.. ఎమ్మెల్యే భవితవ్యం ఎలా ఉంటుందో వేచి చూడాల్సి ఉంది.