
నిండు చంద్రుడు ఒకవైపు.. చుక్కలు ఒకవైపు ‘టక్కరి’ సినిమాలో మహేష్ బాబు పాడిన పాట అందరికీ గుర్తుండే ఉంటుంది. అలాంటి అద్భుతమే నేడు ఆకాశంలో సూపర్ మూన్ రూపంలో మనకు దర్శనమివ్వనుంది. ఈ ఏడాదిలో చివరి సూపర్ మూన్ నేటి సాయంత్రం దర్శనమివ్వనుందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ఏడాదిలో ఇప్పటికే మూడుసార్లు సూపర్ మూన్ కన్పించి కనువిందు చేసింది. ఇది మిస్సయితే వచ్చే 2021 ఏప్రిల్ 27వరకు ఆగాల్సిందే. కాగా మే 7న బుద్ధ పౌర్ణిమ రోజు భారత కాలమాన ప్రకారం సాయంత్రం 4.15గంటల సమయంలో నాలుగోసారి జాబిల్లి కనువిందు చేయనుంది.
నాసా వివరాల ప్రకారం మే 5నుంచి 8ఉదయం వరకు చంద్రుడు పూర్తిగా దర్శనమిస్తాడు. సూపర్ మూన్ అంటే భూమికి చంద్రుడు అత్యంత దగ్గరగా రావడం. కిందటి నెలలో సూపర్ పింక్ మూన్ కన్పించింది. సాధారణంగా భూమికీ-చందమామకీ మధ్య దూరం 3,84,000 కిలోమీటర్లు కాగా ఏప్రిల్‌లో ఏర్పడిన సూపర్ పింక్ మూన్ సందర్భంగా వీటి మధ్యదూరం 356,000కి.మీ.గా ఉంది. ఇక ఇలాంటి పింక్ మూన్లు ఈ ఏడాది వరుసగా ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలో వచ్చాయి. ఈ సందర్భంగా చంద్రుడు 14శాతం పెద్దగా కనిపిస్తూ 30శాతం ఎక్కువ ప్రకాశవంతంగా కన్పిస్తాడు.
నేటి సాయంత్రం సమయంలో చంద్రుడు నారింజ వర్ణంలో దర్శనమివ్వనున్నాడు. ఖగోళంలో జరిగే ఈ అద్భుతాన్ని సాయంత్రం వీక్షించి ఆనందించండి. ఇప్పుడు మిస్సయితే మరో ఏడాది వరకు ఆగాల్సిందే..!