Homeజాతీయ వార్తలుDonald Trump : అమెరికాను బతికించేందుకు.. చైనాపై ఒత్తిడి పెంచేందుకు.. ట్రంప్ కీలక నిర్ణయం

Donald Trump : అమెరికాను బతికించేందుకు.. చైనాపై ఒత్తిడి పెంచేందుకు.. ట్రంప్ కీలక నిర్ణయం

Donald Trump : అమెరికా అధ్యక్షుడుగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump)..దూకుడైన పాలన, అనాలోచిత నిర్ణయాలతో ఇటు అమెరికన్లను, అటు ప్రపంచ దేశాలను భయపెడుతున్నారు. అక్రమ వలసల పేరుతో వేల మందిని సొంత దేశాలకు పంపించారు. విదేశీ విద్యార్థులను, ఉద్యోగులను పంపించేందుకు నిబంధనలు మారుస్తున్నారు. ఇక ప్రతీకార సుంకాల పేరుతో ప్రపంచ దేశాలపై బారీగా పన్నులు పెంచారు. అయితే 90 రోజుల వరకు అమలు వాయిదా వేశారు. చైనా పై మాత్రం అమలుచేస్తున్నారు.

Also Read : భారత తయారీ రంగానికి ‘ట్రంప్’ బూస్ట్‌…

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సుంకాల (టారిఫ్‌ల) విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫోన్లు, కంప్యూటర్లు, చిప్‌లు వంటి ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులపై సుంకాల నుంచి మినహాయింపు ఇవ్వడం ద్వారా వినియోగదారులకు యాపిల్,(Apple) శాంసంగ్‌(Samsung) వంటి టెక్‌ దిగ్గజ సంస్థలకు ఊరట కల్పించారు. ఈ నిర్ణయం వల్ల అమెరికాలో ఈ ఉత్పత్తుల ధరలు స్థిరంగా ఉండే అవకాశం ఉంది, ఇది టెక్‌ రంగంలో పోటీతత్వాన్ని కొనసాగించడానికి సహాయపడుతుంది. అమెరికాకు చెందిన కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ ప్రొటెక్షన్‌ (CBP) సుంకాల మినహాయింపులకు సంబంధించిన గైడ్‌లైన్స్‌ను జారీ చేసింది. ఇవి తక్షణం అమలులోకి వస్తాయని తెలిపింది. ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణం, అమెరికా(America) ఆర్థిక వ్యవస్థలో టెక్నాలజీ రంగం కీలక పాత్ర పోషిస్తుందని, సుంకాల వల్ల ఈ రంగంలో అనవసరమైన ధరల పెరుగుదల వినియోగదారులపై భారం వేయవచ్చని ట్రంప్‌ యోచించి ఉండవచ్చు. యాపిల్, శాంసంగ్‌ వంటి సంస్థలు చైనాలో తమ ఉత్పత్తులను తయారు చేస్తాయి కాబట్టి, సుంకాల మినహాయింపు వీటి సరఫరా గొలుసులను స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది.

చైనాతో సుంకాల యుద్ధం..
మరోవైపు, అమెరికా–చైనా(America-China) మధ్య సుంకాల పోరు మరింత తీవ్రమైంది. చైనా ఉత్పత్తులపై అమెరికా సుంకాలను 145 శాతానికి పెంచినట్టు వైట్‌ హౌస్‌ ప్రకటించింది, ఇందులో 20 శాతం ఫెంటానిల్‌ సంబంధిత సుంకాలు కూడా ఉన్నాయి. ఈ నిర్ణయానికి ప్రతీకారంగా, చైనా కూడా అమెరికా ఉత్పత్తులపై సుంకాలను 84 శాతం నుంచి 125 శాతానికి పెంచింది. చైనా కస్టమ్స్‌ టారిఫ్‌ కమిషన్‌ ఈ నిర్ణయాన్ని శనివారం (ఏప్రిల్‌ 12, 2025) నుంచి అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. చైనా తమ ప్రకటనలో, అమెరికా ‘దుందుడుకు చర్యలను‘ దీటుగా ఎదుర్కొంటామని, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు గత కొన్నేళ్లుగా కొనసాగుతున్నాయి, కానీ ఈ తాజా సుంకాల పెంపు వాణిజ్య యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉంది. ఈ పరిస్థితి రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలతో పాటు ప్రపంచ వాణిజ్యంపై కూడా ప్రభావం చూపవచ్చు.

భారత్‌తో సహా ఇతర దేశాలకు ఊరట
చైనాపై సుంకాలను కఠినతరం చేసినప్పటికీ, భారత్‌తో సహా ఇతర దేశాలపై ప్రకటించిన ప్రతీకార సుంకాలను ట్రంప్‌ 90 రోజులపాటు తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ నిర్ణయం భారత్‌ వంటి దేశాలకు వాణిజ్య ఒత్తిడిని తగ్గించి, ద్వైపాక్షిక చర్చలకు అవకాశం ఇస్తుంది. అయితే, ఈ 90 రోజుల తర్వాత సుంకాల విధానంలో ఏవైనా మార్పులు ఉంటాయా అనేది స్పష్టంగా తెలియాల్సి ఉంది. భారత్‌ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే ఉత్పత్తులు, ముఖ్యంగా ఫార్మా, టెక్స్‌టైల్స్, ఐటీ సేవలపై సుంకాల ఒత్తిడి తగ్గడం వల్ల ఈ రంగాలు ప్రస్తుతానికి ఊరట పొందే అవకాశం ఉంది. అదే సమయంలో, చైనా–అమెరికా వాణిజ్య ఉద్రిక్తతలు భారత్‌కు కొత్త అవకాశాలను తెరవవచ్చు, ఎందుకంటే కొన్ని సంస్థలు తమ ఉత్పత్తి కేంద్రాలను చైనా నుంచి భారత్‌కు మార్చే అవకాశం ఉంది.

ట్రంప్‌ విధానం వెనుక ఉద్దేశం
ప్రపంచ దేశాలపై ట్రంప్‌ సుంకాలు విధించడం వెనుక చైనాపై ఆర్థిక ఒత్తిడిని పెంచడం, అమెరికా ఉత్పత్తులను ప్రోత్సహించడం, దేశఋయ తయారీరంగాన్ని బలోపేతం చేయడం వంటి లక్ష్యాలు ఉన్నాయి. అయితే, ఫోన్లు, చిప్‌ల వంటి టెక్‌ ఉత్పత్తులకు మినహాయింపు ఇవ్వడం ద్వారా ఆయన అమెరికా వినియోగదారుల ఆసక్తులను కూడా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రెండు విధానాల మధ్య సమతుల్యత సాధించడం ట్రంప్‌ పరిపాలనకు సవాలుగా ఉండవచ్చు.

Also Read : 12 కోడిగుడ్లకు రూ.536.. అమెరికాలో గుడ్లు కొనడం కష్టమే ఇక..

Exit mobile version