Kodali Nani: కృష్ణా జిల్లాలోని గుడివాడను కొడాలి నాని తన అడ్డాగా మార్చుకున్నారు. నాలుగు సార్లు ఇక్కడ నుంచి ఎమ్మెల్యే గెలుపొందారు. పార్టీ ఏదైనా గెలుపు మాత్రం ఆయన వైపే ఉంటుంది. గత రెండుసార్లు టీడీపీ ఆయనను అడ్డుకునే ప్రయతనం చేసినా విజయం సాధించలేకపోయింది. ఈ సారి ఎలాగైనా ఓడించాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బాగా పట్టుదలతో ఉన్నారు. ఇటీవల అక్కడకు వెళ్లిన ఆయన పార్టీ శ్రేణులను సమాయత్తం చేసొచ్చారు. మరోవైపు తనను ఏ శక్తి అడ్డుకోలేదని కొడాలి నాని బుసలు కొడుతున్నారు. చంద్రబాబు, పవన్ ఇద్దరు కలిసొచ్చినా ఏం పికలేరని అంటున్నారు.
కొడాలి నాని గుడివాడ నుంచి రెండుసార్లు టీడీపీ, రెండుసార్లు వైసీపీ నుంచి గెలుపొందారు.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు ప్రాతినిథ్యం వహించిన నియోజకవర్గం గుడివాడ. ఇక్కడ కమ్మ సామాజిక వర్గం ఎక్కువని భావనలో ఉంటారు. కానీ, వాస్తవంగా ఓట్లవారీగా లెక్కలు తీసుకుంటే కాపు సామాజిక వర్గం కీలకమని తేలిపోయింది. మొత్తం ఇక్కడ 2 లక్షల పై చిలుకు ఓట్లు ఉన్నాయి. ఇందులో 1.20 లక్షల ఓట్లు బీసీలు, కాపులు 45వేలు, ఎస్సీలు 30 వేల ఓట్లు, మిగతా ఓట్లు ఇతరులకు ఉన్నాయి. ఆ లెక్కన చూసుకుంటే ప్రతి ఎన్నికల్లోను కాపు ఓట్లు కీలకంగా మారుతున్నాయని అర్థమవుతున్నది.
2004లో టీడీపీ తరుపున పోటీ చేసిన కొడాలి నానికి 8వేల మెజార్టీ దక్కింది. 2009లో తెలుగుదేశం పార్టీ నుంచే పోటీ చేసిన ఆయనకు 68వేల ఓట్లు పోలయ్యాయి. అప్పుడు ప్రజారాజ్యానికి 21వేల ఓట్లు పడ్డాయి. ఈ ప్రభావం కాంగ్రెస్ అభ్యర్థిపై చూపింది. కాంగ్రెస్ కు 50 వేల ఓట్లు పోలవడంతో, ప్రజారాజ్యం భారీగా ఓట్లు చీల్చిందని తెలుస్తోంది. 2014లో నాని వైసీపీ నుంచి పోటీ చేశారు. అప్పుడు టీడీపీ, వైసీపీ నడుమ ప్రధాన పోటీ నెలకొంది. ఇక, 2019లో జనసేన కూడా ఎన్నికల బరిలో నిలిచింది. అయితే, చివరి క్షణంలో నామినేషన్లో పొరపాట్ల కారణంగా తిరస్కరణకు గురవడంతో మరలా తెలుగుదేశం పార్టీ, వైసీపీల మధ్య హోరాహోరీ పోటీలో నాని గెలుపొందారు.
కొడాలని విజయానికి కాపు ఓట్లు కీలకంగా మారాయనడంలో సందేహం లేదు. కృష్ణా జిల్లాలో కాపు ఓటు బ్యాంకు బాగా పెరిగింది. కాపుల ఆరాధ్య దైవం వంగవీటి మోహన రంగా అభిమానులకు కూడా ఎక్కవే. ఆయన కుమారుడు వంగవీటి రాధాకు జిల్లాలో మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే, కొడాలి నానితో ఉన్న స్నేహం వల్ల గుడివాడలో వ్యతిరేకంగా ప్రచారం చేయడం లేదని చెబుతున్నారు. రంగా వర్థంతి, జయంతులు నిర్వహించిన ప్రతీసారి ఆయన గుడివాడకు వస్తారు. తెలుగు దేశం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నా, కొడాలి నానీని కలవకుండా వెళ్లరు. ఇది నాని విజయానికి ప్రధాన కారణమవుందనడంలో సందేహం లేదు.
గుడివాడలో కీలకంగా మారిన కాపు సామాజిక వర్గం ఓట్లపై టీడీపీ ప్రధానంగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తున్నది. రాధా రావి మిత్ర మండలి అని ఏర్పాటు చేసి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇటీవల రంగా వర్థంతిని టీడీపీ, వైసీపీ పోటాపోటీగా నిర్వహించడం ఉద్రిక్తతకు దారి తీసివంది. జనసేన చాపకింద నీరులా కార్యక్రమాలను నిర్వహించుకుంటూ పోతోంది. బూతులు, విమర్శలతో చంద్రబాబ, పవన్ ను ఇబ్బందులు పెడుతున్న కొడాలి నానీని ఈ సారైన ఓడించి తీరాలని ఇరు పార్టీల అధినాయకత్వం తీవ్రంగా పావులు కదుపుతోంది. కాపు సామాజిక వర్గం ఓట్లు ఎటుపడితే వారిని విజయం వరిస్తుంది. దీంతో ఆ సామాజిక వర్గాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో రాజకీయ పార్టీలు పడ్డాయి. గుడివాడలో రాజకీయం రసకందాయంలో పడింది.