Largest Circulation Newspapers: తన ప్రభుత్వంపై ఈనాడు, ఆంధ్రజ్యోతి చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టేందుకు నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్న వైఎస్.రాజశేఖరరెడ్డి… తన కొడుకు, అప్పటి కే వ్యాపార రంగంలో ఉన్న వైఎస్.జగన్‌తో సాక్షి తెలుగు దిన పత్రిక పెట్టించారు. సత్యమేవ జయతే.. నాణేనికి మరోవైపు అనే స్లోగన్స్ తో 2008, మార్చి 28న ‘సాక్షి’ పత్రిక ప్రారంభించారు. అప్పటికే ఎస్టాబ్లిష్ అయిన ఈనాడును దెబ్బతీయడంతోపాటు. లార్జెస్ట్ సర్క్యులేషన్ అనే ట్యాగ్‌లైన్‌ను సాక్షికి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ, వైఎస్సార్ మరణించడం, రాజకీయంగా ఆయన కుటుంబం అనేక ఒడిదుడుకులు ఎదుర్కొడనం, వైఎస్.జగన్ మనీ లాండరింగ్ కేసులో అరెస్టు కావడం.. తదితర కారణాల ప్రభావంతో సాక్షి కూడా అనేక ఒడి దుడుకులు ఎదుర్కొంది. ఈనాడు ట్యాగ్‌లైన్‌ను తొలగించేలా సర్కులేషన్ పెంచుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
అధికారంలోకి తెచ్చిన మీడియా..
2019లో ఏపీలో వైఎస్.జగన్ నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. పార్టీని అధికారంలోకి తేవడంలో సొంత మీడియా కీలక పాత్ర పోషించింది. పత్రికలో టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు, సాక్షి టీవీలో టీడీపీ నేతల వైఫల్యాలను ఎండగడుతూ వీడియోలు రావడంతో ఏపీ ఓటర్లు వైసీపీకి పట్టం కట్టారు. దీంతో అధికారంలోకి వచ్చిన జగన్.. ఇందుకు కృషి చేసిన పత్రికలో పనిచేసే ఉద్యోగులకు గానీ, టీవీ ఛానెల్‌లో పనిచేసే ఉద్యోగులకు గానీ, ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేదు. కనీసం బోనస్ కూడా ఇవ్వలేదు. టీఆర్‌ఎస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రెండు సార్లు.. నమస్తే తెలంగాణ పత్రికలో పనిచేసే జర్నలిస్టులకు, టీ న్యూస్ టీవీ ఛానెల్‌లో పనిచేసే ఉద్యోగులకు బోనస్ ఇచ్చింది.
ఐదేళ్లలో సర్క్యులేషన్ పెంపు..
ఇక వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు సాక్షి పత్రికకు అడ్డగోలుగా ప్రకటనలు ఇచ్చిందన్న ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాల్లో సాక్షి పత్రిక ఉండాలని హుకూం జారీ చేవారు. దీంతో గడిచిన ఐదేళ్లలో సాక్షి సర్క్యులేషన్ గణనీయంగా పెరిగింది. మొన్నటి వరకు ఏపీలో ఎక్కడ చూసినా సాక్షి పత్రిక మాత్రమే కనబడేది. దీంతో ఈ ఏడాది ప్రథమార్థంలోనిర్వహించినే ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్(ఏబీసీ)లో సాక్షి అత్యధిక సర్క్యులేషన్ కలిగిన తెలుగు పత్రికగా గుర్తింపు పొందింది.
జనవరి నుంచి జూన్ వరకు..
ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకూ నిర్వహించిన ఏబీసీ ఆడిటింగ్‌లో సాక్షి 12,47,492 కాపీలతో దేశంలో అత్యధిక సర్క్యులేషన్ ఉన్న దిన పత్రికల్లో సాక్షి 8వ స్థానంలో నిలిచింది. ఏబీసీ సర్టిఫికెట్ ప్రకారం సాక్షికి ఆంధ్రప్రదేశ్‌లో 8,66,582 కాపీలు, తెలంగాణలో 3,71,947 కాపీలు, బెంగళూరు, చెన్నై, ముంబై, న్యూఢిల్లీ మెట్రో ఎడిషన్లలో 8,963 కాపీల సర్క్యులేషన్ ఉన్నట్లు తెలిపింది.
తొలి మూడు స్థానాల్లో హిందీ పత్రికలే..
తాజాగా ఏబీసీ విడుదల చేసిన సర్క్యులేషన్ ఫలితాల్లో తొలి మూడు స్థానాల్లో హిందీ పత్రికలే ఉన్నాయి. దైనిక్ భాస్కర్(హిందీ) 30,73,304 సర్క్యులేషన్‌తో మొదటి స్థానంలో, దైనిక్ జాగరణ్(హిందీ) 24,42,728 సర్క్యులేషన్‌తో రెండో స్థానంలో నిలవగా అమర్ ఉజాలా(హిందీ) 17,05,529 సర్కులేషన్‌తో మూడో స్థానంలో నిలిచింది. టైమ్స్ ఆఫ్ ఇండియా(ఇంగ్లిష్) నాలుగో స్థానంలో నిలిచింది. సాక్షి (తెలుగు) 12,47,492 సర్కులేషన్‌తో 8వ స్థానంలో నిలిచింది.