Homeఆంధ్రప్రదేశ్‌Visakhapatnam: సాగరనగర ప్రశాంతతకు భంగం

Visakhapatnam: సాగరనగర ప్రశాంతతకు భంగం

Visakhapatnam: ప్రశాంతతకు మారుపేరు విశాఖ నగరం. అందుకే ఎటువంటి వారైనా అక్కడ ఉండేందుకు ఇష్టపడతారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సాగరనగరం చరిత్ర మసకబారుతోంది. నేర సంస్కృతి పెరుగుతోంది. విశాఖలో శాంతిభద్రతల పరిస్థితులపై ఆందోళన వ్యక్తమవుతోంది. నేరాల సంఖ్య పెరుగుతుండడంతో సామాన్యులు సైతం బెంబేలెత్తిపోతున్నారు. ఓ మెజిస్ట్రేట్ స్థాయి అధికారి అయినా తహసిల్దారును ఇంటి ముందే చంపేయడం మునుపేన్నడు చూడలేదు. ఈ ఘటన జరిగి 24 గంటలు దాటుతున్నా నిందితులను పోలీసులు పట్టుకోలేదు. ఇప్పటికే గుర్తించాం అని మాత్రమే చెబుతున్నారు. హత్య చేసిన తర్వాత ఎయిర్ పోర్టుకు వెళ్లి ఫ్లైట్ కూడా ఎక్కారు అన్న అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. అంటే భారీ ప్రణాళికతోనే తహసీల్దారును హత్య చేశారని తెలుస్తోంది.

అయితే విశాఖకు నేర సంస్కృతి పాకి కొద్ది నెలలు అవుతోంది. ఎంపీ సత్యనారాయణ కుటుంబాన్ని కిడ్నాప్ చేశారు. రెండు రోజుల పాటు తమ ఆధీనంలో ఉంచుకున్నారు. కానీ ఈ కేసులో నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టలేదు. కనీసం ఏం జరిగిందో కూడా వివరణ ఇవ్వలేదు. ఏవేవో కట్టు కథలు చెప్పి పోలీసులు మమ అనిపించేశారు. అటు ఎంపీ సత్యనారాయణ సైతం ఇది ఇక్కడ నుంచి జరిగింది కాదని.. ఎక్కడి నుంచో.. ఎవరో జరిపించారని తేలిగ్గా తీసుకున్నారు. ఇప్పుడు తాజాగా తహసిల్దార్ హత్యలో సైతం పోలీసులు సరిగ్గా వ్యవహరించలేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీని వెనుక చాలా రకాల అనుమానాలు ఉన్నాయి.

2019కి ముందు విశాఖ నగరం ప్రశాంతంగా ఉండేది. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర ప్రాంతాల నాయకుల తాకిడి పెరిగింది. రాజధాని అంశం తెరపైకి వచ్చింది. విశాఖకు రాజధాని రాకమునుపే నేరాలు ప్రవేశించాయి. భూ కబ్జాలు, దోపిడీలు పెరిగాయి. అల్లరిమూకలకు నేతలే ప్రోత్సహిస్తున్నారన్న కామెంట్స్ కూడా ఉన్నాయి. భూకబ్జాలు, సెటిల్మెంట్లు పెరిగాయి.ఈ రెండు అంశాలు రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నాయి. అందులో భాగంగానే నేరాలు పెరుగుతున్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం సీరియస్ గా తీసుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

సాధారణంగా విశాఖ నగరంలో ఉత్తరాధి వారి సంఖ్య అధికం. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉండడంతో వాటిలో ఉద్యోగ,ఉపాధి నిమిత్తం ఉత్తరాధి రాష్ట్రాల నుంచి ఎక్కువమంది విశాఖ వస్తుంటారు. దీనికి తోడు సుదీర్ఘ సముద్రతీరం ఉంది. కానీ ఎన్నడూ నేర సంస్కృతి పెరగలేదు. నగర ప్రజల ప్రశాంతతకు భంగం వాటిల్లే ఏ ఘటన జరగలేదు.కానీ గత ఐదు సంవత్సరాలుగా.. ముఖ్యంగా జగన్ సర్కార్ విశాఖను రాజధానిగా ప్రకటించిన తరువాత జరుగుతున్న ఘటనలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. కడప సంస్కృతి సాగరనగరంలో తెరపైకి వస్తుండడం ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది.

తాజాగా తహసిల్దార్ హత్య వెనుక భూ వివాదాలు ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి స్వస్థలం శ్రీకాకుళం. ఆయన ఉత్తరాంధ్రలో పని చేశారు. ప్రస్తుతం విజయనగరం బదిలీ అయ్యారు. ఇలా బాధ్యతలు తీసుకున్నారో లేదో.. అదే రోజు ఇంటి వద్దకు వచ్చి మరి హత్య చేయడం ఆషామాషీ విషయం కాదు. అయితే ఈ తరహా ఘటనలు ఉత్తరాంధ్రకు కొత్తగా కనిపిస్తున్నాయి. ఉత్తరాంధ్రలో ఇతర జిల్లాల నేతల పెత్తనం ఎక్కువైంది. ఇక్కడ భూములను, విలువైన ఆస్తులను అక్రమంగా రాయించుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే హత్యలు, కిడ్నాప్ లు వంటి నేర సంస్కృతి పెరుగుతుండడం మాత్రం ఉత్తరాంధ్ర ప్రజలను, ముఖ్యంగా విశాఖ నగరవాసులను కలవరపెడుతోంది. అయితే పోలీస్ శాఖ బేల చూపులు చూస్తుండడం విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వం ఇలానే ఉదాసీనంగా వ్యవహరిస్తే మాత్రం సాగర నగర చరిత్ర మసకబారే అవకాశం ఉంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version