Vanama Venkateswara Rao: కాంగ్రెస్ పార్టీలో గెలిచి భారత రాష్ట్ర సమితిలో చేరిన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అనర్హతకు గురయ్యారు. ఆయన ఎన్నిక చెల్లదంటూ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. అయితే వనమా మీద అంతటి బలమైన ఆరోపణలు ఏమున్నాయి? ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొనకుండా ఏ వివరాలు దాచారు?
రైతుబంధు అనర్హత కు కారణమైంది
వాస్తవానికి 2018 ఎన్నికల్లో ఓడిపోయిన అనంతరం జలగం వెంకట్రావు వనమా వెంకటేశ్వరరావు ఎన్నికల ఆఫిడవిట్ మీద దృష్టి సారించారు. ఆయన తప్పుడు వివరాలు సమర్పించారని గుర్తించారు. ముఖ్యంగా తన పేరిట, తన భార్య పేరిట ఉన్న ఆస్తుల వివరాలను వనమా వెంకటేశ్వరరావు ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారని వెంకట్రావు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాదు వనమా పేరిట ఉన్న భూములకు రైతుబంధు డబ్బులు విడుదల కావడాన్ని ఆయన ప్రముఖంగా హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇది కీలక ఆధారంగా నిలిచింది. ప్రాసిక్యూషన్ సమర్పించిన ఆధారాల ప్రకారం స్టేట్మెంట్లను ధర్మాసనం సమగ్రంగా పరిశీలించింది. పాల్వంచ మండల వ్యవసాయ అధికారి ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం పాల్వంచలోని సర్వేనెంబర్ 122/2/ సంస్థాన్ ఎకరం 33 గుంటలకు వనమా రైతుబంధు నిధులు తీసుకున్నట్టు వెల్లడైంది. ఆ భూమికి 2018 నుంచి 2021 వరకు దాదాపు ఎన్నిసార్లు మొత్తం 69,350 తీసుకున్నట్టు ఆధారాలతో సహా నిరూపితమైంది. ఆయన భార్య పేరు మీద పాల్వంచలో సర్వేనెంబర్ 992లో 8.37 ఎకరాల విషయంలో సైతం ఆధారాలు స్పష్టంగా ఉన్నట్టు హైకోర్టు వివరించింది. “ఎన్నికల అఫిడవిట్ లో వనమా తప్పుడు వివరాలు సమర్పించారు. ఆయన భార్యకు సంబంధించిన ఆస్తుల వివరాలు వెల్లడించలేదు. ఆయన మీద ఉన్న క్రిమినల్ కేసుల వివరాలు ఇవ్వలేదు. కాబట్టి ఆయన ఎన్నిక రద్దుచేసి, నన్ను ఎమ్మెల్యేగా ప్రకటించాలని” జలగం వెంకట్రావు 2019 జనవరి 25న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.. అయితే ఆ పిటిషన్ ను డిస్మిస్ చేయాలంటూ వనమా హైకోర్టును అభ్యర్థించారు. హైకోర్టు నిరాకరించడంతో ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారు. చీఫ్ జస్టిస్ డివై చంద్ర చూడ్ 2021 నవంబర్ 8న విచారించి ఈ కేసు విషయంలో తెలంగాణ హైకోర్టునే ఆశ్రయించాలని ఆదేశించారు. తో మళ్ళీ హైకోర్టుకు వచ్చిన ఈ కేస్ పై గత ఏడాది మార్చి రెండో వారం తర్వాత పలు దఫాలుగా విచారణ జరిగింది. జస్టిస్ రాధా రాణి ధర్మాసనం విచారణ చేపట్టింది.
జలగం తరపు న్యాయవాది ఏమన్నారంటే
జలగం తరపు న్యాయవాది కుతుంబాక రమేష్ వాదనలు వినిపించారు. వనమా తన ఎన్నికల అఫిడవిట్ లో 2014 నాటి క్రిమినల్ కేసు ఎఫ్ఐఆర్ నెంబర్ 127 కు సంబంధించిన కేసు వివరాలు వెల్లడించలేదని పేర్కొన్నారు. వనమా తన భార్య పేరిట ఉన్న న్యూ పాల్వంచ ఇందిరానగర్ లోని 300 చదరపు గజాల ఆస్తి గురించి కూడా తెలపలేదని పేర్కొన్నారు. ఆ ఆస్తిలో 151 చదరపు గజాలను వనమా భార్య 2018లో నాగులంచు హరిత అనే మహిళకు రిజిస్టర్ సేల్ డీడ్ ద్వారా విక్రయించారు అని పేర్కొన్నారు. అలాగే ప్రతివాది తనకు హిందూ అవిభాజ్య కుటుంబం( హెచ్ యూ ఎఫ్) నుంచి ఆదాయం ఉందని పేర్కొన్నారు తప్ప.. అందులో ఇతర సభ్యులు ఎవరు? హెచ్ యూ ఎఫ్ తరఫున తనకు రెండో పాన్ కార్డు ఉందనే విషయాన్ని కూడా వెల్లడించలేదని తెలిపారు. వనమా కుమారులకు చీరాల, ఏలూరు ప్రాంతాల్లో రెండు ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయని, అందులో చీరాల సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కాలేజీ క్రిస్టియన్ మైనార్టీ సొసైటీ కింద మంజూరయిందని.. అలాంటప్పుడు హిందూ అవిభాజ్య కుటుంబం ఉండదని, ఈ వివరాలు మొత్తం ప్రతి వాది దాచిపెట్టారని ఆయన పేర్కొన్నారు. 2004, 2009, 2014 ఎన్నికల అఫిడవిట్లో చూపించిన పలు స్థిరాస్తుల వివరాలను తాజా 2018 ఎన్నికల అఫిడవిట్ లో చూపించలేదని.. దీంతో రెవెన్యూ రికార్డుల ప్రకారం సదరు భూములు ఇంకా ప్రతివాది, ఆయన భార్య పేరు మీదే ఉన్నట్టు పేర్కొన్నారు. రమేష్ వాదనతో ఏకీభవించిన హైకోర్టు.. తప్పుడు వివరాలు, ఆస్తుల వివరాలు దాచిపెట్టినట్టు గుర్తించింది. దీంతో వనమా ఎన్నిక చల్లదని తీర్పు చెప్పింది. ఆయన తర్వాతి స్థానంలో నిలిచిన జలగం వెంకట్రావు ను ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ తుది తీర్పు ఇచ్చింది.