Homeజాతీయ వార్తలుVasalamarri: వాసాలమర్రి కుసాలు కదిలాయి.. మీ దత్తతకో పెద్ద దండం కేసీఆర్ సారూ!

Vasalamarri: వాసాలమర్రి కుసాలు కదిలాయి.. మీ దత్తతకో పెద్ద దండం కేసీఆర్ సారూ!

Vasalamarri: ఇళ్ళు కట్టిస్తామంటే సంబరపడ్డారు. బంగారు తునకలాగా చేస్తామంటే ఎగిరిగంతేశారు. ముఖ్యమంత్రి తమతో కూర్చొని భోజనం చేస్తే ఆనంద భాష్పాలు రాల్చారు. ఊరు ఊరును మొత్తం బాగు చేస్తామంటే బతుకులు బాగుపడతాయి అనుకున్నారు. ఇక ఇన్నాళ్లు తాము అనుభవించిన బాధలు మొత్తం తీరుతాయని ఉద్వేగానికి లోనయ్యారు. కానీ చివరికి వారి ఆశలు అడియాసయ్యాయి. ముఖ్యమంత్రి చెప్పిన మాటలు నీటి మూటలు అయ్యాయి. ఏలుగా అనుభవిస్తున్న బాధలే వారికి మళ్ళీ నిత్య కృత్యమయ్యాయి.

పనులు పూర్తి కాలేదు

వాసాలమర్రి గుర్తుందా? సీఎం కేసీఆర్‌ దత్తత తీసుకున్న యాదాద్రి జిల్లా తుర్కపల్లిలోని గ్రామమిది! 2020 నవంబరులో ఊర్లో గ్రామస్థులతో సభ నిర్వహించి, ఊరును ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని.. ఊర్లో ఇళ్లను తొలగించి పక్కా లే అవుట్‌తో 481 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, స్కూళ్లు అంగన్‌వాడీ భవనాలు, హెల్త్‌ సెంటర్‌ కట్టిస్తానని హామీ ఇచ్చారు. ఇందుకు రూ.150 కోట్లు అవసరమైనా సరే వెచ్చిస్తానని ప్రకటించారు! ఇది జరిగి మూడేళ్లయినా వాసాలమర్రిలో అభివృద్ధి పనులు పూర్తవ్వలేదు. ఒక్క ఇల్లూ కొత్తగా నిర్మించలేదు. కొత్త లే అవుట్‌ మేరకు ప్రభుత్వం నిధులు కేటాయించినా.. ఇళ్లు కూల్చివేతకు జనం అంగీకరించడం లేదు. ఇప్పటికప్పుడు ఇళ్లను కూల్చివేస్తే.. ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు. ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న గుడెసెలు, ఇళ్లను ఇప్పటికే కొంతమేర కూల్చివేశారు. బాధితులు, సగం కూలిన ఇళ్లకు టార్పాలిన్లు కట్టుకొని అందులోనే కాలం వెళ్ల దీస్తున్నారు. ప్రభుత్వం చకచకా ఇళ్లను కూల్చివేస్తుందేమో గానీ.. కొత్త ఇళ్ల నిర్మాణం ఎప్పుడు చేపడుతుంది? ఎప్పుడు పూర్తిచేస్తుందనే విషయాల మీద నమ్మకం లేక ఇళ్ల కూల్చివేతకు జనం అంగీకరించడం లేదు.

అప్పట్లో చాలా హామీలు ఇచ్చారు

అప్పట్లోనే వాసాలమర్రిలో చేపట్టాల్సిన అభివృద్ది కార్యక్రమాలపై కలెక్టర్‌ ఆధ్వర్యంలో సర్వే జరిగి ఓ నివేదిక ప్రభుత్వానికి చేరింది. ఎట్టకేలకు ఈ ఏడాది ఏప్రిల్‌ 18న వాసాలమర్రిలో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాల కోసం రూ.58.57 కోట్లను సర్కారు మంజూరు చేసింది. ఇందులోంచి గ్రామంలోని మౌలిక సదుపాయాలు, లేఅవుట్‌ అభివృద్ధికి రూ.30,14 కోట్లు ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల నిర్మాణానికి రూ.3.23 కోట్లు, హెల్త్‌ సబ్‌సెంటర్‌ నిర్మాణానికి రూ.20లక్షలు, మూడు మోడల్‌ అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణానికి రూ.75లక్షలు, 481డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి రూ.24.24 కోట్లు వినియోగించేలా ఉత్తర్వులు జారీచేసింది. ఈ నిధులతో గ్రామంలో ప్రస్తుతం ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, హెల్త్‌ సబ్‌సెంటర్‌ పనులు ప్రారంభమాయ్యయి. లెంటల్‌, స్లాబ్‌ లెవల్లో పనులు కొనసాగుతున్నాయి. అయితే ఇళ్ల నిర్మాణంతో పాటు గ్రామంలో లేఅవుట్‌ రూపకల్పనపై అధికారులు కసరత్తు చేస్తున్నప్పటికీ, గ్రామస్థులు ఇళ్లను ఖాళీ చేసేందుకు ముందుకు రావడంలేదు. ఇప్పటికప్పుడు ఇళ్లు ఖాళీ చేసి ఎక్కడికి వెళ్లాలని వారు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇప్పుడున్న ఇళ్లలోంచి ప్రజలను ఖాళీ చేయిస్తే.. వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎక్కడ చేస్తారనేదానిపై అధికారుల్లోనూ స్పష్టత లేదు. అధికారులు ఇప్పటివరకు గ్రామంలో చేపట్టనున్న మౌలిక సదుపాయాలతోపాటు ఇళ్ల నిర్మాణాలపై పూర్తిస్థాయి నివేదికను, లేఅవుట్‌ను పూర్తి చేయలేదు. ఎన్నికలు సమీపిస్తున్నాయి. నిధుల మంజూరు, ఇళ్ల నిర్మాణంలో జాప్యం జరిగితే తమ పరిస్థితి ఏమిటని ప్రజలు ఆలోచనలోపడ్డారు.

భరోసా ఇస్తే తప్ప..

గ్రామస్థులకు భరోసా ఇస్తే గానీ ఇళ్లను ఖాళీ చేసే పరిస్థితిలేదు. ఊర్లో 550 ఇళ్లు ఉన్నట్లు గుర్తించి.. మొత్తం 481ఇళ్లను కూల్చివేసేందుకు గ్రామంలో అధికారులు పెగ్‌మార్కింగ్‌ చేశారు. కూల్చి వేయకూడని ఇళ్లను కూడా గుర్తించారు. అయితే పెగ్‌మార్క్‌లు వేసిన ఇళ్లను కూల్చివేస్తేనే గ్రామానికి సంబంధించిన పూర్తి లేఅవుట్‌ రూపొందుతోంది. లేఅవుట్‌ ఆధారంగా గ్రామం లో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంతో పాటు కొత్తగా అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ, సీసీ రోడ్లు, సెంట్రల్‌ లైటింగ్‌, సుందరీకరణ పనులపై అధికారులు అంచనాలు రూపొందిస్తారు. ఇళ్లను వెంటనే నిర్మించి ఇచ్చే పరిస్థితి కనబడటంలేదని, ఖాళీ చేస్తే తామంతా దిక్కులేనివారమవుతామని పలువురు గ్రామస్థులు వాపోతున్నారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular