Pawan Kalyan – Janasena : రాజోలు జనసేన అభ్యర్థి ఖరారయ్యారు. ఈ మేరకు పవన్ ప్రకటించారు. దేవ వరప్రసాద్ ను ఖరారు చేశారు. తీవ్ర తర్జనభర్జన నడుమ దేవ వరప్రసాద్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు సమాచారం. జనసేన పార్టీకి రాజోలు కంచుకోట. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన రాపాక వరప్రసాద్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎన్నికలైన కొద్ది రోజులకే ఆయన జనసేన ను వీడారు. వైసీపీలోకి ఫిరాయించారు. అయితే గత నాలుగున్నర సంవత్సరాలుగా జనసైనికులు కసితో పనిచేస్తూ వచ్చారు.. ఇక్కడ అభ్యర్థి ఎవరైనా గెలిపించుకుంటామంటూ తేల్చి చెబుతున్నారు. సిట్టింగ్ స్థానం కావడంతో రాజోలును జనసేనకే కేటాయించారు. దీంతో పార్టీలో ఆశావహుల సంఖ్య అధికంగా ఉంది. కానీ నియోజకవర్గంలో సర్వే చేపట్టి దేవ వరప్రసాద్ ను పవన్ ఎంపిక చేయడం విశేషం.
రాజోలు నుంచి జనసేన అభ్యర్థులుగా పోటీ చేసేందుకు చాలా మంది ముందుకు వచ్చారు. పొత్తులో భాగంగా రాజోలు నుంచి జనసేన అభ్యర్థి పోటీలో ఉంటారనిపవన్ ప్రకటించడంతో.. తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని చాలామంది నాయకులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో కీలక నేతలు టికెట్ తమకంటే తమకు అని ప్రచారం చేసుకున్నారు. ప్రధానంగా ముగ్గురు అభ్యర్థులు పోటీపడ్డారు.
దేవ వరప్రసాద్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి.చంద్రబాబు ప్రభుత్వంలో కీలక అధికారిగా పనిచేశారు. పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితుడు. జనసేన జనవాణి కార్యక్రమాలకు సమన్వయకర్తగా కూడా వ్యవహరించారు. ఆయన సొంత గ్రామం రాజోలు నియోజకవర్గం పరిధిలో ఉంది. అటు చంద్రబాబుతో సైతం సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే దేవ వరప్రసాద్ ఎంపిక సుగమం అయినట్లు తెలుస్తోంది.
డాక్టర్ రాపాక రమేష్ బాబు సైతం జనసేన టికెట్ ను ఆశించారు. స్వతహాగా డాక్టర్ అయిన ఆయన స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. జనసేన తరఫున సర్పంచ్ గా కూడా ఎన్నికయ్యారు. గత మూడు సంవత్సరాలుగా పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేశారు. మరో సీనియర్ నేత బొంతు రాజేశ్వరరావు సైతం టికెట్ ఆశించారు. గత ఎన్నికల్లో ఈయన వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. జనసేన అభ్యర్థి రాపాక వరప్రసాద్ చేతిలో ఓడిపోయారు. రాపాక వైసీపీలో చేరడంతో బొంతు రాజేశ్వరరావు జనసేన వైపు వచ్చారు. కానీ ఈ ఎన్నికల్లో సర్వేల్లో దేవ వరప్రసాద్ ముందంజలో ఉండడంతో పవన్ ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికైతే అనూహ్య పరిణామాల నడుమ కూటమి అభ్యర్థిగా దేవ వరప్రసాద్ నిలవగా.. వైసీపీ అభ్యర్థిగా గొల్లపల్లి సూర్యారావు ఖరారు అయ్యారు. దీంతో రాజోలు రాజకీయం రసవత్తరంగా మారింది.