Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం హోల్ సేల్ వ్యాపారంలో కమీషన్ ఐదు శాతం నుంచి 12 శాతానికి ఎందుకు పెరిగింది? ఇండో స్పిరిట్ లో కవిత భాగస్వామిగా ఉన్న సౌత్ గ్రూప్ 65 శాతం వాటా ఎలా పొందింది? ఈ మధ్య వ్యాపారంలో 100 కోట్లు ఎందుకు పెట్టుబడి పెట్టారు? తర్వాత ఆ 100 కోట్లను రాబట్టుకోవడంలో ఎలాంటి ఎత్తుగడవేశారు? రిటైల్ వ్యాపారంలో నష్టాలు వచ్చినప్పటికీ.. హోల్ సేల్ వ్యాపారంలో ఎన్ని కోట్లు గడించారు? ఇప్పుడు ఈ ప్రశ్నల ఆధారంగానే ఈడి దర్యాప్తు జరపడంతో కీలక విషయాలు వెలుగు చూసాయి. ఈ ఆధారాలు మొత్తం సౌత్ గ్రూపులో ఉన్న కీలక వ్యక్తులు ఇవ్వడం ఇక్కడ విశేషం.
అరుణ్ రామచంద్ర కు అందిన 33 కోట్లలో అభిషేక్ బోయినపల్లికి 3.85 కోట్లు, ముత్తా గౌతమ్ కు 2.60 కోట్లు చెల్లించారు. సౌత్ గ్రూప్ లో ఉన్న కవిత, శరత్ చంద్రారెడ్డి, సృజన్ రెడ్డి, అభిషేక్ బోయినపల్లి, ముత్తా గౌతమ్ కు అరుణ్ రామచంద్ర ద్వారా లాభాల్లో వాటాలు అందాయి. లాభాల్లో మాగుంట శ్రీనివాసులు రెడ్డి, రాఘవరెడ్డి లకు వాటా అందలేదు. ఇది భాగస్వాముల మధ్య వైరానికి కారణమైంది. అంతేకాకుండా ఇండస్పిరిట్ కంపెనీలో మాగుంట శ్రీనివాసులు రెడ్డి తరఫున బినామీగా ఉన్న ప్రేమ్ రాహుల్ ను తప్పించేందుకు రామచంద్ర ప్రయత్నించినట్టు తెలిసింది. కానీ, దినేష్ ఆరోరాకు భాగస్వామిగా ఉన్న సృజన్ రెడ్డికి మాత్రం ఎలాంటి పెట్టుబడులు పెట్టకుండానే ఆయన సంస్థలకు 10 కోట్ల మేరకు లాభాలను చెల్లించారు. సృజన్ రెడ్డికి లైసెన్స్ దక్కనందుకు బెదిరింపులకు పాల్పడ్డారని ఈడి దర్యాప్తులో తేలింది. కాగా, మాగుంట శ్రీనివాసులు రెడ్డి జూలై 17న అప్రూవర్ గా మారగా, ఆ మరునాడే( జూలై 18న) ఆయన కుమారుడు రాఘవకు బెయిల్ లభించడం విశేషం.
అయితే కవిత టీం ద్వారానే తన కుమారుడు రాఘవ ఆప్ నేతలకు 25 కోట్లు సమకూర్చాలని శ్రీనివాసులు రెడ్డి తన వాంగ్మూలంలో ప్రకటించారు. శ్రీనివాసులురెడ్డి, రాఘవ అప్రూవర్లు గా మారిన తర్వాత, దినేష్ ఆరోరా కూడా అప్రూవర్ గా మారారు. కవిత బంధువైన వి. శ్రీనివాసరావు, ఆమె భర్త అనిల్, స్నేహితులు కిరణ్ లోనావత్, పవన్, బల్మూరి ప్రసాద్ ఇతరులు సమకూర్చిన డబ్బుతోనే కవిత తరఫున ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో అరుణ్ రామచంద్ర పెట్టుబడులు పెట్టారని సమాచారం. కవిత ఆదేశాల మేరకే మద్యం వ్యాపారంలో లాభాల్లో వాటాగా వచ్చిన 33 కోట్లతో వట్టి నాగులపల్లి వద్ద అరుణ్ రామచంద్ర ఆస్తులు కొనుగోలు చేశారని తెలుస్తోంది. భూముల కొనుగోలు విషయంలో అరుణ్ రామచంద్రకు “ఫినిక్స్” శ్రీహరి సహాయపడ్డారని సమాచారం. ఈ లావాదేవీల పై కూపీ లాగిన ఈడి అధికారులు.. పీఎంఎల్ఏ సెక్షన్ 50 కింద వాంగ్మూలాలు తీసుకున్నారు.