Chegondi Venkata Harirama Jogaiah: కాపు రిజర్వేషన్లు ఏపీ సీఎం జగన్ మెడకు చుట్టుకున్నట్టు కనిపిస్తోంది. గత మూడున్నరేళ్లుగా కోర్టులో న్యాయపరమైన చిక్కులను సాకుగా చూపుతూ వచ్చిన ఆయన ఎప్పుడు ఏదో ఒక నిర్ణయం ప్రకటించడం అనివార్యంగా మారింది. ఈబీసీ రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటాయని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పడం.. ఇటు ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండడంతో కాపుల నుంచి డిమాండ్ పెరిగింది. మాజీ ఎంపీ, రాష్ట్ర కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు చేగొండి హరిరామజోగయ్య అయితే ప్రభుత్వానికి ఏకంగా డెడ్ లైన్ విధించారు. ఈ నెల 31లోగా కాపుల రిజర్వేషన్ అంశంపై జగన్ సానుకూలంగా ప్రకటన చేసి జీవో జారీ చేయకుంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు. చంద్రబాబు ఇచ్చిన 5 శాతం ఈబీసీ రిజర్వేషన్ రద్దుచేసిన జగన్.. దానికంటే మెరుగైన, కాపులకు అనుకూలమైన నిర్ణయాన్ని ఇప్పటివరకూ ప్రకటించకపోవడంపై జోగయ్య అసంతృప్తి వ్యక్తం చేశారు. తక్షణం సానుకూలమైన నిర్ణయాన్ని తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సీఎం జగన్ కు నేరుగా హరిరామ జోగయ్య లేఖాస్త్రం సంధించారు. లేఖలోని అంశాలను మీడియాకు వెల్లడించారు.కాపులకు అనుకూలంగా ప్రభుత్వం ఏ ఒక్క నిర్ణయం తీసుకోలేదన్నారు. ఉన్న పథకాలు, రాయితీలను నిలిపివేసిందన్నారు. అగ్రవర్ణపేదలకు కేంద్ర ప్రభుత్వం పది శాతం రిజర్వేషన్లు ప్రకటించిందని… ఏపీలో కూడా చంద్రబాబు అమలుచేయడానికి ప్రయత్నించిన విషయాన్ని గుర్తుచేశారు. కానీవైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అప్పటి వరకూ జరిగిన ప్రక్రియను నిలిపివేసిందని.. మూడున్నరేళ్లుగా ఎటువంటి చర్యలు లేవన్నారు.ఈ నెల 31 తేదీలోగా కాపుల రిజర్వేషన్ పై సానుకూల నిర్ణయం తీసుకొని ఉత్తర్వులు జారీచేయాలని.. లేకుంటే తాను ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాహార దీక్షకు దిగుతానని చెప్పారు.
చంద్రబాబు ఇచ్చిన ఐదు శాతం ఈబీసీ రిజర్వేషన్లను జగన్ సర్కారు నిలిపివేయడంతో అసెంబ్లీలో చర్చ జరిగింది. కేంద్రం అందించే పది శాతంలో కాపులకు ఐదు శాతం ఇస్తుంటే ఎందుకు రద్దుచేశారని విపక్ష నేత చంద్రబాబు ప్రశ్నించారు. 2014లో కాపులను బీసీ జాబితాలో చేర్చుతామని టీడీపీ మేనిఫెస్టోలో పెట్టిందని.. తీరా అధికారంలోకి వచ్చాక మంజునాథ కమిషన్ ఏర్పాటుచేసింది.. ఆ నివేదిక కమిటీ చైర్మన్ సంతకం లేకుండా వెల్లడించిందని సీఎం జగన్ తప్పుపట్టారు. దానికి చట్టబద్ధత లేదని..కేంద్రం ఆమోదించదని కూడా తేల్చేశారు. అందుకే రద్దు చేశామని ప్రకటించారు. కాపులు తాము బీసీ జాబితాలో చేర్చాలని కోరుతున్నారని.. ఈబీసీ రిజర్వేషన్లు చెల్లవని జగన్ కొట్టిపారేశారు. కాపులకు మేమే ఏంచేయాలో మా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పామని.. తమ పని తాము చేసుకుంటామని శాసనసభలో చెప్పారు.

అయితే ఇటీవల ఏపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహం కాపుల ఇష్యూను రేజ్ చేశారు. ఈబీసీ రిజర్వేషన్లకు కేంద్రప్రభుత్వ అనుమతి అవసరం లేదని సంబంధిత మంత్రి తేల్చేశారు. రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కేంద్రం ప్రకటించిన 10శాతం లోబడి అందించవచ్చని కూడా చెప్పారు. దీంతో నాడు చంద్రబాబు ఐదు శాతం రిజర్వేషన్లు సక్రమమే అంటూ కేంద్రం క్లీన్ చీట్ ఇచ్చినట్టయ్యింది. కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చిన తరువాత కూడా వైసీపీ ప్రభుత్వం నుంచి ఎటువంటి చలనం లేదు. దీనిపై కాపులు, కాపు సంఘాల ప్రతినిధులు సీఎం జగన్ పై గుర్రుగా ఉన్నారు. అందులో భాగంగానే మాజీ ఎంపీ హరిరామజోగయ్య లేఖాస్త్రం సంధించారు. రిజర్వేషన్ల ప్రకటనపై ఏకంగా సీఎం జగన్ కే డెడ్ లైన్ విధించారు. మరో రెండు రోజుల్లో విశాఖ వేదికగా కాపునాడు సభ జరగనుండగా.. ఇప్పుడు హరిరామజోగయ్య ప్రత్యక్ష ఆందోళన హెచ్చరిక కాక రేపుతోంది.