Dasoju Sravan: రాజకీయ పరిజ్ఞానం, ఏ అంశంపైన అయినా అనర్గళంగా మాట్లాడే వాక్చాతుర్యం ఉన్న నేత దాసోజు శ్రవణ్. తెలంగాణ ఉద్యమకారుడిగా మాత్రమే అందరికీ సుపరిచితం. తెలంగాణ ఉద్యమ సమయంలో దశాబ్దానికిపైగా తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావుతో కలిసి నడిచారు. ఉద్యమంలో తనదైన పాత్ర పోషించారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై మీడియా వేదికగా పలు టీవీ చానెళ్లలో తన గళాన్ని వినిపించారు. దీంతో శ్రవణ్‌కు తక్కువ కాలంలోనే ఎక్కువ గుర్తింపు వచ్చింది.

పీఆర్పీతో పొలిటికల్ ఎంట్రీ..
దాసోజు శ్రవణ్.. పొలిటికల్ ఎంట్రీ సమైక్యాంధ్రలో పీఆర్సీతో ప్రారంభమైంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు. రాజకీయాలపై ఆసక్తి ఉన్న శ్రవణ్‌కు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం ఎజెండా, పార్టీ సిద్ధాంతాలు నచ్చడంతో ఆ పార్టీలో చేరారు. ప్రజారాజ్యంలో కీలకపాత్ర పోషించారు.
సమైక్యాంధ్ర స్టాండ్‌తో టీఆర్ఎస్ గూటికి..
అయితే అప్పటికే తెలంగాణ మలిదశ ఉద్యమం జరుగుతోంది. ఈ సమయంలో పీఆర్పీ సమైక్యాంధ్ర స్టాండ్ తీసుకోవడంతో శ్రవణ్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. తర్వాత టీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ ఉద్యమంలో, టీఆర్ఎస్ పార్టీలో చాలా కాలం యాక్టివ్‌గా పని చేశారు. తక్కువ కాలంలోనే ముఖ్య నేతగా టీఆర్ఎస్లో ఎదిగారు.
తెలంగాణ వచ్చాక టీఆర్ఎస్కు దూరం..
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికల్లోనే శ్రవణ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట ఆశించారు. అయితే కేసీఆర్ తెలంగాణలో శ్రవణ్ సామాజికవర్గం బలంగా ఉన్న నియోజకవర్గం లేదని చెప్పి పక్కన పెట్టారు. దీంతో అసంతృప్తికి గురైన ఆయన టీఆర్ఎస్కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంచి వాగ్దాటి ఉన్న దాసోజు శ్రవణ్‌కు కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు లభించింది. జాతీయ స్పోక్స్ పర్సన్‌గా నియమితులయ్యారు. గత ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి టిక్కెట్ ఇచ్చారు. అక్కడ పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవలి కాలంలో టీఆర్ఎస్ నుంచి పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదే సమయంలో దాసోజు శ్రవణ్‌కు టిక్కెట్‌పై పార్టీ పెద్దల నుంచి హామీ లభించలేదు. దీంతో బీజేపీ నేతలతో సంప్రదింపులు జరిపారు. గ్రీన్ సిగ్నల్ రావడంతో ఆయన రేవంత్‌పై రాళ్లేసి వెళ్లిపోయారు.
రెండు నెలలకే సొంత గూటికి..
బీజేపీలో చేరిన రెండు నెలలకే మునుగోడు ఉప ఎన్నికలు వచ్చాయి. నియోజకవర్గంలో బీసీ ఓటర్లు అధికంగా ఉన్నారు. టీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ గులాబీ పార్టీని వీడారు. బీజేపీలో చేరారు. దీంతో ఖంగుతిన్న టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్, బీజేపీలో చేరిన ఉద్యమ నాయకులను సొంతగూటికి రప్పించేలా స్కెచ్ వేశారు. స్వయంగా శ్రవణ్, స్వామిగౌడ్‌కు ఫోన్‌చేసి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. స్వామిగౌడకు ఎమ్మెల్సీ ఆఫర్ ఇవ్వగా, శ్రవణ్‌కు బీఆర్ఎస్లో కీలక పదవి ఇస్తామని హామీ ఇచ్చారు.
జనసేనానితోనూ అనుబంధం..
జనసేనాని పవన్ కళ్యాణ్‌తో దాసోజు శ్రవణ్కునూ మంచి అనుబంధమే ఉంది. పీఆర్పీలో పనిచేసిన సమయంలోనే నాడు యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్న పవన్‌తో సత్సంబంధాలు కొనసాగించారు. పవన్ కూడా శ్రవణ్ టాలెంట్‌ను గుర్తించి ప్రోత్సహించారు. కౌలురైతు పరామర్శ యాత్ర చేపట్టిన జనసేనాని ఇటీవల భీమవరంలో పర్యటించారు. 2009లో తన సోదరుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడు బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చామన్నారు. బీసీలు రాజ్యాధికారంలో వెనుకబడిపోతున్నారని తాము ఎక్కువ సీట్లు ఇచ్చామని, అది సఫలీకృతం కాకపోయినప్పటికీ ఓ ముందడుగు వేశామన్నారు. కానీ మిగతా వారు ఎవరూ చేయలేదన్నారు. ఈ సందర్భంగా దాసోజు శ్రవణ్ గురించి పవన్ ప్రస్తావించారు. బీసీలు ఇక్కడకు వచ్చి మాట్లాడుతారని, కానీ గ్రామాల్లోకి వెళ్లాక ఎవరికి వారు విడిపోయి మాట్లాడుతారని చెప్పారు. తన స్నేహితుడు దాసోజు శ్రవణ్ అనే విశ్వబ్రాహ్మణ నేతకు 2009లో పీఆర్పీ నుంచి సికింద్రాబాద్ లోకసభ స్థానం కేటాయించామన్నారు. ఆ రోజున అతనికి 1.38 లక్షల ఓట్లు వచ్చాయని, కానీ అక్కడ ఆయన కులం వారు ఎవరూ లేరన్నారు. ఎందుకంటే ఆయనకు అన్ని కులాల వారు ఓటు వేశారన్నారు. అదే దాసోజు శ్రవణ్ 2014లో పోటీ చేస్తానని అడిగితే ‘మీ కులం వాళ్లు ఊరికి పట్టుమని నలుగురు ఉండరు.. కాబట్టి నీకు సీటు ఇచ్చినా గెలవవు’ అని కేసీఆర్ టికెట నిరాకరించారని గుర్తుచేశారు.

తాజాగా పవన్ ఆఫర్..
బీజేపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరిన దాసోజు శ్రావణ్‌కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సాధన కోసం ఆయన ప్రజారాజ్యం నుంచి టీఆర్ఎస్ లో చేరారని.. శ్రవణ్ ఏ పార్టీలో ఉన్న తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తారని అన్నారు. తన స్నేహితుడు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. శ్రవణ్ దూరదృష్టి ఉన్న డైనమిక్ లీడర్‌గా పవన్ అభివర్ణించారు. తాజాగా ఆయనకు కేసీఆర్ బీఆర్ఎస్లో కీలక పదవి ఇస్తారని తెలుసుకున్న జనసేనాని తన మిత్రుడిని వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో లేదా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయించాలని భావిస్తున్నారు. శ్రవణ్ బీఆర్ఎస్ తరఫున ఏపీ నుంచి పోటీ చేస్తే జనసేన మద్దతు ఇస్తుందని తెలిపినట్లు సమాచారం. డైనమిక్ లీడర్‌గా ఉన్న శ్రవణ్‌కు ఏపీలోనూ మంచి గుర్తింప ఉందని తెలిపినట్లు సమాచారం. ఈమేరకు గులాబీ బాస్‌తో కూడా మాట్లాడుతారని తెలుస్తోంది. జనసేనాని కోరితే శ్రవణ్ కూడా కాదనరనే అభిప్రాయం ఉంది. దీంతో అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఎన్నికల్లో శ్రవణ్ బీఆర్ఎస్ టికెట్‌పై ఏపీ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం.