Peddireddy Ramachandra Reddy: చంద్రబాబు ఇంట గెలిచి.. రచ్చ గెలవాలనుకుంటున్నారు. తన సొంత జిల్లా చిత్తూరు పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టనున్నారు. ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హవాకు బ్రేక్ వేయాలని భావిస్తున్నారు. ప్రత్యేక వ్యూహాలు రూపొందిస్తున్నారు. పెద్దిరెడ్డి కుటుంబానికి బ్రేక్ వేస్తే.. చిత్తూరు జిల్లా తన కంట్రోల్లోకి వస్తుందని చంద్రబాబు భావిస్తున్నారు. ముఖ్యంగా పుంగనూరు, తంబళ్లపల్లె అసెంబ్లీ నియోజకవర్గం.. రాజంపేట పార్లమెంట్ స్థానంపై గురి పెట్టారు. అక్కడ బలమైన అభ్యర్థులను బరిలోదించేందుకు పావులు కదుపుతున్నారు.
ముఖ్యంగా పెద్దిరెడ్డి సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి ని ఎలాగైనా ఓడించాలని చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారు. అక్కడ మాజీ ఎమ్మెల్యే ఏవి ప్రవీణ్ రెడ్డిని పోటీకి ఒప్పిస్తున్నారు. గతంలో టిడిపిలో పనిచేసిన ప్రవీణ్ రెడ్డి వైసీపీలో చేరారు. అక్కడ కూడా ప్రాధాన్యత లేకపోవడంతో సైలెంట్ అయ్యారు. ప్రస్తుతం ఆయన ఏ పార్టీలో లేరు. కానీ తంబళ్లపల్లెలో ఏవి ప్రవీణ్ రెడ్డి కుటుంబానికి మంచి పట్టు ఉంది. ప్రవీణ్ తండ్రి ఉమామహేశ్వర్ రెడ్డి గతంలో ఎమ్మెల్సీగా పనిచేశారు. ఆయన హత్యకు గురి కావడంతో భార్య లక్ష్మీదేవమ్మ రాజకీయాల్లోకి వచ్చారు.
1985, 1994లో టిడిపి తరఫున లక్ష్మీ దేవమ్మ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో ఏవి ప్రవీణ్ రెడ్డి టిడిపి తరఫున విజయం సాధించారు. వైసీపీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరారు. కానీ అక్కడ సరైన గుర్తింపు లభించలేదు. వైసిపి ఆధిపత్య పోరుకు బలయ్యారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విభేదించి పార్టీకి దూరమయ్యారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు ప్రవీణ్ రెడ్డిని టిడిపిలోకి రప్పించి టికెట్ ఇవ్వాలని హై కమాండ్ భావిస్తోంది. కీలక నేతలు ఆయనతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
ప్రస్తుతం తంబళ్లపల్లె టిడిపి ఇన్చార్జిగా శంకర్ యాదవ్ ఉన్నారు. ఆయన ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారు. సొంత పార్టీలోనే ఆయనపై వ్యతిరేకత ఉంది. దీంతో పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఎదుర్కోవాలంటే సరైన అభ్యర్థిని బరిలో దించాలని టిడిపి భావిస్తోంది. ప్రవీణ్ రెడ్డిని పిలిచి టిక్కెట్ ఇవ్వడంతో పాటు అన్ని విధాల ప్రోత్సాహం ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రవీణ్ తో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి చర్చలు జరుపుతున్నారని.. లోకేష్ తో మాట్లాడించారని.. సంక్రాంతి తర్వాత ఆయన టిడిపిలో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి కౌంట్ డౌన్ మొదలైనట్లేనని టాక్ నడుస్తోంది.