హుజురాబాద్ వేదికగా రాజకీయ పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇన్నాళ్లు పట్టించుకోని దళితులకు పెద్దపీట వేస్తున్నామని అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) ప్రకటించారు. దళిత బంధు పేరుతో వారికి దగ్గరవ్వాలని ప్రణాళిక రచించారు. ఇందులో భాగంగా ఈనెల 16న దళితబంధు(Dalit Bandhu) పథకాన్ని ప్రకటించి దాన్ని అందరికి వర్తింప జేస్తామని చెప్పారు. దళితబంధు పథకాన్ని రాష్ర్టవ్యాప్తంగా అమలు చేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో రిజర్వేషన్ కల్పిస్తామని భరోసా ఇచ్చారు. దళితుల ఓట్లు టీఆర్ఎస్ కే పడాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో దళితుల అభివృద్ధికే ప్రాధాన్యం ఇస్తామని చెబుతూ వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపే పనిలో ఉన్నామని చెప్పారు.
హుజురాబాద్ ఉప ఎన్నికకు ముందే మంత్రి వర్గం విస్తరించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఇద్దరు దళితులకు మంత్రి పదవులు కేటాయిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఎస్సీ సామాజికవర్గంలో మాదిగలకు ఇంతవరకు మంత్రి పదవి ఇవ్వలేదు. దీంతో ఈసారి ఆ సామాజికవర్గానికి మంత్రి పదవి దక్కనుందని సమాచారం. ఇప్పటికే మంత్రివర్గ విస్తరణపై కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. దీంతో రాజకీయాల్లో మార్పులు చోటుచేసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇంకా పలు రంగాల్లో మార్పులు అనివార్యమే అని తెలుస్తోంది.
ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ వ్యూహం మార్చుకున్నట్లు సమాచారం. పార్టీని విజయతీరాలకే చేర్చే క్రమంలో దళితులనే నమ్ముకున్నట్లు ప్రచారం సాగుతోంది. వారి అండతోనే ప్రభుత్వం మనుగడ సాధ్యమవుతుందని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో దళితబంధు పథకం తీసుకొచ్చి వారిలో కొత్త ఆశలు రేకెత్తించినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా టీఆర్ఎస్ దూకుడుకు ప్రతిపక్షాలు సైతం అదే స్థాయిలో స్పందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. టీపీసీసీ అద్యక్షుడు రేవంత్ రెడ్డి ఇన్నాళ్లు గుర్తుకు రాని దళితులు ఇప్పుడే గుర్తుకు వచ్చారా అని ప్రశ్నిస్తున్నారు.
రాబోయే రోజుల్లో మరిన్ని పథకాలు తీసుకొస్తామని కేసీఆర్ తన మనసులోని మాట వెల్లడించారు. ఏఢాది క్రితమే చేపట్టాల్సిన దళితబంధు కరోనా కారణంగా ఆలస్యమైందని చెప్పారు. దళితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని పేర్కొన్నారు. వారి ఆత్మగౌరవం నిలబడాలనే ఉద్దేశంతోనే వారి కోసం దళితబంధు తెచ్చామని గుర్తు చేశారు. దళితుల ప్రతిష్ట ఇనుమడించేలా పథకాలు చేపడతామని వివరించారు. దళితబంధు పథకం అందరికి వర్తింపజేస్తామని చెప్పారు. హుజురాబాద్ ఉప ఎన్నిక వ్యవహారంలో అన్ని పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేసేందుకు ముందుకు వస్తున్నాయి. దీంతో అధికార పార్టీ వాటికి చెక్ పెట్టాలని చూస్తోంది.