
కరోనా వైరస్ కట్టడికి తొలి నుండి కఠిన చర్యలకు వెనుకాడని ఒడిశా ప్రభుత్వం తాజాగా లాక్‌డౌన్ అమలు అవుతున్న తరుణంలో… రాజధాని భువనేశ్శర్ సహా భద్రక్ పట్టణంలో 48 గంటల పాటు షట్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది.
శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ప్రభుత్వ ప్రధాన కార్యాదర్శి ఏకే త్రిపాఠి వెల్లడించారు. అదే విధంగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో లాక్‌డౌన్ యథావిధిగా కొనసాగుతుందని తెలిపారు. నిత్యావసరాల
అమ్మకాలు జరిపే షాపుల కార్యాకలాపాలకు ఎటువంటి ఆటంకం కలగబోదని చెప్పారు. అయితే రాజధానిలో వీటిని కూడా మూసివేస్తామని.. కేవలం ఎంపిక చేసిన మెడికల్ స్టోర్ల సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక పాలనా యంత్రాంగం ఆదేశాల ప్రకారం షాపు నిర్వాహకులు నడుచుకోవాలని ఆదేశించారు.
ఒడిశాలో ఇప్పటివరకు ఐదు కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా.. అందులో నలుగురు బాధితులు భువనేశ్వర్, భద్రక్ పట్టణానికి చెందినవారే గమనార్హం. ‘‘ భువనేశ్వర్, భద్రక్ జిల్లా కేంద్రంలో 48 గంటల పాటు అనగా ఆదివారం రాత్రి ఎనిమిది గంటల దాకా షట్‌డౌన్ విధించనున్నాం. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాం’ అని త్రిపాఠి తెలిపారు.
షట్‌డౌన్ కారణంగా ప్రజలు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని డీజీపీ అభయ్ భరోసా ఇచ్చారు. అయితే ప్రాణాంతక వైరస్ వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.