
Kapu Reservation: ఆ పార్టీకి మాట తప్పడం అలవాటే. మడమ తిప్పడం పరిపాటే. ఎన్నికల ముందు రాములా.. ఎన్నికల తర్వాత రెమోలా నటించడం షరా మామూలే. సామాజిక సాధికారత పేరుతో పాఠాలు చెప్తారు. సొంత సామాజిక వర్గానికి అగ్రతాంబూలం ఇస్తారు. కాపులను వంచించడంలో వారికి మించిన వారు లేరు. కాపు రిజర్వేష్లను గురించి ఎన్నికల ముదు ఒక మాట.. ఎన్నికల తర్వాత ఒక మాట. మాట తప్పడంలో, మడమ తిప్పడంలో బ్రాండ్ అంబాసిడర్ ఆయనే.
కాపు రిజర్వేషన్ల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. కేంద్రం ఇచ్చిన పది శాతం ఈడబ్ల్యూఎస్ కోటాలో.. కాపులకు ఐదు శాతం ఇవ్వాలన్న డిమాండ్ మరోసారి చర్చకు వచ్చింది. తాజాగా ఈ అంశం పై హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పదిశాతం ఈడబ్ల్యూఎస్ కోటాలో ఐదు శాతం రిజర్వేషన్లు కాపులకు అమలు చేయలని మాజీ మంత్రి హరిరామజోగయ్య హైకోర్టుకు వెళ్లారు. ఈ అంశం పై హైకోర్టులో విచారణ జరిగింది. కాపు రిజర్వేషన్ల అంశం పై ఇప్పటికే హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. తాజాగా మరోసారి ఈ పిటిషన్ పై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కీలక నిర్ణయం తీసుకుంది. పిటిషనర్ లేవనెత్తిన డిమాండ్ కు సామాజిక ప్రాధాన్యత ఉన్న నేపథ్యంలో కేసును హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రవీణ్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్టు వెల్లడించింది.

హైకోర్టు నిర్ణయం నేపథ్యంలో .. ఇక నుంచి హరిరామజోగయ్య పిటిషన్ ను సీజే బెంచ్ విచారించనుంది. కాపులకు రిజర్వేషన్ కావాలని ఎన్నో దశాద్దాలుగా ఏపీలో డిమాండ్ ఉంది. 2014 ఎన్నికల ముందు చంద్రబాబు కాపులకు 5 శాతం రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక కాపుల రిజర్వేషన్ల కోసం పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. చంద్రబాబు పై కాపు నేతలు ఒత్తిడి పెంచారు. ఫలితంగా కేంద్రం ఇచ్చిన 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటాలో 5 శాతం కాపులకు ఇస్తున్నట్టు చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ జగన్ సీఎం అయ్యాక కాపుల రిజర్వేషన్ అంశాన్ని పక్కనబెట్టేశారు.
కాపుల విషయంలో జగన్ వైఖరి ఆది నుంచి వివాదాస్పదంగానే ఉంది. కేంద్రం పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు అందులో ఐదు శాతం రిజర్వేషన్లు కాపులకు ఇవ్వడానికి జగన్ కు నొప్పి ఏంటో అర్థం కావడంలేదు. 2019 ఎన్నికల సమయంలో జగన్ కాపులకు అనేక హామీలు ఇచ్చారు. ఓట్లేయించుకున్నారు. గద్దెనెక్కారు. కానీ కాపుల పై మాత్రం చిన్నచూపు చూస్తున్నారు. హరిరామజోగయ్య లాంటి సీనియర్ నేతలు రిజర్వేషన్ కోసం పోరాడుతుంటే వారిని జగన్ పట్టించుకోవడం లేదు. కాపుల రిజర్వేషన్ అంశం ఓ సమస్య కానట్టు వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
