Kodali Nani, Vangaveeti Radha: ఏపీలో కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. మొన్నటివరకు సైలంట్ అయిన కరోనా మరోసారి పంజా విసరడంతో రోజువారీగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. మంగళవారం ఒక్కరోజే 1800లకు పైగా కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య కొద్దిగా తగ్గుముఖం పట్టినా కొత్తగా కేసులు నమోదవుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చిత్తూరు, అనంతపురం, కృష్ణా, నెల్లూరు, గుంటూరు, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లోనే వందకు పైగా కేసులు నమోదవుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వంగవీటి రాధాకు కరోనా సోకింది. వీరిద్దరు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు తెలిపారు. జలుబు, జ్వరం, దగ్గుతో బాధపడుతున్న ఇద్దరు నేతలకు కొవిడ్ టెస్టులు చేయగా, పాజిటివ్ తేలిందని వైద్యులు వెల్లడించారు.
Also Read: ‘భీమ్లా నాయక్’ ఫ్యామిలీ పిక్ వైరల్.. పవన్ కొడుకే అట్రాక్షన్ !
దివంగత టీడీపీ నాయకుడు వంగవీటి రంగ విగ్రహావిష్కరణ సమయంలో మంత్రి కొడాలి నాని, వంగవీటి రాధా, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తదితరులు కీలక నేతలు కలుసుకున్నారు. ఆ తర్వాత రాధా తనను హత్యచేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో టీడీపీ నేతలు వరుసగా ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ జాబితాలో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఉన్నారు.
వంగవీటి రాధాకు కరోనా సోకిందనే వార్త వినగానే టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. తమకు ఎక్కడ ఈ మహమ్మారి సోకుతుందేమోనని భయాందోళనకు గురవుతున్నారు. మంత్రి కొడాలి నాని, రాధాకు కొవిడ్ పాజిటివ్ రాకముందే ఏపీలో నైట్ కర్ఫ్యూ విధించేందుకు జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, సంక్రాంతి పండుగ నేపథ్యంలో సొంతూర్లకు వచ్చే వారికోసం ఈనెల 18 నుంచి రాత్రి నిర్భంధం విధించాలని కొన్ని సడలింపులు చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.
Also Read: ఐపీఎల్ లో కీలక పరిణామాలు.. టాటా గ్రూప్ కు స్పాన్సర్ బాధ్యతలు