ఏపీ సీఎం జగన్ ఓ వైపు కరోనా కట్టడికి చర్యలు చేపడుతారు. సమీక్షల మీద సమీక్షలు చేస్తారు.కానీ ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలు ఉన్నాయా? లేవా? అన్నది కూడా చూడరా? అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మాటలకు అందని ఘోరాలు ఈ కరోనా వల్ల దాపురమవుతున్నాయి. కనీవినీ ఎగురని స్థాయిలో కరోనా కబళిస్తోంది. విధ్వంసం సృష్టిస్తోంది. చావుకళను తెప్పిస్తోంది. అందరిలోనూ ఇప్పుడు ‘ఊపిరి’ ఆడని పరిస్థితి. ఈ మాయదారి మహమ్మారి యువతను, వృద్ధులను సైతం బలితీసుకుంటోంది. అయితే కట్టడి చేయాల్సిన ప్రభుత్వాలు ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయన్న ఆరోపణలను తెచ్చుకుంటున్నాయి.
తాజాగా అనంతపురం సర్వజన ప్రభుత్వాసుపత్రిలో దారుణం వెలుగుచూసింది. ఆ ప్రభుత్వాసుపత్రికి కరోనా రోగులు పోటెత్తడంతో పడకల కొరత తీవ్రమైంది. దీంతో ఒకే మంచంపై ఇద్దరు రోగులను పడుకోబెట్టి ఆక్సిజన్ అందిస్తున్న దైన్యం కనిపించింది.
అనంతపురం జిల్లా కణేకల్లు మండలానికి చెందిన సుంకన్న అనే వృద్ధుడు తాజాగా కోవిడ్ లక్షణాలతో ఊపిరాడని స్థితిలో గురువారం ఉదయం ఆస్పత్రిలో చేరాడు. సుంకన్నకు పడక లేకపోవడంతో ఓ యువకుడు ఉన్న పడకపైనే ఆక్సిజన్ పెట్టి చికిత్స అందించారు.
అయితే కొద్దిగంటల్లోనే ఆ వృద్ధుడు పాపం చనిపోయాడు. మృతదేహం ఉన్న పడకపైనే యువకుడు శవంతోనే రెండు గంటల పాటు ఆక్సిజన్ తో చికిత్స పొందిన దయనీయ స్థితి కనిపించింది. వైద్యులు వృద్ఢుడు చనిపోయాడని కూడా చూడకపోవడంతో యువకుడు శ్వాస ఇబ్బందులతో ఆ శవం పక్కనే చికిత్స పొందుతున్న దౌర్భాగ్యపు స్థితి ఏపీలో కనిపించింది. ఇప్పుడీ పరిస్థితి చూసి అందరూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కరోనా ఎంతటి ఉపద్రవాలు తెస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజారోగ్యం పట్టని ప్రభుత్వాల తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు.