
గత ఆరేడు నెలలుగా కరోనాతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఉద్యోగాలు కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారు. చేసుకుందామంటే పనిలేక కూలీలు ఇంటికే పరిమితం అవుతున్నారు. పెద్దపెద్ద కోట్లాది రూపాయల టర్నోవర్ కలిగిన కంపెనీలూ తమ ఖర్చులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. చాలా వరకు ఎంప్లాయ్‌మెంట్‌ని తగ్గించాయి. వర్క్ ఫ్రం హోం ఇచ్చి సాలరీస్‌లలో కోతలు పెడుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే.. కరోనాకు ముందు.. కరోనా తర్వాత అన్నట్లు లైఫ్‌లు మారిపోయాయి.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలను ఆదుకోవాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా తమ ఖజానాను నింపుకోవాల్నో ఆలోచిస్తున్నాయి. ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ బాదేందుకు ప్రయత్నిస్తున్నాయి. కేంద్రానికి తోడు రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి కూడా అలాగే ఉండడంతో ప్రజలపై ‘మూలిగే నక్కపై తాటికాయ పడినట్లుగా’ అవుతోంది.
ఏపీలో సీఎం జగన్ 15 నెలల పాలనలో ఇష్టం వచ్చినట్లు ధరలు పెంచుతూ వస్తున్నారు. కరెంట్ చార్జీలు, ఆర్టీసీ చార్జీలు, పెట్రోల్, డీజిల్, మద్యం, రిజిస్ట్రేషన్ భూముల ధరలు పెంచారు. తాజాగా.. నిత్యావసర సరుకులు ధరలు కూడా మండిపోతున్నాయి. మరోవైపు మోడీ నేతృత్వంలోని కేంద్రం కూడా పెట్రోలు డీజిల్ ధరలు పెంచుతూ వంటగ్యాస్ పై సబ్సిడీ తగ్గిస్తోంది.
వాస్తవానికి ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ విపక్షాలు ఆందోళనలు చేపట్టాలి. కానీ ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వాలపై ప్రతిపక్షాలు ఎక్కడా గొంతెత్తడం లేదు. వామపక్ష పార్టీల్లో కొందరు మినహా మిగితా వారు తమ వాయిస్ వినిపించడం లేదు. ఏపీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, బీజేపీ జనసేనలు పత్రికా ప్రకటనలకే పరిమితమయ్యాయి.
కరోనా కొంత తగ్గుముఖం పడుతున్నా.. విపక్షాలు ఇంకా కరోనా సాకు చూపి బయటకు రావడం లేదు. అంతేకాదు.. ఆన్‌లైన్‌లోనే నిరసనలు లేదంటే పత్రికా ప్రకటనలతో సరిపెట్టుకుంటున్నాయి. ఈ రకంగా 8 నెలలుగా ఎన్నో ప్రజా ఉద్యమాలు ఊపిరి పోసుకోలేదని చెప్పవచ్చు. జనాలు రోడ్లెక్కడం లేదని.. విపక్షాలు కూడా పత్రికా ప్రకటనలకే పరిమితమయ్యాయనే తెలుస్తోంది. వీటిని తమకు అనుకూలంగా మలచుకొని ప్రభుత్వాలు తమ నిర్ణయాలను ప్రకటిస్తూ భారం మోపుతున్నాయి. ఎలాగూ ప్రజావ్యతిరేకత రావడం లేదు కదా అని రోజుకో భాగం వేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు సైలెంట్‌గా ఉన్న ప్రజలు.. కొంత కరోనా ఉధృతి తగ్గాక మాత్రం ఎలా ఊరుకుంటారు..? ప్రభుత్వాలకు వారి నుంచి నిరసన సెగలు తగలకుండా పోతాయా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.