వారికి తిరుమల ఆలయంలోకి ప్రవేశం లేదు..!

తిరుమల శ్రీవారి దర్శనానికి ట్రయల్ రన్ ఈ నెల 8 నుంచి ప్రారంభిస్తున్నట్లు టిటిడి ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. ప్రభుత్వం ఆదేశాల ప్రకారం 8, 9 తేదీల్లో టిటిడి ఉద్యోగులతో ట్రయల్ రన్ నిర్వహిస్తామని అన్నారు. భక్తులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలన్నారు. క్యూలైన్లలో కనీసం ఆరడుగుల భౌతిక దూరం పాటించాలని సూచించారు. నిబంధనలు పాటిస్తూ రోజుకి ఎంత మందికి దర్శనాలు చేయించేందుకు అవకాశం ఉండాన్న అంశంపై చర్చిస్తామన్నారు. ఈ నెల 11వ తేదీ నుంచి సామాన్య […]

Written By: Neelambaram, Updated On : June 5, 2020 5:32 pm
Follow us on


తిరుమల శ్రీవారి దర్శనానికి ట్రయల్ రన్ ఈ నెల 8 నుంచి ప్రారంభిస్తున్నట్లు టిటిడి ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. ప్రభుత్వం ఆదేశాల ప్రకారం 8, 9 తేదీల్లో టిటిడి ఉద్యోగులతో ట్రయల్ రన్ నిర్వహిస్తామని అన్నారు. భక్తులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలన్నారు. క్యూలైన్లలో కనీసం ఆరడుగుల భౌతిక దూరం పాటించాలని సూచించారు. నిబంధనలు పాటిస్తూ రోజుకి ఎంత మందికి దర్శనాలు చేయించేందుకు అవకాశం ఉండాన్న అంశంపై చర్చిస్తామన్నారు. ఈ నెల 11వ తేదీ నుంచి సామాన్య భక్తులకు దర్శనాలకి అనుమతిస్తామని తెలిపారు. రోజుకు 7 వేల మందికి మాత్రమే దర్శనం కల్పిస్తామన్నారు. ఆన్ లైన్ ద్వారా దర్శనానికి రిజిస్టర్ చేసుకోవాలని చెప్పారు. రోజుకి అన్ లైన్ లో మూడువేల మందికి బుక్ చేసుకునేందుకు అనుమతిస్తామని తెలిపారు. 65 ఏళ్ళుపై బడిన వృద్ధులు, పడేళ్లలోపు పిల్లల్ని కొండపైకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు.

అదేవిధంగా దేశ వ్యాప్తంగా కంటైన్మెంట్ జోన్లు, రెడ్ జోన్ల పరిధిలో ఉన్నవారు దయచేసి దర్శనాలపై రావద్దని సూచించారు. అలాంటి ఏరియాల నుంచి ఒకవేళ ఆన్ లైన్లో బుక్ చేసుకున్నా కూడా అలిపిరి గేటు దగ్గర పరిశీలన అనంతరం నిలిపివేస్తామని తెలిపారు. ఉదయం ఆరున్నర నుంచి సాయంత్రం ఏడున్నర వరకూ మాత్రమే దర్శనాలకి అనుమతి ఇవ్వనున్నట్లు చెప్పారు. ఆన్ లైన్ లో బుక్ చేసుకోలేని భక్తులు అలిపిరి గేటు దగ్గర బుకింగ్ కౌంటర్ దగ్గర ఆఫ్ లైన్ లో రిజిస్టర్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ నెల 11వ తేదీ నుంచి ఉదయం ఆరున్నర నుంచి ఏడున్నర వరకూ గంట పాటు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనాలకు అనుమతిస్తామని చెప్పారు. భద్రతా కారణాలతో అలిపిరి నడక మార్గం ద్వారా, ఘాట్ రోడ్డు ద్వారా మాత్రమే భక్తులను అనుమతిస్తున్నామని తెలిపారు. శ్రీవారి నడక మార్గంలో భక్తులని అనుమతించమన్నారు. లడ్డు ఆన్ లైన్ లో విక్రయాలు ఈ నెల 8వ తేదీ నుంచి నిలిపివేస్తున్నట్లు చెప్పారు.

అలిపిరి గేటు వద్ద రిజిస్ట్రేషన్ కౌంటర్ లో ధర్మల్ స్క్రీనింగ్ జరుగుతుందన్నారు. వాహనాలకు పూర్తి స్థాయిలో శానిటైజ్ చేసిన అనంతరమే కొండపైకి పంపుతామని తెలిపారు. భక్తులకు రాండంగా శాంపిల్స్ తీసుకుని కరోనా పరీక్షలు చేసేందుకు అలిపిరిలోనూ, కొండపైన ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కల్యాణ కట్టలో భక్తులకు తలనీలాలు తీసే అంశంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. హుండీని భక్తులు తాకకుండా భక్తులు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. హుండీని తాకకూడదని భక్తులని అదేశించలేమన్నారు. ఇది మనోభావాలకు సంబంధించిన అంశమని తెలిపారు. ఉచిత అన్నదాన సత్రంలోకి అతి తక్కువ మందికి అనుమతించనున్నట్లు చెప్పారు. కరోనా బారిన పడకుండా ప్రతి ఒక్క భక్తుడు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.