ఏపీలోని జగన్ సర్కార్, ప్రతిపక్ష టీడీపీ దొందూ దొందూలాగానే వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. తమ వాళ్లకు కంచెంలో.. పగవారికి విస్తరాకుల్లో భోజనం పెడుతున్న చందంగా వ్యవహరిస్తోందన్న టాక్ ఉంది. తిరుపతి రుయా ఆస్పత్రి ఘటనలో 11 మంది కరోనా రోగులు మరణించడం తీవ్ర విషాదం నింపింది. అయితే రావాల్సిన టైంకు ఆక్సిజన్ ట్యాంకర్ తమిళనాడు నుంచి రాకపోవడంతో ఆలోగా ఆక్సిజన్ అయిపోయి ఆస్పత్రిలో రోగులు ప్రాణాలు కోల్పోయారు.
దీనిపై టీడీపీ పోరుబాట పట్టింది. రోగుల ప్రాణాలకు బాధ్యత వహించి జగన్ రాజీనామా చేయాలని.. నిజనిర్ధారణ కమిటీ వేయాలని డిమాండ్ చేసింది.
ఇక గత సంవత్సరం మొదటి వేవ్ లో సైతం ఇలాంటి సంఘటనే జరిగింది. విజయవాడలోని రమేశ్ ఆస్పత్రి ఓ ప్రైవేటు హోటల్ లో నడిపిస్తున్న కరోనా ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగి 10 మంది మృతిచెందారు. సదురు ఆస్పత్రి నిర్వహణలో భద్రతా ప్రమాణాలు పటించలేదని.. ఫైర్ సేఫ్టీ లేదని తేలింది. అయితే నాడు జగన్ సర్కార్ తీవ్ర చర్యలు తీసుకోలేదని.. పరిహారం విషయంలో అంతగా స్పందించలేదన్న ఫిర్యాదు ఉంది.
రమేశ్ ఆస్పత్రి ఏపీలోని ప్రముఖ కమ్మ వారి సారథ్యంలో కొనసాగుతోంది. స్వయంగా చంద్రబాబు సామాజికవర్గం కావడంతో ఆ విషయంలో నాడు చంద్రబాబు మౌనం దాల్చారు. ఇక జగన్ సర్కార్ సైతం విచారణ జరిపినా కోర్టుకెళ్లి రమేశ్ ఆస్పత్రి నిర్వాహకులు స్టే తెచ్చుకున్నారు. చంద్రబాబు దీనివెనుక ఉన్నారన్న పేరు ఉంది. ఇక జగన్ సర్కార్ దాన్ని వదిలేసింది.
ఇలా అధికార, ప్రతిపక్షాలు విజయవాడలో చనిపోతే ఒకలా.. ఇప్పుడు తిరుపతి రుయాలో చనిపోతే మరోలా స్పందిస్తున్నారు. అవసరాన్ని బట్టి రంగులు మారుస్తున్న వైనం హాట్ టాపిక్ గా మారింది.