
మంత్రాలకు చింతకాయలు రాలుతాయో లేదో కానీ.. ఇప్పుడు కొబ్బరినూనెకు మాత్రం కరోనా తగ్గిపోతుందట.. కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తాజాగా ఓ మహిళ కొబ్బరినూనె సీసాతో వచ్చింది. తమకు తెలిసిన వారికి కొబ్బరినూనె రాసి ప్రార్థన చేసింది. ఇలా చేస్తే దేవుడు కరుణించి కరోనాను తరిమికొడుతాడని ఆ మహిళ నమ్మకం..
ఎవరి నమ్మకాలు వారివి.. వారిని వద్దనడానికి ఏమీ లేదు. అయితే అది ఒక మతం వారు చేసేసరికి పక్కనే ఉన్న రోగులు అడ్డుకున్నారు. కొబ్బరినూనెతో కరోనా తగ్గిపోతే ఇంత మంది వైద్యులు, టీకాలు, మందులు ఎందుకంటూ సదురు మహిళను నిలదీశారు. ప్రార్థనలతో నయం అయితే ఆస్పత్రుల్లో చికిత్సలెందుకు అని ప్రశ్నించారు.
బయట కరోనా తీవ్రంగా ఉందని.. లోపలా ఉందని.. ఇలా కొబ్బరినూనె అందరికీ రాసుకుంటూ పోతే కరోనా వ్యాప్తి కాదా? అని రోగులు సదురు మహిళను నిలదీశారు.
అయితే ‘నువ్వు ఎక్స్ ట్రాలు మాట్లాడకు.. నా ఇష్టం నేను వస్తానంతే’ అంటూ ఆ మహిళ రోగులను హెచ్చరించింది. అయితే ఇలా కొబ్బరినూనెతో కరోనా తగ్గిస్తానని మహిళ వచ్చిందని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. అది కాస్త వైరల్ గా మారింది.
దీనిపై ఆస్పత్రి సూపరింటెండ్ ను వివరణ కోరగా.. ఆయన ఈ ఘటనపై స్పందించలేదు.
