‘ఓ చేత్తో ఇచ్చి.. ఇంకో చేత్తో లాగేసుకోవడం’ అంటే ఇదేనేమో. ఏపీ ప్రభుత్వం వైఖరిపై ఇప్పుడు అలాంటి విమర్శలే వస్తున్నాయి. వాహనమిత్ర పథకం పేరుతో ఆటో డ్రైవర్లకు ఏటా వాహనమిత్ర కింద రూ.10 వేలు ఇస్తామంటూ వైసీపీ ప్రభుత్వం చెప్పింది. అమలు చేసింది కూడా. ఆ తర్వాత కొద్దికాలానికే పెట్రోలు, డీజిల్‌పై అదనపు వ్యాట్ రూపంలో ఆటోవాలాలకు ఝలక్ ఇచ్చింది. అప్పటివరకూ రూ.2గా ఉన్న అదనపు వ్యాట్‌ను రూ.4కు పెంచింది.
Also Read : బాబుకు వయసు బెంగ పట్టుకుందట..?
ఇప్పుడు తాజాగా.. రాష్ట్రంలో సీఎన్‌జీ ధరలను పెంచుతూ నిర్ణయించారు. రాష్ట్రంలో చాలావరకు ఆటోలు గ్యాస్ ఆధారితమైనవే. ఈ గ్యాస్‌పై కిలోకు రూ.5.60 పెరిగింది. ఒకేసారి ఇంతలా పెరగడంతో ఆటోవాలాలు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఏటా రూ.10 వేలు ఇస్తామంటే సంబరపడిపోయిన తమకు ఇప్పుడు వైసీపీ సర్కారు పెద్ద షాక్ ఇచ్చిందని ఆవేదన చెందుతున్నారు. 10 వేలు ఏమో కానీ.. అదనంగా రూ.20 వేలు భారం మోపారని విమర్శిస్తున్నారు.
సహజవాయువుపై రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఒకేసారి 10 శాతం విలువ ఆధారిత పన్ను పెంచింది. ఇప్పటివరకు 14.5 శాతంగా ఉన్న వ్యాట్‌ను 24.5 శాతానికి పెంచేసింది. దీంతో కిలో ధర రూ.62గా ఉన్న సీఎన్‌జీ ఏకంగా రూ.67.60కు చేరింది. ఇంత భారం పడటం ఈ మధ్యకాలంలో ఎప్పుడూ చూడలేదని గ్యాస్ ఏజెన్సీలు పేర్కొన్నాయి. ప్రభుత్వం మాత్రం ఇది కేవలం పరిశ్రమలు, విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు తప్ప పేదలపై ఎలాంటి భారం ఉండదంటూ చెప్పుకొచ్చింది. కానీ.. సీఎన్‌జీ ఆధారంగా నడిచే ఆటోల గురించి మాత్రం ఎక్కడా చెప్పలేదు.
‘కరోనాతో ఆదాయం లేదని పెట్రోలు, డీజిల్, సీఎన్‌జీ ధరలు పెంచారు. కరోనాతో మొన్నటి వరకూ ఆటోలు తిరగనివ్వలేదు. ఇప్పుడు తిరిగినా తక్కువ మందినే ఎక్కించుకోవాల్సి వస్తోంది. ఇంటి ఖర్చులకు కూడా సరిపోవడం లేదు. అంతంత మాత్రంగానే ప్యాసింజర్లు ఎక్కుతున్నారు. ఇప్పుడు గ్యాస్ ధర పెంచారు. ప్రభుత్వంపై కరోనా ప్రభావం ఉందని ఇలా పేదలపై పడితే ఎలా’ అని ఓ ఆటో డ్రైవర్ ప్రశ్నించాడు. ప్రభుత్వం నుంచి క్లారిటీ వచ్చేవరకు ఆటో వాలాలకు ఈ బాధలు తప్పేలా లేవు.
Also Read : బీజేపీకి వైసీపీ పాహిమాం.. ఎదురించుట లేదు