తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. కేసీఆర్ వర్సెస్ ఈటల రాజేందర్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. కేసీఆర్ క్యాబినెట్లో ఆర్థిక శాఖ మంత్రిగా.. ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేశారు. ఉద్యమకారుడిగా.. క్యాబినేట్ మినిస్టర్ గా అపార అనుభవం కలిగిన ఈటల రాజేందర్ పై ఇటీవల భూకుంభకోణం ఆరోపణలు రావడంతో సీఎం కేసీఆర్ ఆయనను బర్తరఫ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.
గత రెండ్రోజులుగా ఈటల రాజేందర్ పై మీడియాలో వస్తున్న కథనాలు చూస్తుంటే ఓ పక్కా ప్రణాళిక ప్రకారంగానే ఆయనను క్యాబినెట్ తప్పించినట్లు కన్పిస్తోంది. ఈ వార్తలపై రాజేందర్ సైతం స్పందిస్తూ కుట్రపూరితంగా తనపై కొన్ని మీడియా ఛానళ్లు.. కొందరు నాయకులు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
ఈటల రాజేందర్ ను క్యాబినేట్ నుంచి తొలగించడం ముందస్తు ప్రణాళికలో భాగంగానే జరిగిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే గతంలో ఎన్టీఆర్ హయాంలో బడా నాయకులు మంత్రులను బయటకు పంపించిన వైనం గుర్తుకు తెస్తుంది. నాడు ఎన్టీఆర్ అల్లుళ్లకు పెద్దపీఠ వేస్తే కేసీఆర్ తన కుటుంబానికి పార్టీలో పెద్దపీఠ వేశారు.
సీఎం కేసీఆర్ తన కొడుకులు.. కూతురు.. అల్లుడికి కీలక పదవులు కట్టబెట్టి ఉద్యమకారులను పార్టీ నుంచి ఒక్కొక్కరిగా గెంటివేస్తున్నారు. ఇప్పటికే చాలామంది ఉద్యమకారులు టీఆర్ఎస్ నుంచి బయటికి వెళ్లి వేరే పార్టీల్లో పని చేస్తున్నాయి. అయితే వీరందరికీ ఈటల రాజేందర్ అంతటి రాజకీయ చరిత్ర లేదు.
రాజేందర్ ను సీఎం కేసీఆర్ తన కుడిభుజంగా పలువేదికలపై ప్రకటించారు. అలాంటి కుడిభుజంపై కేసీఆర్ నేడు గురిపెట్టడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఏదిఏమైనా సీఎం కేసీఆర్ వర్సెస్ ఈటల రాజేందర్ వ్యవహారం మరింత ముదిరేలా కన్పిస్తోంది. దీంతో టీఆర్ఎస్ లో మున్ముందు ఎలాంటి రాజకీయ పరిణామాలు జరుగుతాయనేది ఆసక్తికరంగా మారింది.