CM KCR- Republic Day 2023: రాజ్యాంగం.. స్వతంత్ర భారత దేశానికి ఒక పవిత్ర గ్రంథం. భావిభారత దేశాన్ని ముందుగానే ఊహించుకుని, అన్నివర్గాలకు సమన్యాయం జరిగేలా, అందరికీ స్వేచ్ఛ ఉండేలా, అన్ని వర్గాలు స్వతంత్రంగా ఎదిగేలా, ప్రతీ భారతీయుడు తమ హక్కులను పొందేలా అపర మేధావి, భారత రత్న బాబాసాహేబ్ అంబేద్కర్ ఈ పవిత్ర గ్రంథాన్ని రూపొందిచారు. పరిస్థితులకు, అవసరాలకు అనుగునంగా చట్ట సభల ద్వారా సవరించుకునే అవకాశం కల్పించారు. భారత గడ్డపై పుట్టిన ప్రతీ పౌరుడు రాజ్యాంగానికి బద్దుడై ఉండాలని, రాజ్యాంగాన్ని గౌరవించాలని కూడా అందులో పేర్కొన్నాడు. బహుషా కేసీఆర్ లాంటి వారు ఉంటారని అంబేద్కర్ అప్పుడే ఊహించారేమో. ఎందుకంటే.. అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడాడు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారా చట్టసభల్లో బిల్లు ప్రవేశపెట్టి స్వరాష్ట్రం సాధించారు. కానీ ఇప్పుడు ఆ రాజ్యాంగాన్నే లెక్కచేయడం లేదు.. అంతటితో ఆగకుండా రాజ్యాంగానే అమవానిస్తున్నాడు. రాజ్యాంగ నిర్మాతగా ఏనాడూ అంబేద్కర్‌ను గౌరవించలేదు.. అంబేద్కర్ ఫొటోకు నమస్కరించిన దాఖలాలు ఎక్కడా లేవు. ప్రజలు అధికారం ఇచ్చారన్న అహంకారంతో సొంత రాజ్యాంగం అమలు చేస్తున్నాడు. అంబేద్కర్ రాజ్యాంగమే వద్దనే దుస్సాహసానికి ఒడిగట్టాడు. అంబేద్కర్‌కు రాజ్యాంగానికి, దళితులకు ఏమిటి సంబంధం అని ప్రశ్నించే స్థాయికి గర్వం పెంచుకున్నాడు. ఇక రాజ్యాంగబద్ధ పదవులనైనే ఎడమకాలు చెప్పు అంటూ అవమానించడం కూడా ఆయనకే చెల్లింది. రాష్ట్ర ప్రథమ పౌరురాను గవర్నర్ వ్యవస్థనే అవనించేలా ప్రొటోకాల్ పాటించకుండా అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ఘనుడు. భారత శత్రుదేశాలు చైనా, పాకిస్తాన్‌ను పొగుడుతూ మాతృదేశాన్ని అవమానించడం ద్వారా తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిన చందంగా వ్యవహరించారు. భారత సైన్యాన్ని అవమానించడం ఆయనకు పరిపాటిగా మారింది. పరిస్థితి ఇలాగే పోతే.. రాజ్యాంగం ఇచ్చిన హక్కుల అమలు కోసం కూడా తెలంగాణలో పౌరులు కోర్టుకు వెళ్లాల్సి వస్తుందేమో అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
సొంత రాజ్యాంగమే నడవాలని..
కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రస్తుత రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించి తన మనసులో రాజ్యాంగంపై ఉన్న ఏహ్యభావాన్ని బయటపెట్టుకున్నారు. తర్వాత మాటలను సరిదిద్దుకునే ప్రయత్నం చేసినా.. చేష్టలు మాత్రం.. రాజ్యాంగ వ్యతిరేకంగానే సాగుతున్నాయి. తెలంగాణకు తానే రాజునని, తన రాజ్యాంగమే ఇక్కడ చెల్లిబాటు కావాల్సి అన్నట్లు పాలన సాగిస్తున్నారు. తెలంగాణ భారత దేశంలో లేదు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. తాను చెప్పిందే వేదం.. తన మాటే శాసనం అన్నట్లుగా పాలన సాగిస్తున్నారు. ఇక ఎన్నికల ముందు ఒకమాట చెప్పి.. అధికారంలోకి వచ్చాక ఆ మాట తాను అనలేదు అసెంబ్లీలో ప్రకటించడం కూడా కేసీఆర్‌కే చెల్లుతుంది. తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి దళితుడే.. దళితులందరికీ మూడెకరాల భూమి.. పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు, నిరుద్యోగులకు భృతి, సొంత భూమి ఉన్నవారికి ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షలు, రైతు రుణమాఫీ.. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక హామీలు ఉన్నాయి. అధికారంలోకి వచ్చాక తాను అనలేదని ప్రజలు విశ్వసించేలా చెప్పడంలో కేసీఆర్ మాటకారితనమే వేరు.
గణతంత్ర వేడుకలు నిర్వహించకుండా..
భారతీయుల పవిత్ర గ్రంథం అయిన రాజ్యాంగం అమలులోకి వచ్చిన దినంగా స్వతంత్ర భారత దేశంలో ఏటా జనవరి 26న గణతంత్ర దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మాత్రం ఈ వేడుకలను అప్రధాన్యంగా మార్చేశారు. గవర్నర్ జాతీయ జెండా ఎగురవేస్తున్నారన్న కారణంగా ఆ వేడుకల ప్రాధాన్యం తగ్గిస్తున్నారు. తాజాగా కోవిడ్ సాకు చూపి 74వ గణతంత్ర వేడుకలను రాజ్‌భవన్‌కు పరిమితం చేశారు. రాజ్యాంగబద్ద వేడుకల కోసం కోర్టు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి తెలంగాణలో ఏర్పడింది. ఈ పరిస్థితి భారతీయుడిగా తెలంగాణ పౌరుడు బాధపడాల్సిన తరుణం. సొంత రాజ్యాంగం అమలు చేయాలని చూస్తున్న కల్వకుంట్ల పాలనపై అప్రమత్తం కావాల్సిన సమయం.
రాజ్యాంగాన్ని అవమానిస్తే..
రాజ్యాంగాన్ని అవమానించిన వాడు భారతీయుడు ఎలా అవుతాడని కేసీఆర్‌ను విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. కేసీఆర్‌కు ఈ దేశంలో ఉండే అర్హతే లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ అన్నారు. రాజ్యాంగం ప్రకారం కోర్టు ఆదేశాలిచ్చినా పరేడ్ మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించకపోవడం ముమ్మాటికీ బాబాసాహెబ్ అంబేద్కర్‌ను అవమానించడమేనని మండిపడ్డారు. మహిళా గవర్నర్‌ను అడుగడుగునా అవమానిస్తున్న బీఆర్‌ఎస్ పార్టీ మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల సీఎంలను పదేపదే ఆహ్వానిస్తున్న కేసీఆర్‌కు ఆయా రాష్ట్రాల్లో గణతంత్ర వేడుకలకు గవర్నర్లను ఆహ్వానించొద్దని, గవర్నర్ల వ్యవస్థను రద్దు చేయాలని చెప్పే దమ్ముందా? అని సవాల్ విసిరారు. దేశంలో సగర్వంగా తలెత్తుకుని తిరిగేలా రూపొందించిన అంబేద్కర్ రాజ్యాంగం కావాలా? తలదించుకుని బానిసల్లాగా బతికే కల్వకుంట్ల రాజ్యాంగం కావాలా? ప్రజలు ఆలోచించాలని కోరారు.

74 ఏళ్లుగా చెక్కుచెదరని స్ఫూర్తి..
స్వతంత్ర భారత దేశంలో రాజ్యాంగాన్ని వివిధ అవసరాల కోసం 105 సార్లు సవరించారు. కానీ ఏనాడూ రాజ్యాంగ ఉనికి, స్ఫూర్తి దెబ్బతినేలా ఏ పాలకులూ వ్యవహరించలేదు. మన రాజ్యాంగాన్ని అనేక దేశాలు ఆదర్శంగా తీసుకున్నాయి. కానీ, తెలంగాణలో మాత్రం రాజ్యాంగ విరుద్ధంగా పాలన జరుగుతోంది. ముఖ్యమంత్రికి కోర్టులంటే, రాజ్యాంగం అంటే గౌరవం లేదు. అంబేద్కర్ అంటే గౌరవం లేదు. గవర్నర్, మహిళలంటే అసలే గౌరవం లేదు. గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించుకోవడానికి కోర్టుకు వెళ్లి అనుమతి తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవాలి. గతంలో అగ్రవర్ణ గవర్నర్‌కు సాష్టాంగ నమస్కారం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఉన్నత చదువు చదివిన మహిళా గవర్నర్‌ను మాత్రం అవమానిస్తున్నారు. రాజ్యాంగ పరిరక్షణ కావాలని విపక్షాలు ఆందోళన చేసే పరిస్థితి రావడం పాలకులు అనుసరిస్తున్న వైఖరికి నిదర్శనం.