https://oktelugu.com/

Thummala Nageswara Rao: అభ్యర్థుల జాబితాలో పేరు లేదు.. కెసిఆర్ అవకాశం ఇస్తారనే నమ్మకమూ లేదు.. పాపం ఆ మాజీ మంత్రి!

తుమ్మల నాగేశ్వరరావు.. ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలకు ఈ పేరు ను కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పలుమార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పనిచేసిన అనుభవం ఈయన సొంతం.

Written By:
  • Rocky
  • , Updated On : August 22, 2023 / 01:29 PM IST

    Thummala Nageswara Rao

    Follow us on

    Thummala Nageswara Rao: ఆయనది 40 ఏళ్ల రాజకీయ అనుభవం. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక సార్లు మంత్రిగా పని చేసిన చరిత్ర ఆయనది. ఎన్టీఆర్ నుంచి మొదలు పెడితే కెసిఆర్ వరకు పలువురు ముఖ్యమంత్రి దగ్గర కీలక శాఖలు నిర్వర్తించిన నేర్పరితనం ఆయన సొంతం. నిన్న మొన్నటి వరకు ఆయనకు అవకాశం లభిస్తుందని అందరూ అనుకున్నారు. ఆయన కూడా పలు సందర్భాల్లో ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. ఆ మధ్య ఖమ్మంలో భారత రాష్ట్ర సమితి ప్లీనరీ నిర్వహించినప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా భారం మొత్తం ఆయన భుజాలపైన వేశారు. సీన్ కట్ చేస్తే నిన్న ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో ఆయన పేరు లేదు.. ఇకపై కూడా పార్టీ ఆయనను గుర్తిస్తుందన్న నమ్మకం లేదు. ఇంతకీ ఆయన ఎవరంటే.

    తుమ్మల నాగేశ్వరరావు.. ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలకు ఈ పేరు ను కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పలుమార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పనిచేసిన అనుభవం ఈయన సొంతం. జలగం వెంగళరావు తర్వాత ఆ స్థాయిలో ఖమ్మం అభివృద్ధికి ఈయన కృషి చేశారు. కానీ దురదృష్టవశాత్తు పలుఓటములు ఈయనను పలకరించాయి. 2014లో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ చేతిలో ఓటమి పాలయ్యారు. అదే సమయంలో భారత రాష్ట్ర సమితిలో చేరి మంత్రి అయ్యారు. రోడ్డు భవనాల శాఖ బాధ్యతలు స్వీకరించి ముఖ్యమంత్రి చెప్పిన పనులు మొత్తం పూర్తి చేశారు. అయితే అప్పుడు ముఖ్యమంత్రి ఈయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. అయితే ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన రామిరెడ్డి వెంకట్రెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మృతి చెందడంతో ఖాళీ అయిన ఆ స్థానానికి తుమ్మల పోటీ చేశారు. రామ్ రెడ్డి వెంకట్ రెడ్డి భార్య మీద గెలుపొందారు. 2018 ఎన్నికల్లో అదే అసెంబ్లీ స్థానంలో పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఇక అప్పటినుంచి తుమ్మల నాగేశ్వరరావు పార్టీ పట్టించుకోవడం మానేసింది. మధ్యలో ఎమ్మెల్సీ ఇస్తామని ప్రకటించినప్పటికీ కేసీఆర్ దానిని పట్టించుకోలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అవసరం మేరకు వాడుకున్నారు తప్ప.. తుమ్మలకు కల్పించిన పదవి భాగ్యం గాని, ప్రయోజనం గాని లేదు.

    ఇటీవల నిర్వహించిన భారత రాష్ట్ర సమితి ప్లీనరీ వేడుకలకు ముఖ్యమంత్రి కేసీఆర్ హరీష్ రావు రంగంలోకి దింపి తుమ్మలను బుజ్జగించారు. ఆ ప్లీనరీ మొత్తం తుమ్మల పర్యవేక్షించేలా చూశారు. తర్వాత పక్కన పెట్టారు. ఇదే సమయంలో పాలేరు నియోజకవర్గం లో తుమ్మల నాగేశ్వరరావు పలుమార్లు పర్యటించారు. ఈసారి సీతారామ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలి కాబట్టి కచ్చితంగా తాను పోటీ చేస్తానని ప్రకటించారు. అనూహ్యంగా ఎమ్మెల్యేల జాబితా నుంచి తుమ్మల పేరు కనిపించకపోవడం విశేషం.. వాస్తవానికి ఎమ్మెల్యే స్థానాలు దక్కని వారికి అధిష్టానం బుజ్జగించింది. ఉదాహరణకు తాండూరు స్థానం పైలెట్ రోహిత్ రెడ్డికి ఇచ్చారు. పైలట్ రోహిత్ రెడ్డికి మహేందర్ రెడ్డి కి పొసగడం లేదు. కానీ మహేందర్ రెడ్డిని కెసిఆర్ పిలిచి మాట్లాడారు. ప్రస్తుతం క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణలో ఆయనకు అవకాశం కల్పిస్తున్నారు. భూపాలపల్లి విషయంలోనూ మధుసూదనా చారి ఒకింత ఆగ్రహంగా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ టికెట్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ గండ్ర వెంకటరమణారెడ్డి కేటాయించారు. ఆయనకు టికెట్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో అనే విషయాన్ని ముఖ్యమంత్రి మధుసూదనాచారికి చెప్పారు. కానీ పాలేరు విషయంలో తుమ్మలకు టికెట్ కేటాయించకపోయినప్పటికీ ముఖ్యమంత్రి ఆయనను పిలిచి మాట్లాడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అంటే తుమ్మల కూడా ముఖ్యమంత్రి తీరుతో విసిగిపోయి ఉన్నారని భారత రాష్ట్ర సమితి వర్గాలు అంటున్నాయి. త్వరలో ఆయన కాంగ్రెస్ లేదా బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఒకవేళ ఈ రెండు పార్టీల్లో ఏదో ఒక దాంట్లో చేరితే, ఆయన పాలేరు నుంచి పోటీ చేసే అవకాశాలు కొట్టి పారేయలేనివని సమాచారం.