Muslim Schemes in AP: ముస్లీంలను వైసీపీ ప్రభుత్వం వంచిస్తోందా? వారిని అన్నివిధాలా అణగదొక్కుతుందా? వారి పథకాలను నిర్వీర్యం చేస్తోందా? కేంద్ర ప్రభుత్వానికి భయపడి వారి సంక్షేమానికి పాతర వేస్తోందా? అంటే జరుగుుతున్న పరిణామాలు అవుననే సమాధానం వినిపిస్తున్నాయి. వరుసగా ముస్లింల పథకాలు నిలిపివేస్తుండడం ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. గత ఎన్నికల్లో ముస్లింల అభిమానాన్ని చూరగొన్న జగన్ వారి ఓట్లను గుంపగుత్తిగా పొందగలిగారు. ఫలితం సుమారు 30 వరకూ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు సునాయాసంగా గెలుపొందగలిగారు. అటువంటిది అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ రూటు మార్చారు.
బీజేపీ పెద్దలకు కోపం వస్తుందనో.. లేక ఆర్ ఎస్ఎస్ డేగ కన్ను వేసిందో తెలియదు కానీ..ముస్లింలకు ప్రాధాన్యత తగ్గిస్తూ వచ్చారు. పేద ముస్లింలకు కొండంత అండగా నిలిచిన ‘దుల్హన్’ పథకాన్ని నిలిపివేశారు. కారణమేమిటంటే నిధుల కొరత కారణమని ఏకంగా న్యాయస్థానానికి నివేదించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. విపక్షంలో ఉన్నప్పుడు నాటి చంద్రబాబు సర్కారుపై జగన్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ముస్లింలను నిలువునా మోసం చేస్తున్నారని కూడా చెప్పుకొచ్చారు. 2014లో విశాఖలో ముస్లింలతో భారీ సమావేశం నిర్వహించిన జగన్ చంద్రబాబు ప్రభుత్వ విధానాలను తప్పుపడుతూ తాను అధికారంలోకి వస్తే ముస్లింల జీవన ప్రమాణాలను పెంచుతానని.. వారి బతుకులు బంగారుమయం చేస్తానని తెగ హామీలిచ్చారు. 2019లో అధికారంలోకి వచ్చిన తరువాత ఆ ఊసే మరచిపోయారు. అన్ని నవరత్నాల్లోనే అంటూ తేల్చిచెప్పారు. ఇప్పుడు డబ్బులు లేవన్న సాకు చూపి పేద ముస్లిం కుటుంబాల్లో వధువు వివాహానికి అందించే రూ.50 వేల సాయాన్ని కూడా నిలిపివేశారు. ఇదేమని ప్రశ్నిస్తుంటే ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని అడ్డగోలు వాదనను తెరపైకి తెచ్చారు. రాష్ట్రంలో మిగతా వర్గాల పథకాలకు భారీగా కేటాయింపులు చేస్తున్న తరుణంలో.. మా విషయంలో మాత్రం జగన్ దారుణంగా వంచించారని ముస్లిం సోదరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 43 లక్షల మంది ముస్లింలు ఉండగా.. వారికి గత ప్రభుత్వం అందించిన పథకాలు సైతం నిలిపివేయడంతో.. ఆయా వర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
Also Read: Teachers Assets: టీచర్ల దెబ్బకు వెనక్కి తగ్గిన ప్రభుత్వం.. అసలు కథ ఇదీ
తోఫా ఏదీ?
గత ప్రభుత్వాల హయాంలో ముస్లిం మైనార్టీలకు మెరుగైన పథకాలు అందేవి. ఏటా పండుగల సమయంలో రంజాన్ తోఫా వంటివి అందించే వారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చాక అటువంటివి కనుచూపు మేరలో కూడా లేవు. సాధారణంగా ముస్లింలు నగరాలు, పట్టణాల్లో జీవనం సాగిస్తుంటారు. మెకానిక్ లుగా ఉపాధి పొందుతుంటారు. దీంతో ప్రభుత్వాలు వారికి స్వయం ఉపాధి పథకాలు అందించి ఉదారంగా ఆదుకునేవి. ఎయిర్ కండీషనింగ్, ఫ్రిజ్, ఆటో మోబైల్, డ్రైవర్ కమ్ మెకానిక్, వెబ్ డిజైనింగ్, బ్యాంకింగ్, బుక్ పబ్లిషింగ్ వంటి రంగాలకు సంబంధించి కోర్సుల్లో నైపుణ్య శిక్షణనిచ్చేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. మసీదుల నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ప్రభుత్వం చేసిన ప్రకటనలేవీ కార్యరూపం దాల్చలేదు. రాష్ట్రంలో దాదాపు 3,500 వరకూ ముస్లింల ప్రార్థనాలయాలు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాను యూనిట్ గా తీసుకొని వీటి మరమ్మతులకు కోట్లాది రూపాయల నిధులు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. చాలావరకూ పనులు ప్రారంభించారు. తరువాత నిధులు విడుదల చేయకుండా ప్రభుత్వం ముఖం చాటేయ్యడంతో ఎక్కడి పనులు అక్కడ నిలిచిపోయాయి. ఇక ముస్లింల జీవన ప్రమాణాలు పెంచేందుకు వారికి వడ్డీలేని రుణాలు అందించేందుకు ఇస్లామిక్ బ్యాంక్ ప్రారంభిస్తామని కూడా జగన్ హామీ ఇచ్చారు. అధికారం చేపట్టి మూడేళ్లు దాటినా ఆ ఊసే లేదు.
శిక్షణ నవ్వులపాలు
ఇటీవల మైనార్టీ సంక్షేమ శాఖ ‘డ్రోన్ పైలెట్’ శిక్షణ పేరిట నిరుద్యోగ యువతకు శిక్షణ ప్రారంభించింది. చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల నిరుద్యోగ యువతకు కడపలో ఏర్పాటుచేసిన శిక్షణ విషయంలో కూడా విఫలమైంది. 400 మంది మైనార్టీ యువతను శిక్షణకు ఎంపిక చేశారు. తొలుత నోటిఫికేషన్ లో‘డ్రోన్ పైలెట్’ శిక్షణ అంటూ పేర్కొన్నారు. వాస్తవానికి డ్రోన్ పైలెట్ శిక్షణను కేంద్ర పౌర విమానాయన శాఖ నుంచి అనుమతులు ఉన్న సంస్థలే ఇవ్వాలి. అప్పుడే వారికి కేంద్ర పౌర విమానయాన శాఖ నుంచి ధ్రువపత్రం అందిస్తారు. సర్టిపికెట్ పొందితేనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. కానీ అవేవీ ఆలోచించకుండా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులు ఇష్టారాజ్యంగా శిక్షణ పేరిట ముస్లిం యువతను మోసం చేశారు. ఇప్పుడు కేవలం మేము డ్రోన్ ఆపరేటింగ్ పైనే శిక్షణనిస్తున్నట్టు చెబుతున్నారు. దీంతో శిక్షణ తీసుకుంటున్న యువకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ తీరును, మైనార్టీ సంక్షేమ శాఖ వ్యవహర శైలిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అంతా వ్యూహాత్మకంగా..
గత ఎన్నికల్లో తనను ఎంతగానో ఆదరించిన ముస్లింలను జగన్ పక్కన పెడుతుండడం వ్యూహాత్మకమేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అదంతా కేంద్రంలోని బీజేపీ పెద్దల ప్రాపకం కోసమేనన్న ఆరోపణలు మాత్రం వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కేంద్ర పెద్దల సాయం జగన్ కు అవసరం. అందుకే అందివచ్చిన ఏ అవకాశాన్ని ఆయన విడిచిపెట్టడం లేదు. కీలక బిల్లుల సమయంలో సపోర్టు చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి బేషరతుగా మద్దతు ప్రకటించారు. రాష్ట్ర ప్రయోజనాలు డిమాండ్ చేసి సాధించే అవకాశం వచ్చినా.. తనకు,పార్టీకి లాభం చేకూర్చేందుకు కేంద్ర పెద్దల వద్ద వినయ విధేయతలను ప్రకటిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర పరిస్థితులపై ఆర్ఎస్ఎస్ డేగ కన్ను వేసి ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో మత మార్పిడులు, క్రిస్టియన్ ఆధిపత్యం ఎక్కువైందని ఆర్ఎస్ఎస్ గుర్రుగా ఉంది. ఈ పరిస్థితుల్లో వారి ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందోనని జగన్ ముస్లింలకు ప్రాధాన్యత తగ్గించారు. 43 లక్షల ముస్లింలను అన్నివర్గాలతో కలిపే చూస్తున్నారు. నవరత్నాలతో సర్దుకుపోండి. మీకు ప్రత్యేకంగా ఏమీ ఇచ్చేది లేదని తేల్చిచెబుతున్నారు.
Also Read:Pawan Kalyan: పవన్ కళ్యాణ్ నే ఆశ్చర్యపరిచిన ‘అమ్మ’ సాయం