CM Jagan- Ganta Srinivasa Rao: ‘గంటా’కు గంట కొట్టేయాలని జగన్ డిసైడ్ అయ్యారు. ఏ పార్టీలో ఉన్నాడో తెలియని నేత ఆయన.. ఎవరు గెలుస్తారో అంచనావేసి మరీ దూరిపోయే సీనియర్ ఆయన.. ఆయన అడుగులు ఎప్పుడూ అధికార పార్టీ వైపే పడుతాయి.. అందుకే వ్యూహాత్మక మనిషి ఏపీ సీఎం టార్గెట్ చేశారు. ఉత్తరాంధ్రలో బలమైన నేతను కొట్టాలని ప్లాన్ రెడీ చేస్తున్నారు. ఈ ఒక్కడిని కొడితే అందరిపై ప్రతాపం పడుతుందని భావిస్తున్నారు.ఏపీలో మరోసారి అధికారంలోకి రావాలని జగన్ గట్టి పట్టుదలతోనే ఉన్నారు. ఇప్పటికే నియోజకవర్గ రివ్యూలు మొదలుపెట్టారు. ముఖ్యంగా టీడీపీ సిట్టింగ్ స్థానాలపై గురిపెట్టారు. గత ఎన్నికల్లో టీడీపీ గెలిచిన 23 సీట్లలో ముందస్తుగానే అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. ఆ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటిస్తున్నారు.ఈ నేపథ్యంలో సీనియర్ నాయకుడు గంటా ప్రాతినిధ్యం వహిస్తున్న విశాఖ ఉత్తర నియోజకవర్గంలో కేకే రాజు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. వచ్చే ఎన్నికల్లో కేకే రాజు బరిలో ఉంటారని.. ఆయన గెలుపునకు కృషిచేయాలని పార్టీ శ్రేణులకు దిశ నిర్దేశం చేశారు.అయితే ఎప్పుడూ గెలుపు ఫార్ములాతో ముందుకెళ్లే గంటాను ఎలాగైనా కట్టడి చేయాలని జగన్ వ్యూహం రూపొందిస్తున్నారు.

గంటా శ్రీనివాసరావు గత ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేశారు. అనూహ్య విజయం సాధించారు. కానీ రాష్ట్రంలో టీడీపీ ఘోర పరాజయంతో పునరాలోచనలో పడ్డారు. పార్టీకి అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తూ వచ్చారు. అడపాదడపా టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. తొలుత ఆయన వైసీపీలో చేరుతారని భావించారు. కానీ అక్కడ నాయకులు ఆయనకు మొకాలడ్డారు. దీంతో గంటా సైలెంట్ అయిపోయారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమ సమయంలో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. కానీ స్పీకర్ ఇంతవరకూ రాజీనామాను ఆమోదించలేదు.
మరోవైపు గంటా జనసేనలోకి ఎంట్రీ ఇస్తారని ప్రచారం సాగుతోంది. ప్రజారాజ్యం పార్టీలో గంటా యాక్టివ్ రోల్ పోషించారు. అటు విశాఖ జిల్లాలో నాలుగు స్థానాలను పీఆర్పీ కైవసం చేసుకోవడం వెనుక గంటా కృషి ఉంది. పీఆర్పీ కాంగ్రెస్ లో విలీనం తరువాత మంత్రి పదవి సొంతం చేసుకున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీలో చేరి భీమిలి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మంత్రి పదవి పొందారు. కానీ గత ఎన్నికల్లో టీడీపీ ఓటమితో నైరాశ్యంలోకి వెళ్లిపోయారు. అయితే చంద్రబాబు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్ల ప్రకటనతో గంటా కూడా మళ్లీ టీడీపీ నుంచి పోటీచేస్తారని అంతా భావించారు. కానీ ఆయన జనసేన వైపు మొగ్గుచూపుతున్నట్టు ప్రచారం సాగుతోంది.

అటు గంటా విషయంలో తెలుగుదేశం పార్టీలో సైతం అభ్యంతరాలున్నాయి. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పట్టించుకోవడం లేదన్న అపవాదు ఉంది. అందుకే గంటాను సైడ్ చేయాలని చంద్రబాబుపై తెలుగు తమ్ముళ్లు ఒత్తిడి చేస్తున్నారు. కానీ చంద్రబాబు ఏ నిర్ణయమూ తీసుకోలేదు. ఇప్పుడు జగన్ వైసీపీ అభ్యర్థిని ఖరారు చేయడంతో గంటా ఎలా స్పందిస్తారన్నది చూడాలి. ప్రతి ఎన్నికలోనూ కొత్త నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందుతూ వస్తున్న గంటా అసలు ఏ పార్టీ నుంచి బరిలో దిగుతారన్నది క్లారిటీ లేదు. అయితే జగన్ మాత్రం వచ్చే ఎన్నికల్లో గంటాను కట్టడి చేయాలని చూస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ముందుగానే అభ్యర్థిని ప్రకటించి గంటాకు గట్టి షాకే ఇచ్చారు.