https://oktelugu.com/

Killi Krupa Rani: టిడిపిలోకి కిల్లి కృపారాణి?

2003లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సమయంలో కృపారాణి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2004 ఎన్నికల్లో శ్రీకాకుళం పార్లమెంటు స్థానం అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది.

Written By:
  • Dharma
  • , Updated On : January 12, 2024 / 11:28 AM IST

    Killi Krupa Rani

    Follow us on

    Killi Krupa Rani: కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణికి సీఎం జగన్ షాక్ ఇచ్చారు. ఆమె ఆశిస్తున్న శ్రీకాకుళం ఎంపీ స్థానాన్ని వేరొకరికి కట్టబెట్టారు. అటు టెక్కలి అసెంబ్లీ సీటు ఇస్తారని ప్రచారం జరిగినా.. అది కూడా కేటాయించలేదు. దీంతో ఆమె తీవ్ర మనస్తాపంతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ మారేందుకు దాదాపు డిసైడ్ అయినట్లు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆమె ఒక వెలుగు వెలిగారు. ఎంపీగా ఎన్నికైన తొలిసారి కేంద్ర మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. కానీ వైసీపీలోకి వచ్చిన తర్వాత ఆమె ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అడుగడుగునా అవమానాలు ఎదురవుతున్నాయి. ఇప్పుడు తనను కనీస పరిగణలోకి తీసుకోకపోవడంతో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు.

    2003లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సమయంలో కృపారాణి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2004 ఎన్నికల్లో శ్రీకాకుళం పార్లమెంటు స్థానం అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. కానీ ఆ ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు. ఎర్రం నాయుడు గెలిచారు. 2009 ఎన్నికల్లో రెండోసారి ఆమె మరోసారి లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేశారు. అదే ఎర్రంనాయుడు పై గెలుపొందారు. యూపీఏ ప్రభుత్వంలో సహాయ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు.2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగానే మూడోసారి పోటీ చేసి ఓడిపోయారు.

    2019 ఎన్నికలకు ముందు కృపారాణి వైసీపీలో చేరారు. అప్పటికే సీట్ల సర్దుబాటు పూర్తి కావడంతో.. పార్టీ అధికారంలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తానని జగన్ హామీ ఇచ్చారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కృపారాణికి రక్తహస్తమే ఎదురైంది. రాజ్యసభ, ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన సమయంలో కృపారాణి పేరు తెరపైకి వచ్చేది. కానీ ఒక్క పదవి కూడా తలుపు తట్టలేదు. దీనికి ధర్మాన ప్రసాద రావే కారణమని కృపారాణి ఆరోపించేవారు. సాధారణ ఎన్నికల్లో తన పేరును ప్రతిపాదనలోకి తీసుకుంటారని.. అంతవరకు ఓపిక పట్టాలని భావించారు. కానీ శ్రీకాకుళం ఎంపీ స్థానాన్ని పేరాడ తిలక్ కు, టెక్కలి అసెంబ్లీ సీటును దువ్వాడ శ్రీనివాస్ కు కేటాయించడంతో కృపారాణికి చుక్కెదురు అయ్యింది. ఆమె ఆశలు నీరుగారిపోయాయి. అందుకే ప్రత్యామ్నాయం వైపు ఆమె చూస్తున్నారు.

    కృపారాణి తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతంలో ఓసారి సీఎం జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ఆమెకు అవమానం ఎదురైంది. సీఎంను కలిసేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దాని వెనుక ధర్మాన ప్రసాదరావు ఆదేశాలు ఉన్నాయని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. కన్నీటి పర్యాంతమయ్యారు. దీంతో ఆమె పార్టీ మారడం ఖాయమని అప్పట్లో ప్రచారం జరిగింది. తెలుగుదేశం నేతలకు టచ్ లోకి వెళ్లినట్లు టాక్ నడిచింది. కానీ వైసిపి తనకు టికెట్ కేటాయిస్తుందని ఆమె నమ్మారు. కానీ ఆ ఛాన్స్ దక్కలేదు. అందుకే ఆమె టిడిపిలో చేరేందుకు దాదాపు సిద్ధమైనట్లు సమాచారం. చంద్రబాబు నుంచి భరోసా లభిస్తే ఆమె సైకిల్ ఎక్కడం ఖాయంగా తెలుస్తోంది. వైసిపి పై గట్టి రివెంజ్ తీర్చుకోవాలని ఆమె భావిస్తున్నట్లు సమాచారం.