
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త పార్టీని గూర్చి క్లారిటీ ఇచ్చారు. ప్రజా సంఘం రాష్ట్రవ్యాప్త కార్యదర్శులతో భేటీ అయిన తర్వాత రజనీ రాజకీయ జీవితం గూర్చి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. త్వరలోనే తాను ఓ రాజకీయ పార్టీని ప్రకటిస్తానన్నారు. అయితే తన పార్టీలో మాత్రం యువతకే ప్రాధాన్యత ఇస్తూ.. అన్ని పార్టీలకంటే కొంచం భిన్నంగా తన పార్టీ ఉంటుందని రజిని అన్నారు. తాను కేవలం పార్టీ అధినేతగా మాత్రమే ఉంటానని, చదువు, విజ్ఞానవంతుడైన వ్యక్తినే సీఎంను చేస్తానన్నారు. తనపై వచ్చిన ఊహాగానాలకు స్వస్తి చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు.
జయలలిత, కరుణానిధి మరణాల తర్వాత తమిళ రాజకీయాల్లో అస్థిరత ఏర్పడిందని రజనీ అన్నారు. రాజకీయాల్లోకి యువరక్తం రావాలన్నారు. పార్టీ, ప్రభుత్వంపై ఒకే వ్యక్తి పెత్తనం ఉండకూడదన్నారు సూపర్ స్టార్. ప్రభుత్వ వ్యవహారాల్లో పార్టీ అధ్యక్షుడి ప్రమేయం ఉండకూడదన్నారు. రాష్ట్రానికి సీఎం కావాలని తాను ఎప్పుడూ అనుకోలేదని, సీఎం పదవిపై తనకు వ్యామోహం కూడా లేదన్నారు. ప్రజల్లో మార్పు రానప్పుడు తాను వచ్చి కూడా ఏం చేయలేనన్నారు.
ఈయన రాజకీయాల్లోకి వస్తున్నానని బహిరంగంగా చెప్పి రెండేళ్లు దాటింది. అప్పటి నుంచి ఆయన అభిమానుల హడావుడి మినహా రాజకీయ పార్టీని ప్రకటించిందిలేదు. రజనీకాంత్ కంటే కాస్త వెనుక తానూ రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించిన కమలహాసన్ పార్టీని నెలకొల్పారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ తరఫున అభ్యర్థులను పోటీ చేయించారు. ఆశాజనకమైన ఓట్లను సంపాదించుకున్నారు. నటుడు రజనీకాంత్ మాత్రం ఇప్పటికీ పార్టీని ప్రకటించలేదు. అయితే తాజాగా ఆయన రాజకీయపరంగా వేగాన్ని పెంచారని చెప్పాలి. దీంతో రాజకీయ వర్గాల్లోనూ కదలిక వచ్చింది. త్వరలోనే రజనీకాంత్ చేసే ప్రకటనపై ఆసక్తిగా ఎదురుచూశారు.