Ramoji Rao: ఓడలు బండ్లు అవుతాయి.. బండ్లు ఓడలవుతాయి. పచ్చళ్ళ వ్యాపారంతో మొదలుపెట్టి ప్రచురణ రంగంలో అడుగు పెట్టారు రామోజీరావు. కాలం కలిసి రావడంతో మీడియా మొగల్ గా అవతరించారు. రాజ గురువుగా మారి రాజకీయాలనే శాసించారు. తెలుగుదేశం పార్టీ పుట్టేనాటికి కాంగ్రెస్ పార్టీ భ్రష్టు పట్టిన మాట వాస్తవమే. చేసే అరకొ ర మంచి పనులను కూడా అప్పట్లో చెప్పేందుకు చేతిలో మీడియా లేకుండా పోయింది. రామోజీ రాసేవన్ని నిజాలుగా మారిపోయాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో రాజ గురువు రామోజీ లీలలు అమాంతం పెరిగిపోయాయి. చంద్రబాబు ఇతోధికంగా సాయపడడంతో అతేంద్రియమైన శక్తిగా రామోజీరావు మారిపోయారు.
పెద్దమనిషి ముసుగులో రామోజీ ఒక మాయా ప్రపంచాన్నే సృష్టించగలిగారు. అందులో భాగమే మార్గదర్శి. రామోజీ అభివృద్ధికి అసలు సిసలైన మూల కారకం కూడా మార్గదర్శి. ప్రజల నుంచి చందాలను పోగుచేసి.. తన వ్యాపారాల్లో పెట్టుబడిగా మార్చుకున్న ఘనత రామోజీరావుది. చందాదారుల సొమ్ముతో అనుబంధ సంస్థల్లో అక్రమ పెట్టుబడులు పెట్టగలిగారు. ఉషా కిరణ్ లో 88.50 శాతం , ఉషోదయలో 44.55 శాతం పెట్టుబడులు పెట్టిన ఘనత రాజగురువుదే. దేశంలోనే అతిపెద్ద కార్పొరేట్ మోసం మార్గదర్శి చిట్ ఫండ్స్. అందుకే సిఐడి ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. పూర్తిస్థాయిలో ఆధారాలను సేకరించగలిగింది. మార్గదర్శి చిట్ ఫండ్స్ ఆర్థిక అక్రమాల కేసులు ఏ1 గా చెరుకూరి రామోజీరావు, ఏ2గా శైలజా కిరణ్ పై కేసు నమోదు చేశారు. చిట్ఫండ్ చట్టానికి విరుద్ధంగా చందాదారుల డబ్బులను మళ్లించి అనుబంధ సంస్థల్లో పెట్టిన పెట్టుబడులపై ఉక్కు పాదం మోపారు.
చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో రామోజీరావు ఆగడాలపై మరో చర్చ ప్రారంభమైంది. తదుపరి అరెస్టు రామోజీరావు దేనని ప్రచారం జరుగుతోంది. దీనిపై సీఐడీ స్పష్టమైన కసరత్తు జరుపుతున్నట్లు సమాచారం. మార్గదర్శిలో ఏయే అవకతవకలు జరిగాయని సిఐడి బలమైన శోధన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆదాయపు పన్ను శాఖ చట్టానికి వ్యతిరేకంగా అక్రమ నగదు లావాదేవీలు, మార్గదర్శి పేరిట చట్ట వ్యతిరేక ఆర్థిక లావాదేవీలు, ఖాతాదారులకు కోట్ల రూపాయల్లో బకాయిలు, బ్యాంక్ అకౌంట్ల నిర్వహణలో అక్రమాలు, చిట్ఫండ్ ఖాతాదారుల నుంచి అక్రమ డిపాజిట్లు, ఖాతాదారులకు తెలియకుండానే చిట్ నుంచి డిపాజిట్లుగా మార్పు, మ్యూచువల్ ఫండ్స్, ఇతర సంస్థల్లో పెట్టుబడులను సిఐడి గుర్తించినట్లు తెలుస్తోంది. చిట్ ఫండ్స్ చట్టాన్ని ఉల్లంఘించిన మార్గదర్శి చిట్ ఫండ్స్ పై సిఐడి 7 కేసులను నమోదు చేసింది. వాటిలో రెండు కేసుల్లో న్యాయస్థానంలో చార్జి సీట్లు కూడా దాఖలు చేసింది. అటు చందాదారులకు తెలియకుండా, న్యాయస్థానం కళ్ళు గప్పిన వైనాన్ని సైతం గుర్తించింది. వీటన్నింటిపై సిఐడి ఉక్కు పాదం మోపే పనిలో పడింది. చంద్రబాబు కేసు ఒక కొలిక్కి వచ్చిన తర్వాత.. తదుపరి ప్రక్రియ రామోజీరావు పైనేనని టాక్ నడుస్తోంది. రాజ గురువు రామోజీరావు జైలుకు వెళ్లడం ఖాయమని తేలుతోంది.