Chiranjeevi Political Step: ఏపీలో చిరంజీవి పొలిటికల్ రీ ఎంట్రీపై చర్చ ఆగడంలేదు. కొద్దిరోజుల కిందట చిరంజీవి ఆడియో సందేశం చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. చిరంజీవి నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’ సినిమాలో డైలాగే కానీ.. ఆయన ప్రస్తుతం ఉన్న సిట్యువేషన్ కు అతికినట్టు ఉండడంతో అంతటా ఇదే చర్చనీయాంశమైంది. ‘రాజకీయాలకు నేనే దూరమయ్యానే తప్ప.. రాజకీయాలు నా నుంచి దూరం కాలేదు’ అంటూ చిరంజీవి పలికే ఈ డైలాగ్ ఏపీ రాజకీయాలను షేక్ చేసింది. ఆ ఆడియో సందేశాన్ని స్వయంగా చిరంజీవే సోషల్ మీడియాలో విడుదల చేయడంతో బాగా వైరల్ అయ్యింది. రాజకీయ చర్చకు కారణమైంది.

మళయాళం రిమేక్ గా రూపొందిన గాడ్ ఫాదర్ చిత్రంలో చిరంజీవి పవర్ ఫుల్ రాజకీయ నాయకుడిగా కనిపించబోతున్నారు. పొలిటికల్, ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో తీసిన ఈ చిత్రం విజయదశమి సందర్భంగా అక్టోబరు 5న విడుదల కానుంది. అయితే చిరంజీవి తన ఆడియో సందేశం రిలీజ్ చేసిన నాడే కాంగ్రెస్ పార్టీ స్పందించింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా పీసీసీ డెలిగేట్ గా గుర్తించింది. 2027 వరకూ నియమిస్తూ సీడబ్ల్యూసీ ఎన్నికల విభాగం ఒక గుర్తింపు కార్డును జారీచేసింది. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం బాధ్యతలను చిరంజీవికి అప్పగించారు. దీంతో పొలిటికల్ గా చర్చనీయాంశమైంది. ప్రస్తుతం చిరంజీవి యాక్టివ్ రాజకీయాల్లో లేరు. కాంగ్రెస్ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉన్నారు.
2009లో పీఆర్పీని స్థాపించి ఎన్నికల్లో పోటీచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 18 అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్నారు. తరువాత అనూహ్యంగా పీఆర్పీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. రాజ్యసభ సభ్యుడితో పాటు కేంద్ర మంత్రిగా కూడా పదవి దక్కించుకున్నారు. 2014వరకూ పదవిలో కొనసాగారు. కానీ తదనంతర పరిణామాలతో ఆయన కాంగ్రెస్ కు దూరమయ్యారు. రాజకీయాలు తనకు సూటు కావని తేల్చుతూ సినిమాల్లో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఎప్పుడూ ప్రకటించలేదు. తాజాగా పీసీసీ డెలిగేట్ గా కాంగ్రెస్ నియామకంపై కూడా స్పందించలేదు. తాను కాంగ్రెస్ లో కొనసాగుతున్నానని కానీ.. బయటకు వచ్చానని కానీ స్పష్టతనివ్వడం లేదు. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం చిరంజీవి తమతోనే ఉన్నట్టు భావిస్తోంది.

అయితే అటు గాడ్ ఫాదర్ సినిమా డైలాగుపై చిరంజీవి స్పందించారు. తన ఆడియో మెసేజ్ ఇంతలా చర్చకు కారణమవుతుందని తాను ఊహించలేదన్నారు.అయితే కాంగ్రెస్ పార్టీ తాజా ఆహ్వానంపై ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే చిరంజీవి సినీ పరిశ్రమకు గాడ్ ఫాదర్ గా నిలిచారు. గతంలో పలుసార్లు సినీ పరిశ్రమ సమస్యలపై సీఎం జగన్ ను కలిశారు. ఆ సమయంలో ఆయన వైసీపీ తరుపున రాజ్యసభకు వెళ్లనున్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దానిని ఖండిస్తూ తాను రాజకీయాలకు దూరమని.. సినిమాలపై ఫోకస్ పెట్టానని కూడా చిరంజీవి చెప్పుకొచ్చారు. అయితే చిరంజీవి ఫ్యాన్స్ మాత్రం జనసేన వైపు మొగ్గుచూపుతున్నారు. చిరంజీవి ప్రత్యక్షంగా కాకపోయినా.. పరోక్షంగా తమకు మద్దతు తెలుపుతారని జనసేన నేతలు చెబుతున్నారు. అయితే తన నుంచి రాజకీయాలు దూరం కాలేదన్న సంకేతాలు ద్వారా ఆయన పరోక్ష పాత్ర పోషిస్తారని.. అది కూడా జనసేనకు పనిచేస్తారన్న ప్రచారమైతే పొలిటికల్ సర్కిల్లో ఉంది.