Chandrababu – Kasani : ‘చంద్రబాబు మరో వెన్నుపోటు పొడిచాడు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయాలని రెండు సంవత్సరాలుగా గ్రౌండ్ లో ప్రిపేర్ చేసిన తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిని తన స్వార్థ ప్రయోజనాల కోసం నిండా ముంచేశారు. తను జైల్లో ఉండగా పోటీచేస్తే తన మనుగడకే ప్రమాదం అని.. బీజేపీకి ఇన్ డైరెక్టుగా సపోర్టు చేయాలని కాసాని గొంతు కోసేశాడు. తెలంగాణలో పోటీచేసి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలన్న కాసాని ఆశలపై నీళ్లు చల్లాడు.
తెలంగాణ ఎన్నికల్లో టిడిపి పోటీ నుంచి తప్పుకోవడం పెను ప్రకంపనలకు దారితీస్తోంది. సాక్షాత్ తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఏకంగా రాజీనామా ప్రకటించారు. పార్టీ హైకమాండ్ నిర్ణయాన్ని తప్పుపడుతూ ఈ నిర్ణయం తీసుకున్నారు. గత కొద్దిరోజులుగా పార్టీని యాక్టివ్ చేయడంలో జ్ఞానేశ్వర్ సక్సెస్ అయ్యారు. ఇందుకుగాను సొంత డబ్బులు ఖర్చు పెట్టారు. అయితే చంద్రబాబు జైల్లో ఉండగా.. తన రాజకీయ ప్రయోజనాల కోసం.. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకూడదని టిడిపి నిర్ణయం తీసుకుంది. దీంతో మనస్థాపానికి గురైన జ్ఞానేశ్వర్ పార్టీకి రాజీనామా ప్రకటించారు.
2014 తర్వాత తెలుగుదేశం పార్టీ తెలంగాణలో బలహీనంగా మారినా.. పార్టీ కార్యవర్గంతో పాటు కార్యాలయాన్ని నడిపిస్తూ వచ్చారు. చాలా రోజులపాటు ఎల్. రమణ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగారు. ఆయన అధికార బీఆర్ఎస్ లో చేరిన తర్వాత చాలా రోజులపాటు చిన్న స్థాయి నేతలను పార్టీ నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. ఈ నేపథ్యంలో తెరపైకి వచ్చిన కాసాని జ్ఞానేశ్వర్ కు చంద్రబాబు బాధ్యతలు కట్టబెట్టడంతో.. ఆయన రెట్టింపు ఉత్సాహంతో పని చేశారు. ఖమ్మం తోపాటు హైదరాబాదులో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేశారు. తనతో పాటు కొద్దిమందినైనా గెలిపించుకుని తెలంగాణలో టిడిపిని యాక్టివ్ చేద్దామని జ్ఞానేశ్వర్ ఆలోచించారు. తాను అనుకున్నది కాకపోవడంతో పునరాలోచనలో పడ్డారు. పార్టీకి దూరం కావడమే మేలని డిసైడ్ అయ్యారు.
చంద్రబాబు అరెస్టు తర్వాత రాజకీయాలు శరవేగంగా మారాయి. తెలంగాణ టిడిపి విషయంలో బాలకృష్ణ కొద్దిరోజులపాటు లీడ్ రోల్ తీసుకున్నారు. తొలుత 85 సీట్లలో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు. ఆ తరువాత ఆ సంఖ్యను 119 స్థానాలకు పెంచారు. కానీ చంద్రబాబుతో సమావేశం అనంతరం సీన్ మారింది. చంద్రబాబు పోటీ చేయవద్దని ఆదేశించినట్లు కాసాని జ్ఞానేశ్వర్ ప్రకటించారు. అయినా సరే బిజెపి, జనసేనతో సీట్ల సర్దుబాటు ఉంటుందని జ్ఞానేశ్వర్ భావించారు. కానీ అటువంటిదేమీ లేకపోవడంతో మనస్థాపానికి గురయ్యారు. పార్టీని వీడడమే మేలని భావించారు.
అసలు చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం పై భిన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ నిర్ణయం బిజెపి కోసమా? రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ కోసమా? అన్నది మాత్రం తెలియడం లేదు. ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు అరెస్టు వెనుక బిజెపి పెద్దలు ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఇన్ని రోజులైనా చంద్రబాబుకు ఉపశమనం కలగకపోవడం వెనుక వారే ఉన్నారని టిడిపి శ్రేణులు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. అందుకే ఇప్పుడు టిడిపి పోటీ నుంచి తప్పుకున్న బిజెపికి ఓటు వేసే పరిస్థితి లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు తెలంగాణలో అనూహ్యంగా పుంజుకున్న కాంగ్రెస్ పార్టీకి టిడిపి ఓటు బ్యాంకు టర్న్ అయితే.. అటు బి ఆర్ ఎస్ తో పాటు ఇటు బిజెపికి దెబ్బ పడినట్లేనని.. అందుకే చంద్రబాబు జైలు నుంచే మాస్టర్ స్ట్రోక్ విసిరారని టాక్ నడుస్తోంది. అయితే దీనికోసం తెలంగాణలో బలోపేతం అవుతున్న పార్టీని పావుగా పెట్టారని విమర్శలు వినిపిస్తున్నాయి. కాసాని జ్ఞానేశ్వర్ సైతం అధినేత తీరును తప్పుపడుతూ ఏకంగా రాజీనామా ప్రకటించడం విశేషం.
చంద్రబాబు వెన్నుపోటుకు మరో నేత కాసాని కూడా బలయ్యారని విమర్శలు వినిపిస్తున్నాయి.