
ఏపీలో ఇప్పుడు తెలుగుదేశం పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే. రోజురోజుకూ పట్టు కోల్పోతూ ఉనికి పాట్లు పడుతోంది. ఈ కష్టాన్ని అధిగమించేందుకు అధినేత చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ.. ఏ మాత్రం అవకాశం చిక్కట్లేదు. ఎదుర్కొన్న ప్రతి ఎన్నికలోనూ పరాభవమే ఎదురవుతుండడంతో.. ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో పడిపోయారు. ఇక, వచ్చే ఎన్నికల్లో గనక ఓడిపోతే.. కోలుకోవడం కష్టమే అన్న భయం కూడా బాబును వెంటాడుతోంది. అందుకే.. ఎలాగైనా 2024లో గెలిచి తీరాలని ప్రయత్నిస్తున్నారు. అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్నీ అనుకూలంగా మలుచుకునేందుకు కృషి చేస్తున్నారు.
అయితే.. బాబుకు ఒక్క విషయం మాత్రం పూర్తిగా అర్థమైంది. అదేమంటే.. వచ్చే ఎన్నికల్లో సింగిల్ గా పోటీ చేస్తే గెలుపు అసాధ్యమని టీడీపీ అధినేత అంచనాకు వచ్చారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అందుకే.. ఎలాగైనా బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు. విభజన చట్టం అమలు విషయంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతున్నా.. విశాఖస్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరిస్తున్నా.. బీజేపీని ఒక్క మాటకూడా అనకపోవడానికి కారణం ఇదేనని అంటున్నారు. అంతేకాదు.. సెకండ్ వేవ్ నియంత్రణలో నరేంద్ర మోడీ విఫలమయ్యారని దేశం మొత్తం విమర్శలు గుప్పించినా.. చంద్రబాబు పల్లెత్తు మాట అనలేదు.
అంతేకాదు.. ఆ మధ్య మహానాడు వేదిక మీద నుంచి బీజేపీకి స్నేహ హస్తం కూడా చాచారు. ఈ విధంగా బీజేపీతో దోస్తీ కట్టేందుకు తెగ తాపత్రయ పడుతున్నారు బాబు. అయితే.. ఇప్పటి వరకు వన్ సైడ్ లవ్ మాదిరిగానే ఉంది వ్యవహారం. బాబు ఫ్రెండ్షిప్ చేద్దాం రా.. అని పిలుస్తున్నా, బీజేపీ మాత్రం వేచి చూసే ధోరణిలోనే ఉంది. ఎందుకంటే.. టీడీపీ పరిస్థితి దారుణంగా తయారైన నేపథ్యంలో.. ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా ఒరిగేది ఏమీ ఉండదనే భావనలోనే కాషాయ నేతలు ఉన్నట్టు సమాచారం. పైగా ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నందున, అప్పటి పరిస్థితులను బట్టి.. నిర్ణయం తీసుకుందామనే యోచనలో ఉన్నట్టుగా అర్థమవుతోంది.
బీజేపీ చూపు మాత్రం వైసీపీ వైపే ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఈ పార్టీతో జత కట్టడం ద్వారా.. బలం పెంచుకోవాలని చూస్తున్నట్టు సమాచారం. ఈ కారణంగా రెండు పార్టీలకూ సమాన దూరంలో ఉన్నట్టుగా వ్యవహరిస్తోంది. మరి, జగన్ ఎంత వరకు బీజేపీతో చేయి కలుపుతాడన్నది ప్రశ్న. పైగా.. అధికారంలో ఉన్న పార్టీ, ఇప్పటి వరకు పెద్దగా వ్యతిరేకత లేని పార్టీ కాబట్టి.. బీజేపీతో పొత్తు పెట్టుకుంటాడా? అన్నది ప్రశ్న. ఇప్పటి వరకైతే ఉన్న అవసరాల దృష్ట్యా కేంద్రంతో సఖ్యత కొనసాగిస్తున్నారు జగన్. బీజేపీ కూడా జగన్ కేసుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. మరి, ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉంటుందన్నది సస్పెన్స్.
అయితే.. చంద్రబాబు మాత్రం బీజేపీ దోస్తీని చాలా బలంగా కోరుకుంటున్నారు. అడిగిన సీట్లు ఇస్తాం, మాతో చేయి కలపండి అని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రితో చంద్రబాబు తాజాగా వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తోంది. కాషాయ పార్టీ కోసం టీడీపీ అధినేత ఎంతగా అర్రులు చాస్తున్నారో ఇదే స్పష్టం చేస్తోంది. అయితే.. జగన్ నో అంటేనే బాబుకు అవకాశం ఉండడంతో.. బాబు ఆశలన్నీ జగన్ మీదనే పెట్టుకున్నారని అంటున్నారు.